DailyDose

విశాఖకు భారీ తుఫాను హెచ్చరిక-తాజావార్తలు

Cyclone Warning To Vizag-Telugu Breaking News Roundup Today

* తుఫాన్ వచ్చే ముందు ఎంత నిశ్శబ్ధం అలుముకుంటుందో.. అలాంటి వాతావరణం విశాఖలో కనిపిస్తోంది. అప్పటి వరకు భగభగ మండిన సూర్యుడు ఒక్కసారిగా చల్లగా మారిపోయాడు. ఈదులు గాలులుతో నగరం అంతా ప్రశాంతంగా కనిపిస్తోంది. ఇది ఆహ్లాదం కాదు.. ముందస్తు భారీ హెచ్చరిక. అవును..! ఏపీకి తుఫాన్ గండం పొంచి ఉంది. రాష్ట్రం వైపు భీకర తుఫాన్ దూసుకువస్తోంది. బంగాళాఖాతంలో అండమాన్‌కు దక్షిణ దిశగా ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారబోతోందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల 8వ తేదీ నాటికి ఆ అల్పపీడనం మరింత బలపడి తీవ్రమైన తుఫాన్‌గా మారుతుందని అభిప్రాయపడుతోంది. ఎంఫాన్‌ అన్న పేరు పెట్టుకున్న ఈ తుఫాన్.. ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌పై భారీ ప్రభావం చూపుతుందని అధికారులు చెబుతున్నారు. యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్ (ఈసీఎండబ్ల్యూఎఫ్‌) ప్రకారం.. ఈ నెల 13వ తేదీ నాటికి మయన్మార్ వద్ద తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఆ తుఫాన్ ఎఫెక్ట్‌తో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ముందస్తు జాగ్రత్తగా మత్స్యకారులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. చేపల వేటకు వెళ్లొద్దని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర, ఒడిసా తీర ప్రాంత జిల్లాల్లో వచ్చే 48 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదు అవుతుందని పేర్కొన్నారు.

* దేశవ్యాప్తంగా కరోనావైరస్‌ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. దేశంలో సోమవారం ఉదయానికి 42వేల కేసులు నమోదుకాగా 1373 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం నమోదైన కేసుల్లో దాదాపు 52శాతం కేవలం దిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. ఈ సందర్భంలో దిల్లీ, ముంబయి వంటి నగరాల్లోని ప్రజలు లాక్‌డౌన్‌ నిబంధనలు కచ్చితంగా పాటించకపోవడం వైరస్‌ తీవ్రత పెరగడానికి ఓ కారణమని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హార్షవర్ధన్‌ అభిప్రాయపడ్డారు.

* దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పటికీ మహారాష్ట్రకు చెందిన ఓ మార్కెటింగ్‌ ఉద్యోగి, వైద్యురాలు వివాహంతో ఒక్కటయ్యారు. వీరి వివాహానికి స్థానిక పోలీసులే పూనుకుని అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసు అధికారి స్వయంగా కన్యాదానం చేశారు. పోలీసు అధికారుల సహకారం మరువలేనిది… మేము వారికి జీవితాంతం రుణపడి ఉంటాం అని ఆ జంట, వారి తల్లిదండ్రులు కృతజ్ఞత వ్యక్తం చేశారు.

* పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ‘గిల్గిట్‌ బాల్టిస్థాన్‌’ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించాలన్న పాకిస్థాన్‌ సుప్రీం కోర్టు తీర్పుపై భారత ప్రభుత్వం తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ దేశ రాయబారికి దౌత్యపరమైన లేఖ(డిమార్ష్‌)ను అందజేసింది. అక్రమంగా ఆక్రమించిన కశ్మీర్‌లోని ప్రాంతాల్ని వెంటనే విడిచి వెళ్లాలని ఈ సందర్భంగా పాక్‌కు స్పష్టం చేసింది.

* 12.8 శాతం కరోనా వైరస్‌ మరణాల రేటుతో పశ్చిమ బెంగాల్‌ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ఆ రాష్ట్రంలో పర్యటించిన ఇంటర్‌ మినిస్టీరియల్‌ సెంట్రల్‌ టీం పేర్కొంది. సోమవారం కేంద్ర బృందం అధ్యక్షులు అపూర్వ చంద్ర.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. రెండు వారాల పాటు పశ్చిమ బెంగాల్‌లో పర్యటించి కరోనా పరిస్థితులపై సమీక్షించిన కేంద్ర బృందం పట్ల ప్రభుత్వ వైఖరిని ఆయన తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకరించలేదని తెలిపారు. కరోనా కేసులపై ప్రభుత్వం విడుదల చేస్తున్న హెల్త్‌ బులిటెన్‌లోని కేసుల సంఖ్యకు, కేంద్ర ప్రభుత్వానికి చెబుతున్న సంఖ్యకు పొంతన లేదని పేర్కొన్నారు.

* గుజరాత్‌లోని సూరత్‌లో పోలీసులు, వలస కార్మికుల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో పోలీసులు టియర్‌గ్యాస్‌ ప్రయోగించారు. తమను స్వస్థలాలకు పంపాలని కోరుతూ వందల సంఖ్యలో కార్మికులు సూరత్‌లోని వరేలి మార్కెట్ ప్రాంతంలో ఆందోళనకు దిగారు. వారికి సర్దిచెప్పేందుకు అక్కడికి చేరుకున్న పోలీసులపై కూలీలు ఒక్కసారిగా రాళ్లతో దాడి చేశారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఆందోళనకారులపైకి టియర్‌గ్యాస్‌ ప్రయోగించారు. టెక్స్‌టైల్‌, డైమండ్ పరిశ్రమల్లో పనిచేసేందుకు వేలాది మంది ఇతర రాష్ట్రాల నుంచి సూరత్‌కు వలస వస్తుంటారు. అయితే లాక్‌డౌన్‌తో పరిశ్రమలు మూతపడటంతో పనులు లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తమను స్వస్థలాలకు పంపాలని కార్మికులు ఆందోళనకు దిగారు. ఇప్పటి వరకు సూరత్‌లో కార్మికులు తమ సొంత గ్రామాలకు పంపాలని నాలుగు సార్లు ఆందోళన చేపట్టారు.

* గర్భిణితో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియని వైద్యులుంటారా అంటూ తెలంగాణ హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మహిళ కాన్పు కోసం 200 కి.మీ. తిరిగి బిడ్డతోసహా ప్రాణాలు కోల్పోయిన వైనంపై న్యాయవాది కిశోర్‌ కుమార్‌ హైకోర్టుకు రాసిన లేఖను సుమోటో పిల్‌గా స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. కాన్పు కోసం వచ్చిన మహిళ కన్నా అత్యవసరం ఇంకేముంటుందని ప్రశ్నించింది. అత్యవసర సేవలకు ఆస్పత్రులకు వెళ్లేవారికి వైద్యసేవలు అందించేలా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్లాలి? ఎలా వెళ్లాలి? అనే అయోమయ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రజలను ఆస్పత్రులకు చేర్చేలా అంబులెన్సులు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వానికి సూచించింది. ఘటనపై ఈనెల 20వ తేదీలోగా కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.