Devotional

బాబా ఆదాయం పడిపోయింది

Shirdi Income Drops Drastically-Trust Releases Statement

కోవిడ్-19 లాక్‌డౌన్ ప్రభావంతో షిర్డీలోని సాయిబాబా సంస్థాన్‌ రోజువారీ ఆదాయం కోట్లలో పడిపోయింది. రోజుకు రూ.1.5 కోట్లకు పైగా ఆదాయాన్ని సంస్థాన్ కోల్పోతున్నట్టు షిర్డీ సాయి బాబా మందిర్ ట్రస్ట్ ఓ ప్రకటనలో తెలిసింది. లాక్‌డౌన్ కారణంగా భక్తులకు దర్శనం నిలిపివేయడంతో మార్చి 17 నుంచి మే 3వ తేదీ వరకూ రూ.2.53 కోట్లు మాత్రమే విరాళంగా వచ్చాయని, కొంత మొత్తం ఆన్‌లైన్ డొనేషన్ల ద్వారా వచ్చిందని సంస్థాన్ తెలిపింది.
**సాధారణంగా సాయిబాబా ఆలయానికి ఏటా రూ.600 కోట్ల ఆదాయం వస్తుంటుంది. ఆ ప్రకారం రోజువారీ ఆదాయం 1.64 కోట్లు. లాక్‌డౌన్ కారణంగా ఆలయాన్ని మూసివేయడంతో రోజుకు రూ.1.58 కోట్ల రూపాయల చొప్పున ఆదాయం కోల్పోతోంది. జూన్ వరకూ లాక్‌డౌన్ కొనసాగే పక్షంలో ఆలయం కోల్పోయే ఆదాయం 150 కోట్ల వరకూ ఉండవచ్చని చెబుతున్నారు. ఇదే జరిగితే సాయిబాబా ఆలయ ట్రస్టు చేపడుతున్న సామాజిక కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు.
***ఆన్‌లైన్ దర్శనమే..
మార్చి 17 నుంచి షిర్డీ సాయిబాబా ఆలయ దర్శనానికి భక్తులను సంస్థాన్ అనుమతించం లేదు. అయితే, ప్రతిరోజూ కేవలం 8 నుంచి 9 మంది భక్తులను మాత్రమే ఆన్‌లైన్ దర్శనానికి అనుమతిస్తోంది. మార్చి 17 నుంచి మే 3వ తేదీ వరకూ భక్తులు ఆన్‌లైన్ ద్వారా రూ.2.53 కోట్లు బాబా సంస్థాన్‌కు సమర్పించుకున్నారు. సహజంగా మామూలు రోజుల్లో 40 నుంచి 50 వేల మంది భక్తులు రోజూ బాబాను దర్శిస్తుంటారు. కోటి రూపాయల వరకూ భక్తుల సమర్పణలు ఉంటాయి. వీటిలో అత్యధిక మొత్తం నగదు రూపంలోనే ఉంటుంది. ఏటా భక్తుల నుంచి సంస్థాన్‌కు వచ్చే రూ.600 కోట్ల ఆదాయంలో రూ.400 కోట్లు వరకూ నగదు, బంగారు, వెండి, ఇతర వస్తువుల రూపంలో ఉంటుంది.
***షిర్డీ సంస్థాన్ సేవా కార్యక్రమాలు..
లాక్‌డౌన్ కారణంగా షిర్డీ సంస్థాన్‌ పెద్దఎత్తున ఆదాయం కోల్పోతుండటంతో ఏటా నిర్వహిస్తున్న ధార్మిక కార్యక్రమాలకు విఘాతం కలిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. షిర్డీ సంస్థానం ఏటా వేలాది మంది ప్రజలకు ఉచిత వైద్య సహాయం అందిస్తోంది. గుండె ఆపరేషన్లు, ఇత వైద్య ప్రక్రియలైన డయాలసిస్ వంటి వాటి కోసం ఏటా రూ.100 కోట్లు ఖర్చు చేస్తోంది. పేద విద్యార్థుల చదువు కోసం ఏటా రూ.15 కోట్లు వెచ్చిస్తోంది. 8,000 మంది సంస్థాన్ ఉద్యోగులు రాత్రింబవళ్లు ఆలయాన్ని శుభ్రం చేసే పనిలోనే ఉంటారు. ఇందుకోసం రూ.160 కోట్లు సంస్థాన్ వెచ్చిస్తోంది. షిర్డీ వచ్చే భక్తులకు ఉచిత లడ్డూ పంపిణీ కోసం ఏటా సుమారు రూ.40 కోట్లు ఖర్చుచేస్తోంది