WorldWonders

ఇవాంకా PAకి కరోనా

Ivanka Trump PA Tests Positive For Corona

శ్వేతసౌధం సిబ్బందిలో మరోవ్యక్తికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అధ్యక్షుడు ట్రంప్‌నకు సలహాదారుగా వ్యవహరిస్తున్న ఆయన కూతురు ఇవాంక ట్రంప్‌ వ్యక్తిగత సహాయకురాలికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో శ్వేతసౌధంలో కరోనా బారిన పడ్డవారి సంఖ్య మూడుకు చేరింది. అయితే, గత కొన్ని వారాలుగా ఆమె ఇవాంకతో లేరని.. దీంతో ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. ఆంక్షల నేపథ్యంలో గత రెండు నెలలుగా ఆమె వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారానే తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు అక్కడి ప్రముఖ మీడియా సంస్థ సీఎన్‌ఎన్‌ కథనాన్ని ప్రచురించింది. అయితే, ముందు జాగ్రత్తగా చర్యగా ఇవాంక సహా ఆమె భర్త జేర్డ్‌ కుష్నర్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. నెగిటివ్‌ వచ్చిందని ఓ అధికారి తెలిపినట్లు సీఎన్‌ఎన్‌ పేర్కొంది.అంతకుముందు ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ మీడియా ప్రతినిధిగా వ్యవహరిస్తున్న కేటీ మిల్లర్‌ అనే మహిళకు కరోనా సోకింది. విధి నిర్వహణలో భాగంగా కేటీ మిల్లర్‌ వైట్‌హౌస్‌లో నిర్వహించిన అనేక కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. గురువారం కూడా ఆమె పాల్గొన్న ఓ బహిరంగ ప్రార్థనా సమావేశంలో… అధ్యక్షుడు ట్రంప్‌ సతీమణి మెలానియా, ఉపాధ్యక్షుడి భార్యతో సహా పదుల సంఖ్యలో ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్‌, పెన్స్‌లకు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వారిద్దరికీ నెగిటివ్‌ అని తేలింది. ఇకనుంచి వారిరువురికీ ప్రతిరోజూ కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి.