ప్రస్తుతం పిల్లలు బయటకెళ్లి ఆడుకోవడానికి అవకాశం లేదు. దాంతో టీవీలు, మొబైల్స్‌కు అతుక్కుపోతున్నారు. వాటిలో వచ్చే గేమ్స్ వారికి ఆనందాన్ని, ఆసక్తిని కలిగిస్తున్నాయి. దాంతో వారి మనసు వాటివైపు మళ్లుతుంది. ఇక్కడ తల్లిదండ్రులుగా మనం కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలి. చిన్నారులకు ఏయే అంశాల పట్ల ఆసక్తి ఉందో, వారికేం ఇష్టమో తెలుసుకుని ఓ పట్టికలా తయారుచేయాలి. బొమ్మలు వేయడం, పాటలు పాడటం, కథలు చదవడం… ఇలా ఒక్కో చిన్నారికి ఒక్కో ఇష్టమైన అంశం ఉండొచ్చు. వారి ఇష్టాలు, ఆటలు, పనులు, చదువు… ఇలా వేటికవే విభజన చేసుకోవాలి. స్కూల్లో టైంటేబుల్ మాదిరిగానే ఒక్కోదానికి కొంత సమయం కేటాయించాలి. ఆ సమయంలో వారికిచ్చిన పనిని పూర్తి చేసేలా చూడాలి. అలాగే దాన్నుంచి పిల్లలు ఆనందాన్ని పొందేలా చూసే బాధ్యత మనదే. ఇచ్చిన పనులను సకాలంలో పూర్తి చేస్తే మెచ్చుకోలుగా వారడిగిన వాటిని ఇస్తామనే నిబంధన పెట్టాలి. చిన్నారులకు ఏం చెబుతామో… మనమూ దాన్ని పాటించాలి. పిల్లలకు ఫోన్ చూడొద్దనే చెప్పే తల్లిదండ్రులు… అదేపనిగా నిరంతరం ఫోన్లోనే ఉంటే… చిన్నారులు వారి మాటలను వినిపించుకోరు. కాబట్టి మీరూ అలా చేయకండి. అలాగే ముందుగా మీరు అప్పజెప్పిన పనులను వాళ్లు పూర్తిచేస్తేనే, వారు అడిగిన దానికి కాస్త సమయం ఇస్తామని చెప్పాలి. ఉదాహరణకు చిన్నారి ఫోన్ అడిగితే… పావుగంటో, అరగంటో కేటాయించాలి తప్ప తను ఆడుకున్నంతసేపు ఇవ్వకూడదు. ఈ విషయంలో కచ్చితంగా ఉండాలి. ఈ నిబంధనలను పిల్లలు పాటించేలా చూడాలి. వారితోపాటు మనమూ పాటించాలి. అప్పుడే చిన్నారుల్లో మార్పు సాధ్యమవుతుంది. ఒప్పందాన్ని అతిక్రమిస్తే దండన కూడా ఉంటుందనే విషయం గుర్తు చేయాలి. అది కొట్టడం, తిట్టడం కాకుండా వారికి ఇచ్చే వెసులుబాట్లను తగ్గించడం లేదా ఇచ్చే సమయాన్ని తక్కువ చేయాలి.
మీ పిల్లలు ఫోన్ వదలట్లేదా?
Related tags :