WorldWonders

తల్లి బతికుండగానే సమాధి కట్టాడు

Son Builds Grave For Mother That Is Alive

జ‌న్మ‌నిచ్చిన త‌ల్లి భారంగా మారిందంటూ బ‌తికుండ‌గానే ఆమెను పాతిపెట్టి హ‌త్యాయత్నానికి ప్రారంభించాడో దుర్మార్గ‌పు కొడుకు. మూడు రోజుల త‌ర్వాత ఆమెను బ‌య‌ట‌కు తీసి ర‌క్షించిన ఘ‌ట‌న ఉత్త‌ర చైనాలో ఆల‌స్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. చైనాకు చెందిన‌ యాన్ అనే వ్య‌క్తి త‌ల్లి వాంగ్‌ పాక్షిక ప‌క్ష‌వాతంతో బాధ‌ప‌డుతోంది. ఈ క్ర‌మంలో ఆమెకు స‌ప‌ర్యలు చేస్తూ, సంర‌క్ష‌ణ చూసుకోవ‌డం భారంగా భావించాడు. దీంతో అత‌ను త‌న త‌ల్లిని హ‌త‌మార్చాల‌ని ప్ర‌య‌త్నించాడు. అందులో భాగంగా మే రెండో తారీఖున చ‌క్రాల‌బండిలో ఆమెను బ‌య‌ట‌కు తీసుకెళ్లాడు. అయితే ఆ రోజే కాకుండా మూడు రోజులు గడుస్తున్నా ఆమె ఇంటికి రాలేదు. దీంతో అనుమానం వ‌చ్చిన‌ అత‌ని భార్య ఈ విష‌యాన్ని పోలీసుల‌కు చేర‌వేసింది. వెంట‌నే వారు స‌ద‌రు వ్య‌క్తిని అదుపులోకి తీసుకుని విచారించ‌గా ఘోర‌మైన విష‌యం బ‌య‌టప‌డింది. త‌ల్లిని చూసుకోవ‌డం త‌న వ‌ల్ల కాద‌ని అందుకే ఆమెను బ‌తికుండ‌గానే పాతిపెట్టి దుర్మార్గ‌పు ప‌నికి ఒడిగ‌ట్టాన‌ని నిందితుడు వెల్ల‌డించాడు. దీంతో పోలీసులు హుటాహుటిన‌ పాతిపెట్టిన స్థ‌లానికి వెళ్ల‌గా అంత‌టి ప్ర‌మాద‌క‌ర‌ పరిస్థితుల్లోనూ స‌మాధిలో నుంచి ఆమె నీర‌సంగా స‌హాయం కోసం అర్థించడం వినిపించింది. వెంట‌నే పోలీసులు ఆ ప్ర‌దేశాన్ని త‌వ్వి ఆమెను ర‌క్షించారు.‌ శ‌రీర‌మంతా మ‌ట్టికొట్టుకుపోయి, కొన ప్రాణాల‌తో కొట్టుమిట్టాడుతున్న మ‌హిళ‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.