Health

కేరళలో కరోనా ఖాళీ

No new corona virus positive cases identified in Kerala

కేరళకు మరోసారి రిలీఫ్. రాష్ట్రంలో బుధవారం (మే 6) కొత్త కేసులేవీ నమోదు కాలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 30 ఉన్నట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. బుధవారం మరో ఏడుగురు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. దీంతో కేరళలో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 469కి చేరుకుంది. మొత్తం కేసుల్లో ఇది 93.42 శాతం కావడం విశేషం. రాష్ట్రంలో రికవరీ రేటు పెరుగుతుండటం శుభసూచకం. కేరళ ప్రభుత్వం తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యలతో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చింది. కేరళలో వరసగా రెండు రోజుల పాటు ‘0’ కరోనా కేసులు నమోదైన తర్వాత మంగళవారం కొత్తగా 3 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఉత్సాహం కాస్త నీరుగారింది. మళ్లీ బుధవారం ‘0’ కేసులు నమోదు కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కేరళలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్నట్లే కనిపించినా.. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో వైరస్ వ్యాప్తి నియంత్రణలోకి వచ్చింది. కేరళలో మొత్తం 21,342 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. మరో 21,034 మంది హోంక్వారంటైన్‌లో ఉన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వస్థలాలకు చేరుకుంటున్న కేరళ వాసులను 14 రోజుల హోంక్వారంటైన్‌లో ఉంచుతున్నారు. కేరళలో కరోనా కారణంగా నాలుగు నెలల ఓ పసికందు సహా ముగ్గురు మరణించారు. భారత్‌లో మొట్టమొదటి కరోనా కేసు కేరళ రాష్ట్రంలోనే నమోదైన విషయం తెలిసిందే. వుహాన్ నుంచి తిరిగొచ్చిన ఓ యువతికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. చికిత్స తర్వాత ఆమె కోలుకుంది.