కరోనా వైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో దాదాపు 45 రోజులు తర్వాత, బుధవారం దుకాణాలు తెరుచుకోవటంతో మద్యం ప్రియుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. చాలా రోజుల తర్వాత ‘చుక్క’ దొరకబోతుందన్న సంతోషంతో మందుబాబులు ఉదయం నుంచే వైన్స్ ముందు క్యూ కట్టారు. ఎండను కూడా లెక్కచేయలేదు. మద్యం దొరికే వరకు ఇంటికి వెళ్లేది లేదని తేల్చి చెబుతూ క్యూ లైన్లో నిల్చున్నారు. ఒక్కో వైన్ షాపు వద్ద రెండు, మూడు క్యూలైన్లు దర్శమించాయి. ఇక చాలా రోజుల తర్వాత చుక్క దొరకడంతో మందుబాబులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. పలు చోట్లు మద్యం బాటిళ్లు పట్టుకొని ఆనందంతో చిందులేశారు. పలు వైన్స్ షాపులకు పూల మాల వేసి కొబ్బరి కాయలు కొట్టారు. ఇక ఒక చోట అయితే ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో ప్రకారం.. కనకదుర్గ వైన్స్ దగ్గర సీఎం కేసీఆర్ చిత్రపటానికి పూల మాలవేసి పాలాభిషేకం చేశారు. అనంతరం జై కేసీఆర్ అంటూ మందుబాబు నినాదాలు చేశారు. అయితే ఇది తెలంగాణలోని ఏ ప్రాంతంలో జరిగిందో వివరాలు తెలియరాలేదు.
కాగా, తెలంగాణ వ్యాప్తంగా బుధవారం ఉదయం 10 గంటలకు మద్యం షాపులు తెరుచుకున్న విషయం తెలిసిందే. వినియోగదారులు భౌతికదూరం పాటిస్తూ.. క్యూ లైన్లలో ఉన్నారు. ధరలు పెంచినా అమ్మకాల్లో మాత్రం తేడా కనిపించలేదు. పైగా మళ్లీ వైన్ షాపులు మూసివేస్తారోనని ఎక్కువగానే మద్యం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. పలు చోట్ల మహిళలు కూడా మద్యం కోసం లైన్లలో వేచి ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని కొండాపూర్, పంజాగుట్ట, మాదాపూర్, ఫిలింనగర్, రాయదుర్గం, హైటెక్‌సిటీలో మద్యం కోసం మహిళలు, సాఫ్ట్‌వేర్ యువతులు క్యూ కట్టి మద్యం కొనుగోలు చేశారు.