Health

వీర్యంలో కరోనా ఉంది

Can Corona Spread Through Sex

చైనాలో మొదలైన కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. భారత్‌లోనూ కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నా, ఇప్పటికీ ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. కరోనాతో బాధపడే వ్యక్తి తుమ్మినా, దగ్గినా ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతుందని తెలిసిందే. మరి శృంగారం ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుందా? అంటే తాజాగా చైనాలోని కొంతమంది పరిశోధకులు దీనిపై అధ్యయనం చేసి, నివేదిక విడుదల చేశారు. వీర్యంలో కరోనా వైరస్‌ ఉండటాన్ని వీరు గుర్తించారు. అయితే, దీని వల్ల వ్యాధి వ్యాపిస్తుందా? లేదా? అన్న దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. చైనాలోని షాంగిక్యూ మున్సిపల్‌ ఆస్పత్రిలో కరోనా వైరస్‌తో బాధపడుతున్న 38మందిపై పరిశోధకులు అధ్యయనం చేశారు. వీరిలో ఆరుగురి వీర్యంలో కరోనా వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు. ఇందులో ఇద్దరు కోలుకోగా, మరో నలుగురు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నివేదికను జామా నెట్‌వర్క్‌ పబ్లిష్‌ చేసింది.

కరోనా వైరస్‌ వీర్యంలో ఎన్ని రోజులు ఉంటుందన్న విషయం మాత్రం తెలియరాలేదు. అదే విధంగా శృంగారం ద్వారా వ్యాప్తి చెందుతుందా? లేదా? అన్న దానిపై కూడా పరిశోధకులు ఒక నిర్ణయానికి రాలేకపోయారు. గత నెలలో 34మందిపై అధ్యయనం చేసి, జర్నల్‌ ఫెర్టిలిటీ అండ్‌ స్టెరిలిటీ ప్రచురించిన దానితో పోలిస్తే, వత్యాసం కనపడుతోంది. కరోనా వైరస్‌ బారిన పడి కోలుకుని ఎనిమిది రోజులైన వారితో పాటు మూడు నెలల పూర్తి చేసుకున్న వివిధ వ్యక్తుల వీర్యంపై అమెరికా, చైనా పరిశోధకులు అధ్యయనం చేశారు. వీరెవ్వరి వీర్యంలోనూ కరోనా వైరస్‌ను గుర్తించలేదు. కరోనాతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న మరికొంత మందిపై పరిశోధన చేస్తున్నట్లు ఉతాహ్‌ విశ్వవిద్యాలయం రూపొందించిన నివేదిక సహ రచయిత డాక్టర్‌ జాన్‌ హోట్లింగ్‌ తెలిపారు. కరోనా వైరస్‌ ప్రధానంగా బాధిత వ్యక్తుల దగ్గు, తుమ్ముల ద్వారానే వ్యాపిస్తుందని తెలిపారు. అదే విధంగా రక్తం, కన్నీళ్ల ద్వారా కూడా కొవిడ్‌-19 వ్యాప్తి చెందుతుందని తెలిపారు. శృంగారం ద్వారా కరోనా వ్యాపిస్తుందా? అన్న ప్రశ్నకు మరిన్ని పరిశోధనలు చేపట్టాల్సిన అవసరం ఉందని డాక్టర్‌ హోట్లింగ్‌ అన్నారు. అమెరికన్‌ సొసైటీ ఫర్‌ రీప్రొడెక్టివ్‌ మెడిసన్‌ తాజా అధ్యయనం ప్రకారం.. శృంగారం ద్వారా కరోనా వ్యాప్తి చెందడం లేదని భావించడం కన్నా, ముందు జాగ్రత్తగా ఉండటమే మంచిదని, అనుమానం ఉంటే 14రోజుల వరకూ దూరంగా ఉండాలని డాక్టర్‌ పీటర్‌ హెగెల్‌ సూచిస్తున్నారు.