Fashion

మీ పెళ్లి నవంబరులోనే!

మీ పెళ్లి నవంబరులోనే! - Indian Weddings Postponed Till November Due To COVID19

పెళ్లిళ్లు లేవు. పేరంటాలు లేవు. అన్ని శుభకార్యాలకు కరోనాతో ‘లాక్‌’ పడింది. సాధారణంగా ఎక్కువ ముహూర్తాలు ఉండే వేసవి కరిగిపోతోంది. ఆ తరువాత మౌఢ్యమి. ఈ సమయంలో శుభకార్యాలకు ఎక్కువమంది ఇష్టపడరు. దీంతో ఓ ఇంటివారయ్యేందుకు ఆరాటపడుతున్న బ్యాచ్‌లర్‌ బాయ్స్‌ మరికొంత కాలం ఆగాల్సిందే. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు లేక ఇప్పటికే ఫంక్షన్‌ హాళ్లు 43 రోజులుగా మూతపడ్డాయి. ఫంక్షన్‌హాళ్లకు లాక్‌డౌన్‌ నుంచి వెసులుబాటు ఇచ్చే అవకాశం లేకపోవడంతో వీటిపై ఆధారపడ్డ పూజారులు, ఫొటో, వీడియోగ్రాఫర్లు, వంటవారి జీవితాలు అయోమయంలో పడ్డాయి.
***వాతావరణ అనుకూలత, పనులు తక్కువగా ఉండటం, విద్యాసంస్థలకు సెలవుల పరంగా చూస్తే చైత్ర, వైశాఖ మాసాలు వివాహ శుభకార్యాలకు అనుకూలం. మార్చి 25 నుంచి ఏప్రిల్‌ 23తో చైత్ర మాసం ముగిసింది. ఆ మాసంలో మంచి ముహూర్తాలు ఉండగా, లాక్‌డౌన్‌ కారణంగా శుభకార్యాలు జరగలేదు. అప్పటి కే కుదుర్చుకున్న పెళ్లిళ్లు కూడా వాయిదా పడ్డాయి. ఏప్రిల్‌ 24నుంచి ప్రారంభమైన వైశాఖ మాసం మే 22తో ముగియనుంది. కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌కు మినహాయింపులు ఇచ్చి.. కొన్నింటికి సడలింపులు ఉన్నా, శుభకార్యాలపై మాత్రం ఆంక్షలుంటాయి. మే 23నుంచి జూన్‌ 21 వరకు జేష్ఠ మాసం. ఈ మాసంలో ముహూర్తాలు తక్కువ. అందులోనూ మే 29 నుంచి జూన్‌ 8 వరకు శుక్ర మౌఢ్యమి ఉంది. జేష్ఠ మాసంలో ఇంట్లో జేష్ఠులకు వివాహాలు చేయడానికి ఎవరూ ఇష్టపడరు. జూన్‌ 22నుంచి జూలై 20 వరకు ఆషాడ మాసం. ఈ నెలలో పెళ్లిళ్లే ఉండవు. ఇక శ్రావణ మాసం (జూలై చివరి వారం, ఆగస్టు)లో కుదిరితే కొందరు పెళ్లిళ్లు చేసినా, వర్షాలు కురిసి రైతులు వ్యవసాయపనుల్లో నిమగ్నమవడంతో పాటు సెలవులు ముగిసి విద్యా సంస్థలు కూడా ప్రారంభమవుతాయి. దీంతో చాలా మంది పెళ్లిళ్లు చేయడానికి సుముఖత చూపరు. భాద్రపదం, పుష్య మాసాలు శూన్య మాసాలు. ఈ మాసాల్లో శుభకార్యాలు చేయరు. కార్తీకం, మార్గశిరం అంటే నవంబరు, డిసెంబరు నెలల్లో కొన్ని ముహూర్తాలు ఉండటంతో అప్పటి వరకు జిల్లాలో పెళ్లికళ లేనట్టే. ఇదిలా ఉండగా, ఫిబ్రవరి, మార్చి నెలల్లో పలువురు పెళ్లి సంబంధాలు కదుర్చుకుని, నిశ్ఛయ తాంబూలాలు కూడా తీసుకున్నారు. ఉగాది తర్వాత పెళ్లి చేద్దామని నిర్ణయించుకోగా, కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా సాధ్యం కాలేదు. లాక్‌డౌన్‌ ఎత్తేసినా ఆ తర్వాత కూడా ఆంక్షలు కొనసాగే అవకాశం ఉండటం, ముహూర్తాలు లేకపోవడంతో పెళ్లి ఎప్పుడోనని బ్యాచ్‌లర్స్‌ ఎదురుచూస్తున్నారు.
***నష్టాల ఊబిలో ఫంక్షన్‌ హాళ్లు
జిల్లాలో సుమారు 400 ఫంక్షన్‌ హాళ్లు ఉన్నాయి. నల్లగొండలో 50 మిర్యాలగూడలో 40, సూర్యాపేటలో 30 ఫంక్షన్‌ హాళ్లు ఉన్నా యి. నకిరేకల్‌, చిట్యాల, హాలియా వంటి చోట్ల అయిదు చొప్పున ఉన్నాయి. ఫంక్షన్‌ హాల్‌ నిర్మించాలంటే సగటున రూ.3కోట్లు, పూర్తి అత్యాధునిక వసతులతో విశాలంగా ఉండాలంటే రూ.7కోట్లు వరకు పెట్టుబడి అవసరం. దీనికి స్థలం ఖరీదు అదనం. వేసవి సీజన్‌లో సగటు ఫంక్షన్‌ హాల్‌కు కనీసంగా రూ.10లక్షలు ఆదాయం సమకూరుతుంది. కరోనా దెబ్బకు 43 రోజులుగా ఇవి మూతపడ్డాయి. లాక్‌డౌన్‌ ప్రకటనకు ముందుగా బుక్‌చేసుకున్న వారికి సైతం అడ్వాన్స్‌లు వెనక్కి ఇచ్చేశారు. ప్రసుత్తం శుభకార్యాలు లేక ఖాళీగా ఉన్నా, నిర్వహణ సిబ్బందికి వేతనాలు, నెలకు రూ.10వేల చొప్పున కనీస విద్యుత్‌ బిల్లు, ఆస్తిపన్ను రూ.10వేల వరకు చెల్లించక తప్పదు. భవిష్యత్తులో కూడా శుభకార్యాలకు 20 మందికి మించరాదని నిబంధన ఉంటే ఎక్కువ మంది ఇళ్ల వద్ద చేసుకునే అవకాశం ఉంది. ఒక వేళ ఫంక్షన్‌ హాల్‌ను ఎంచుకున్నా సాధారణ రోజుల మాదిరిగా కిరాయి ఉండకపోగా, తగ్గే అవకాశం ఉంది.
**ఆదాయం కోల్పోతున్న వృత్తిదారులు, వ్యాపారులు.
ఫంక్షన్‌ హాళ్ల యజమానులు, అందులో పనిచేసే కూలీలు, వంటల వారు, పెళ్లి పందిళ్లు వేసేవారు, పురోహితులు, ప్రింటింగ్‌ ప్రెస్‌, కుమ్మరి, నాయిబ్రాహ్మణ, రజక, సన్నాయి, బాజాభజంత్రీల వారు, టైలర్లు ఇలా పలు రకాలు వృత్తుల వారు పెళ్లి సీజన్‌లో నాలుగు డబ్బులు సంపాదిస్తారు. ఈ సీజన్‌ పూర్తయ్యే సరికి వెనకేసుకున్న డబ్బుతో ఏడాదిపాటు కుటుంబ పోషణ, పిల్లల ఫీజులు, పుస్తకాలు, రోగాలు, ఇతర అవసరాలకు వినయోగించుకుంటారు. అయితే కరోనా దెబ్బతో ఇప్పుడు పెళ్లిళ్లు జరగపోవడంతో కార్మికులు, వృత్తిదారులు ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్నారు. నవంబరు వరకు పెళ్లిళ్లు జరిగే అవకాశం లేకపోవడంతో ఆదాయం లేకపోతే భవిష్యత్‌ అవసరాల నుంచి ఎలా గట్టెక్కాలా అని వారు మదన పడుతున్నారు.