* దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)ను కరోనా వైరస్ ప్రకంపనలు తాకాయి. కోల్‌కతాలోని ఒక ఉద్యోగికి కరోనా వైరస్ సోకడంతో ప్రధాన కార్యాలయంలోని ఒక విభాగాన్ని ఎస్‌బీఐ మూసివేసింది. స్థానిక ప్రధాన కార్యాలయానికి చెందిన ఇ-వింగ్ ఉద్యోగిగా బాధితుడిని సంస్థ ప్రకటించింది. స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో అతను చికిత్స పొందుతున్నాడని తెలిపింది. వైరస్ సోకిందని గుర్తించక ముందే సదరు ఉద్యోగి గత పది రోజులుగా సెలవులో ఉన్నాడని బ్యాంకు అధికారి వెల్లడించారు. కోవిడ్-19 పాజిటివ్ వచ్చిన వెంటనే మొత్తం భవనాన్ని శుభ్రపరిచి, మే 11వ తేదీ వరకు ఈ విభాగాన్ని మూసివేశామని తెలిపింది. అయితే ఈ భవనంలోని మిగతా అన్ని విభాగాలు పనిచేస్తున్నాయని చెప్పింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో బాధ్యతాయుతమైన సంస్థగా ఉద్యోగుల సంక్షేమాన్ని పరిశీలిస్తూ, అన్ని నిబంధనలను అనుసరిస్తున్నామని అధికారి తెలిపారు. గతంలో విదేశాలకు వెళ్లిన మరొకరికి కూడా పాజిటివ్ వచ్చిందని, ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. మరోవైపు ఎస్‌బీఐ పనిచేస్తున్న ఉద్యోగి (48)కి. ఆమె కుమార్తె(28)కు పాజటివ్ గా తేలడంతో పంజాబ్ లోని పాటియాలా నగరంలో ఎస్‌బీఐ రెండు శాఖలు మూసివేసినట్టు సమాచారం. వీరిని క్వారంటైన్ లో ఉంచామని పాటియాలా సివిల్ సర్జన్ డాక్టర్ హరీష్ మల్హోత్రా తెలిపారు. అలాగే ఈ శాఖలను సందర్శించిన వ్యక్తులను గుర్తించే ప్రక్రియ జరుగుతోందని చెప్పారు. మే 8, ఉదయం 8 గంటల వరకు పశ్చిమ బెంగాల్‌లో కరోనా కారణంగా 151 మరణాలు సంభవించగా, 1548 కేసులు నమోదయ్యాయి. దేశంలో అత్యధిక మరణాల నమోదు చేస్తున్న రాష్ట్రాల్లో బెంగాల్ ఒకటి.
* దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 199.32 పాయింట్లు లేదా 0.63 శాతం లాభపడింది. 31,642.70 వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 52.45 లాభంతో 9,251.50 వద్ద ముగిసింది. 1012 కంపెనీల షేర్ల ధరలు పెరగ్గా 1267 కంపెనీల షేర్లు నష్టాలు చవిచూశాయి. 185 కంపెనీల షేర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. మొదట్లో సూచీలు పుంజుకున్నా చివర్లో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు.
* ప్రముఖ అమెరికా సంస్థ ‘విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్’ తమ జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడి పెట్టనున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. తమ మధ్య రూ.11,367 కోట్ల మేరకు ఒప్పందం కుదిరినట్టు రిలయన్స్ టెలీకాంలో భాగమైన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ నేటి ఉదయం వెల్లడించింది. ఈ మేరకు జియో ప్లాట్‌ఫార్మ్స్‌లో 2.32 శాతం వాటాను విస్టాకు బదలాయించనున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. దీనితో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫేస్‌బుక్‌ల తర్వాత జియోలో విస్టా మూడో అతిపెద్ద వాటాదారు కానుంది.
* 2019-20 జనవరి- మార్చి త్రైమాసికానికి ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రూ.156 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2018-19 ఇదే సమయంలో ఆర్జించిన రూ.122 కోట్లతో పోలిస్తే నికర లాభం 28 శాతం పెరిగింది. ఆదాయంలో బలమైన వృద్ధి, పన్ను రేట్లు తగ్గడం లాభం పెరిగేందుకు కారణమయ్యాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆదాయం రూ.428 కోట్ల నుంచి 13 శాతం పెరిగి రూ.482 కోట్లకు చేరిందని వెల్లడించింది. రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.6.75 (115%) తుది డివిడెండును ప్రకటించింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరంలో (2019-20) ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నికర లాభం 10 శాతం వృద్ధితో రూ.541 కోట్లకు చేరింది. ఆదాయం పెద్దగా మార్పు లేకుండా రూ.1,725 కోట్లుగా నమోదైంది.
* కరోనా వైరస్ (కొవిడ్-19) సంక్షోభం నేపథ్యంలో, ఏడాదికి రూ.25 లక్షలు, అంతకుమించి వార్షిక వేతనం ఉన్న ఉద్యోగులకు 10 శాతం విధిస్తున్నట్లు ప్రైవేటురంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రకటించింది. 2020-21 సంవత్సరానికి యజమాన్యం తమ వేతనాల్లో 15 శాతం కోత విధించుకున్న కొద్దికాలంలోనే ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. 2020 మే నెల నుంచి 2021 మే వరకు ఇది అమలవుతుందని సంస్థ తెలిపింది.