* ప్రభుత్వ నిర్ణయంతో బుధవారం నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఇసుక బుకింగ్‌లు ప్రారంభించారు. భారీ నిర్మాణాలతో పాటు, చిన్న నిర్మాణాలకు కూడా ఇసుక సరఫరా అయ్యే విధంగా ఈ బుకింగ్‌లు ప్రారంభించారు. ఇసుక లారీలకు అనుమతులను జారీ చేస్తున్నారు. డిమాండ్‌కు తగ్గట్టుగా ఇసుకను సరఫరా చేయడానికి అధికారులు ఏర్పాట్లను చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 30 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలను అందుబాటులోకి తెచ్చారు. లాక్‌డౌన్‌కు ముందు బుక్ అయిన 50 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను బుధవారం నుంచి అనుమతి ఇస్తున్నారు. కొత్తగా రోజుకు 3వేల క్యూబిక్‌మీటర్ల ఇసుక బుకింగ్‌లను కూడా తీసుకుంటున్నారు.
* ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ కీలక వడ్డీ రేట్లను సవరించింది. నిధులపై వ్యయానికి అనుగుణంగా రుణాలపై వడ్డీ రేటు (ఎంసీఎల్‌ఆర్)ను 15 బేసిస్ పాయింట్లు మేర కోత పెట్టింది. ప్రస్తుతం 7.40 శాతంగా ఉన్న రేటును 7.25 శాతానికి తగ్గించింది. దీంతో ఎంసీఎల్‌ఆర్‌తో అనుసంధానం కలిగిన రుణాలను తీసుకున్నవారికి లబ్ధి చేకూరనుంది. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యవధిపై రూ.25 లక్షలు గృహ రుణం తీసుకున్న వారికి ఈఎంఐ సుమారు రూ.255 తగ్గనుంది. మే 10 నుంచి ఈ రేట్లు అమల్లోకి రానున్నాయి. అలాగే, మూడేళ్ల కాలవ్యవధి కలిగిన రిటైల్ టర్మ్ డిపాజిట్లపై 20 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది. మే 12 నుంచి ఈ వడ్డీరేట్లు వర్తిస్తాయి.
* పొరుగు దేశం చైనాలోని వుహాన్‌లో గతేడాది చివర్లో నావెల్ కరోనా వైరస్ పురుడు పోసుకుంది. నగరమంతా వ్యాప్తి చెందింది. ఇప్పుడు ప్రపంచాన్నంతా అతలాకుతలం చేస్తోంది. ఆర్థిక వ్యవస్థలన్నీ చిధ్రం అయ్యాయి. కోట్లాది మంది ఉపాధి కోల్పోతున్నారు. వైరస్‌ను కట్టడి చేయడం, మహమ్మారి సమాచారాన్ని ఇతర దేశాలతో పంచుకోవడంలో చైనా విఫలమైంది! ఇదే అదనుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశంపై తీవ్ర స్థాయిలో విరుచుపడుతున్నారు. కటువుగా నిందిస్తున్నారు. వాణిజ్య యుద్ధం సమయంలోనే ఆ దేశం నుంచి కొన్ని కంపెనీలు వియత్నాంకు వెళ్లిపోయాయి. వైరస్ విషయంలో అనేక దేశాలకు చైనాపై అనుమాలు పెరగడంతో దానిపై అతిగా ఆధారపడొద్దని నిర్ణయానికి వచ్చేశాయి! సరఫరా గొలుసులో వైవిధ్యానికి పెద్దపీట వేయాలని భావిస్తున్నాయి. ఇది భారత్‌కు వరంగా మారనుంది!
* దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు చవిచూశాయి. రెండు రోజుల వరుస నష్టాల అనంతరం బుధవారం లాభాల్లోకి వెళ్లిన సూచీలు.. గురువారం ఆ లాభాలను పోగొట్టున్నాయి. దేశంలో రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడం మదుపరిని కలవరపెట్టాయి. దీంతో అమ్మకాలవైపు మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టపోయాయి.
* 2018-19 ఆర్థిక సంవత్సరానికి జీఎస్‌టీ వార్షిక రిటర్న్‌ల దాఖలు గడువు తేదీని ప్రభుత్వం మూడు నెలలు పొడిగించింది. సెప్టెంబరు 30 వరకు దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్‌ను కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) జారీ చేసింది. ఈ ఏడాది మార్చి 24న లేదా ఆ లోపు తీసుకున్న ఇ-వేబిల్లులతో పాటు, మార్చి 20- ఏప్రిల్ 15 మధ్య గడువు తీరిన ఇ-వేబిల్లుల వర్తింపు సమయాన్ని కూడా మరోమారు పొడిగిస్తూ సీబీఐసీ నిర్ణయం తీసుకుంది. గత నెలలో పై ఇ-వేబిల్లుల వర్తింపు సమయాన్ని ఏప్రిల్ 30 వరకు పొడిగించగా.. ఇవి మే 31 వరకు చెల్లుబాటు అవుతాయని తాజాగా సీబీఐసీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా మార్చి 25న లాక్‌డౌన్ ఆంక్షలు విధించినప్పటి నుంచి సరకు రవాణా సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లాక్‌డౌన్‌ను మే 17 వరకు కేంద్రం పొడిగించడంతో ఇ-వేబిల్లుల చెల్లుబాటు సమాయాన్ని సీబీఐసీ పొడిగించింది.
* ఏప్రిల్‌లో భారత సేవల రంగ కార్యకలాపాలు రికార్డు కనిష్ఠానికి పరిమితమయ్యాయి.. కరోనా వైరస్ నియంత్రణకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో పలు వ్యాపారాలు మూతపడటం సేవల రంగంపై ప్రతికూల ప్రభావం చూపింది. ఐహెచ్‌ఎస్ మార్కిట్ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ సూచీ ఏప్రిల్‌లో 5.4 పాయింట్లుగా ఉంది. మార్చిలో నమోదైన 49.3తో పోలిస్తే ఈసారి భారీ క్షీణత నమోదైంది. 2005 డిసెంబరులో సేవల గణాంకాలు రూపొందించడం మొదలైన తర్వాత.. గత 15 ఏళ్లలో ఇదే అత్యంత భారీ క్షీణతగా తెలుస్తోంది. పీఎంఐ గణాంకాల ప్రకారం.. 50 పాయింట్ల ఎగువన నమోదైతే వృద్ధిగాచ అంతకంటే తక్కువైతే క్షీణతగా పరిగణిస్తారు. కఠినమైన లాక్‌డౌన్ ఆంక్షల వల్ల గత నెలలో పీఎంఐ సేవల రంగ సూచీ 40 పాయింట్లకు పైగా క్షీణించిందని ఐహెచ్‌ఎస్ మార్కిట్ ఆర్థికవేత్త జో హేస్ పేర్కొన్నారు. ఇక సేవలు, తయారీ రంగాలను ప్రతిబింబించే కాంపోజిట్ పీఎంఐ ఔట్‌పుట్ సూచీ మార్చిలో 50.6గా ఉండగా, ఏప్రిల్‌లో 7.2 శాతానికి క్షీణించింది.
* జనవరి- మార్చి త్రైమాసికానికి టాటా కాఫీ ఏకీకృత ప్రాతిపదికన రూ.9.86 కోట్ల లాభాన్ని ప్రకటించింది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.10.49 కోట్లతో పోలిస్తే నికర లాభం 6 శాతం తగ్గడం గమనార్హం. మరోవైపు మొత్తం ఆదాయం మాత్రం రూ.464.46 కోట్ల నుంచి రూ.523.46 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2019-20) నికర లాభం రూ.68.77 కోట్ల నుంచి రూ.82.40 కోట్లకు; మొత్తం ఆదాయం రూ.1,822.41 కోట్ల నుంచి రూ.1,986.78 కోట్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది.