వేసవిలో తక్షణ శక్తినిచ్చే పదార్థాల్లో ఒకటి కిస్మిస్. పాయసంలో, మిఠాయిల్లో పంటికిందికి వచ్చి తీపిని పంచే ఎండుద్రాక్షను నమిలి మింగేస్తే.. పొట్టలోకి పోషకాలు చల్లగా జారుకుంటాయి.
ఎండుద్రాక్షలో కాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, జింక్, ఫ్లోరైడ్ ఉంటాయి. పొటాషియం, ఫోలిక్ యాసిడ్ పాళ్లూ ఎక్కువే! యాంటీ ఆక్సిడెంట్లతో పాటు కొద్దిగా విటమిన్ సి కూడా ఉంటుంది. నల్ల ఎండుద్రాక్షలో పోషకాలు ఎక్కువ! దీనిని తరచూ తీసుకుంటే మంచిది. దీంట్లో ఉండే రిస్‌వెరట్రాల్ మందుగా పనిచేస్తుంది. ఆల్జీమర్స్ నియంత్రణకు సహకరిస్తుంది. మెదడుకు చురుకుదనాన్నిస్తుంది. గుండె సమస్యలు రాకుండా చేస్తుంది. రక్తప్రసరణ సాఫీగా జరిగేందుకు తోడ్పడుతుంది.
* అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వాళ్లకు ఎండుద్రాక్ష మేలు చేస్తుంది.
* మొలలు ఉన్నవాళ్లు అడపాదడపా అయిదు నుంచి పది ఎండుద్రాక్షలను పేస్టులా చేసి నెయ్యితో కలిపి తీసుకుంటే విరేచన సమస్య ఉండదు.
* ఎండుద్రాక్షను రాత్రి నానబెట్టి.. ఉదయం తింటే మలబద్ధకం తగ్గుతుంది. మూత్రంలో మంట తగ్గుతుంది.
* రంజాన్ మాసంలో ఉపవాసం తర్వాత తక్షణ శక్తి కోసం ఎండుద్రాక్షలను తీసుకుంటారు.
* ఆహారం సరిగా తినని పిల్లలకు ఎండుద్రాక్షలను ఇస్తే ఆరోగ్యంగా పెరుగుతారు.
* వీటిని లడ్డూల్లా చుట్టుకుంటే.. పిల్లలు ఇష్టంగా తింటారు.
* లావుగా ఉన్నవాళ్లు ఎండుద్రాక్షను తినకూడదంటారు కానీ అది అపోహ మాత్రమే. మితంగా తీసుకోవచ్ఛు
* మోతాదుకు మించి కిస్మిస్ తింటే ఒంటికి నీరు పట్టడం, కడుపులో మంట, అజీర్తి, జలుబు, పళ్లు పుచ్చిపోవడం.. లాంటి సమస్యలు వస్తాయి.