కథానాయకులకే కథానాయకుడిగా, తెరపై మెరిసే అగ్ర తారల్ని మించిపోయే స్థాయిలో ఆయన ఇమేజ్ కనిపించిందంటే దాసరి ప్రత్యేకత ఏమిటో చెప్పొచ్చు. అందుకే తెలుగు సినిమాని దాసరికి ముందు… దాసరి తరువాత అని విడదీసి చూస్తుంటారు. అప్పటిదాకా కథానాయకుల వెనకాలే కాన్వాయ్‌లు చూడటం తెలుసు. కానీ దాసరి విజయాల పరంపర తరువాత ఆయన మద్రాసు నుంచి హైదరాబాద్ వస్తున్నాడంటే విమానంలో డజను కార్లతో ఓ కాన్వాయ్ సిద్ధంగా ఉండేదంటే ఆ వైభవం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
మేరునగధీరుల్లాంటి ఎంత మంది దర్శకులున్నా… అపురూపమైన ఎన్నెన్నో చిత్రరాజాలు తీసినా… దర్శకుడికి స్టార్ హోదా తీసుకొచ్చి, కెప్టెన్ కుర్చీకి ఓ కొత్త కళని తీసుకొచ్చిన ఘనత మాత్రం నిస్సందేహంగా దాసరిదే. అందుకే ఆయన పరిశ్రమకి ‘గురువుగారు’ అయ్యారు. సినీ పరిశ్రమలో ఎవరికి ఏ సమస్య వచ్చినా గురువుగారి తలుపు తట్టడమే తెలుసు. అందరికీ ఓ పెద్దదిక్కులాగా మెలిగిన గురువుగారు ఇక లేరన్న విషయాన్ని తెలుగు సినిమా వర్గాలు ఇప్పటికీ జీర్ణించుకోలేపోతున్నాయి.
కథానాయకులకే కథానాయకుడిగా, తెరపై మెరిసే అగ్ర తారల్ని మించిపోయే స్థాయిలో ఆయన ఇమేజ్ కనిపించిందంటే దాసరి ప్రత్యేకత ఏమిటో చెప్పొచ్చు. అందుకే తెలుగు సినిమాని దాసరికి ముందు.
తెలుగు సినిమా కథని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుడు దాసరి. ఆయన సినిమాల్లో సామాన్యుడే కథానాయకుడు. వారి కష్టాలే కథలు. ఈతి బాధలే కథనం. అందుకే ఆయన సినిమాలు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొన్నాయి. మా సమస్యలతో సినిమాలు తీసే దర్శకుడు అంటూ దాసరిని అభిమానించడం మొదలుపెట్టారు. సమస్యలతో సినిమా అంటే డాక్యుమెంటరీలనే ఊహిస్తాం. కానీ వాటిలోనూ తనదైన శైలిలో వాణిజ్యాంశాల్ని జోడించి సినిమాలు తీశారు దాసరి. సమాజంలో అవినీతి, మహిళలపై చిన్నచూపు, అమ్మ ప్రాధాన్యత, బంధాలు, అనుబంధాలు… ఇలా జీవితాల్లోని కోణాల్నే వెండితెరపై స్పృశించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్‌లాంటి ఉద్ధండుల సినీ జీవితాల్ని మలుపు తిప్పేలా చిత్రాల్ని తీసిన ఘనత ఆయనది. తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ పలు చిత్రాలు తెరకెక్కించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొన్నారు. సినిమా నిర్మాణంతో పాటు, టెలివిజన్ రంగంలోనూ నిర్మాతగా, రచయితగా, దర్శకుడిగా రాణించారు.
పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో 1944 మే 4న సాయిరాజు, మహాలక్ష్మి దంపతులకి జన్మించిన దాసరి నారాయణరావు 1973లో హాస్యనటుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తరువాత రచయితగా, సహాయ దర్శకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, పంపిణీదారుడిగా ప్రతి విభాగంలోనూ రాణించారు. ఆయనకి ఇద్దరు కుమారులు తారక ప్రభు, అరుణ్ కుమార్‌తోపాటు ఒక కుమార్తె ఉన్నారు. సుదీర్ఘమైన దాసరి సినీ ప్రయాణంలో అడుగడుగునా తోడునీడగా నిలిచిన భార్య దాసరి పద్మ 2011లో మరణించారు.