Politics

మోడీకి చంద్రబాబు అభినందన

Chandrababu Appreciates Narendra Modi In A Letter

విశాఖ గ్యాస్‌లీక్‌ ఘటనపై సమగ్ర దర్యాప్తు కోరుతూ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. గ్యాస్‌ లీక్‌పై దర్యాప్తు చేస్తేనే భవిష్యత్‌లో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం తెలుస్తుందన్నారు. ‘‘ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దుర్ఘటనపై మీ సత్వర స్పందనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సత్వరమే మీరు స్పందించి చేపట్టిన చర్యలు విశ్వాసాన్నిచ్చాయి. గ్యాస్‌ లీకేజీపై విచారణకు సైంటిఫిక్‌ కమిటీని ఏర్పాటు చేయాలి. విషవాయువు విడుదలకు దారితీసిన అంశాలపై దర్యాప్తు చేయించాలి. లీకైన వాయువు స్టైరీన్‌ అని కంపెనీ చెబుతోంది. స్టైరీన్‌తో పాటు మరికొన్ని వాయువులు ఉన్నాయని భిన్న నివేదికలు ఉన్నాయి. అంతర్జాతీయ వైద్య నిపుణులతో పరిశీలనలు జరిపించాలి. తదనుగుణంగా తక్షణ, దీర్ఘకాలిక వైద్య చర్యలు చేపట్టాలి. బాధితులకు సరైన పరిహారం అందించేందుకు ఈ అంచనాలే తోడ్పడతాయి. విశాఖ పరిసరాల్లో గాలి నాణ్యతను నిశితంగా పరిశీలించాలి. విషవాయువులు బాధితులకు శాశ్వత నష్టం చేస్తాయి. దీర్ఘకాలంలో చూపే దష్ప్రభావాలపై నిశిత దృష్టి సారించాల్సి ఉంది. వీటన్నింటిపై దృష్టి సారించి సముచిత చర్యలు చేపట్టాలని అభ్యర్థిస్తున్నాను’’ అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.