* భారత్‌లో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గురువారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 52,952 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటివరకు 15,266 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 1783 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 35,902 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీలో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దాదాపు 29 వేల కరోనా కేసులు ఈ మూడు చోట్లనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 16,758 కేసులు నమోదు కాగా, 651 మంది మృతిచెందారు. మరోనా వైపు కేరళలో మాత్రం కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టినట్టుగా కనిపిస్తోంది. ఇప్పటివరకు కేరళలో 503 కరోనా కేసులు నమోదుకగా, 469 మంది కోలుకున్నారు. నలుగురు మృతిచెందారు.
* భారత్‌లో కరోనా వైరస్ కేసులు జూన్, జులై మాసాల్లో గరిష్టానికి చేరే అవకాశం ఉందని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఢిల్లీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. దేశంలో కరోనా కేసుల పెరుగుదల రేటు నిలకడగా ఉందని, కొన్ని సందర్భాల్లో ఉన్నట్టుండి కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. గురువారం ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం పెరుగుతున్న కేసుల ఆధారంగా జూన్, జూలై మాసాలలో కరోనా మరింత ప్రభావం చూపే అవకాశముందని తెలిపారు.
* లాక్డౌన్లో సమయంలో తమ సోంత రాష్ట్రాలకు తిరిగి పయనమవుతున్న క్రమంలో సుమారు 42 మంది వలస కార్మికులు రోడ్డు ప్రమాదాల్లో మరణించినట్లు సేవ్ లైఫ్ ఫౌండేషన్ తమ నివేదికలో పేర్కొంది. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు మార్చి 24 నుంచి మే 3 వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌కు పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. లాక్డౌన్లో జరిగిన రోడ్డు ప్రమాదాలపై సేవ్ లైఫ్ ఫౌండేషన్ వారు నివేదికను తయారు చేసింది. దేశ వ్యాప్తంగా లాక్డౌన్లో రోడ్డు ప్రమాదాల వల్ల మొత్తం 140 మంది మరణించినట్లు నివేదికలో వెల్లడించింది.
* కరోనా వైరస్ మహమ్మారి గుజరాత్లో విలయ తాండవం చేస్తోంది. ముఖ్యంగా అహ్మదాబాద్‌లో ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగరంలో లాక్‌డౌన్‌ను ఖచ్చితంగా పాటించాలని నిర్ణయించింది. కేసులు, మరణాల తీవ్రత దృష్ట్యా నగరంలో పాలు, మందు దుకాణాలు తప్ప మినహా అన్ని వారం రోజుల పాటు మూసివేయాలని అధికారులను ఆదేశించింది. ఈ నిబంధనలు మే 7 నుంచి 15 వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది. కూరగాయల వంటి నిత్యావసరాలు అమ్మే దుకాణాలకు కూడా అనుమతులు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌ను కచ్చితంగా అమలు చేయడం కోసం పారామిలిటరీ ఫోర్స్‌ను కూడా రంగంలోకి దించింది.
* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో నిన్న ఒక్కరోజే 60పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 1777కి చేరింది. వీరిలో 36మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బారినపడి 729మంది కోలుకున్నారు. ఇక తెలంగాణలో నిన్న కొత్తగా 11 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1107కి చేరగా 29మంది చనిపోయారు.