Health

50వేలకు చేరువలో ఇండియా కరోనా కేసులు-TNI బులెటిన్

TNILIVE Corona Bulletin-India Close To 50K COVID19 Cases

* లాక్‌డౌన్‌ పొడిగిస్తూనే మందుబాబులకు గుడ్‌న్యూస్ చెప్పింది సర్కార్‌.. దీంతో.. వివిధ రాష్ట్రాల్లో లిక్కర్ అమ్మకాలు మొదలయ్యాయి.. తెలంగాణలో అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోయినా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఉదయం 11 గంటల నుంచి ఈమద్యం అమ్మకాలు ప్రారంభం అయ్యాయి… అయితే, లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి మందు లేక అల్లాడిపోతున్న మందుబాబులు.. ఉదయాన్ని రోడ్లపైకి వచ్చేశారు.. వైన్స్‌ల దగ్గర భౌతిక దూరాన్ని పాటించేలా సూచిస్తూ గీసిన సర్కిళ్లలో నిలబడి.. మద్యం కోసం వేచిచూస్తున్నారు. ఓ వైపు ఏపీ సర్కార్.. మద్యం ధరలను 25 శాతం పెంచినా.. ఆ ఎఫెక్ట్‌ మాత్రం ఎక్కడా కనిపించడంలేదు. అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి.. ఏ వైన్‌ షాపు ముందు చూసినా భారీ క్యూలైన్లు దర్శనమిస్తున్నారు. అయితే, రెడ్‌జోన్లు, కంటైన్మెంట్ జోన్లలో మాత్రం అమ్మకాలకు అనుమతి లేకపోవడంతో.. మిగతా ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. మరోవైపు.. కొన్ని ప్రాంతాల్లో వైన్స్‌ షాపుల దగ్గరకు వచ్చిన మందుబాబులను పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు.. దీంతో.. ఏ షాపు తెరుస్తారు. ఏ షాపు ఓపెన్‌కు నోచుకోదు అనేదానిపై క్లారిటీ ఇవ్వనున్నారు అధికారులు. కాగా, ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే మద్యం విక్రయాలు కొనసాగనున్నాయి.

* ప్రాణాంతక కరోనా వైరస్‌(కోవిడ్‌-19) సోకి దాదాపు లక్ష మంది అమెరికన్లు మరణించే అవకాశం ఉందని తాను విశ్వసిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. అయితే మహమ్మారిని కట్టడి చేసేందుకు ఈ ఏడాది చివరినాటికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌ నియంత్రణ, ఆర్థిక వ్యవస్థ పురుద్ధరణ, వ్యాక్సిన్‌ తయారీ తదితర అంశాల గురించి ట్రంప్‌ ఆదివారం ఫాక్స్‌ న్యూస్‌తో మాట్లాడారు. ప్రాణాంతక వైరస్‌ పుట్టుకకు కారణమైన చైనా వల్లే ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి వెళ్లిందని ఈ సందర్భంగా ఆయన మరోసారి మండిపడ్డారు.

* గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో లాక్‌డౌన్‌కు సడలింపులు అమల్లోకి వచ్చిన తొలిరోజే కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కరోనా పాజిటివ్‌ కొత్త కేసులు వేగంగా ప్రబలితే మరోసారి లాక్‌డౌన్‌ తప్పదని స్పష్టం చేసింది. సోమవారం ఒక్కరోజే 2553 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయని, 72 మంది మరణించారని పేర్కొంది. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 42,000 దాటగా, కోవిడ్‌ రికవరీ రేటు 27 శాతానికి పెరగడం ఊరట కల్పించింది. ఇక రెడ్‌జోన్లు, కంటైన్మెంట్‌ జోన్లలో ఎలాంటి సడలింపులూ ఉండవని పేర్కొంది.

* వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలో ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు డీఎంహెచ్‌వో లలితా దేవి వెల్లడించారు. ఏప్రిల్‌ 21న పదేళ్ల బాలికకు కరోనా పాజిటివ్‌గా తేలిందనీ.. దీంతో ఆమెను చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. అయితే, కుమార్తెతో పాటు తల్లి కూడా గాంధీ ఆస్పత్రికి వెళ్లారని వివరించారు. తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో బాలిక తల్లికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని డీఎంహెచ్‌వో వెల్లడించారు.

* భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి ఉద్ధృతంగా కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 2573 కొత్త కేసులు; 83 మరణాలు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది . ఈ సాయంత్రం 5గంటల వరకు దేశ వ్యాప్తంగా మొత్తం 42,836 కేసులు నమోదైనట్టు తెలిపింది. వీరిలో 11762 మంది కోలుకోగా.. 1389 మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్రం తెలిపింది.