* విశాఖ గ్యాస్ లీక్ ఘటన దురదృష్టకరమని మంత్రి కొడాలి నాని అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రతి కుటుంబానికి ఆర్థికసాయం అందిస్తామని తెలిపారు. హెల్త్ కార్డులు జారీ చేసి వారికి వైద్యసేవలు అందిస్తామన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మృతుల కుటుంబాలకు సీఎం వైస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని తెలిపారు. వెంటిలేటర్‌పై ఉన్నవారికి వైద్యసేవలు అందించడంతో పాటు 10 లక్షల ఆర్థికసాయం, చికిత్స పొందుతున్నవారికి రూ.లక్ష ప్రకటించారని వెల్లడించారు. గ్యాస్ లీక్ ఘటనను నిపుణుల కమిటీ పరిశీలిస్తోందన్నారు. ప్రజల భద్రతే మాకు ముఖ్యమని.. ఫ్యాక్టరీ వల్ల ప్రమాదముందని నివేదిక వస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఐఏఎస్‌లతో వేసిన కమిటీని చంద్రబాబు తప్పుబడుతున్నారని…టీడీపీకి చెందిన దద్దమ్మలతో డ్రామా కమిటీ వేశారని దుయ్యబట్టారు.1998లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అదే కంపెనీలో అగ్నిప్రమాదం జరిగిందని.. అప్పుడెందుకు కంపెనీని చంద్రబాబు మూయించలేదని ప్రశ్నించారు. హిందూస్థాన్ పాలిమర్‌ను.. ఎల్‌జీ పాలిమర్‌గా మార్చింది చంద్రబాబేనని పేర్కొన్నారు. 2017లో కూడా కంపెనీ విస్తరణకు చంద్రబాబు పర్మిషన్ ఇచ్చారని తెలిపారు. గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు సినిమా షూటింగ్ వల్ల 30 మంది చనిపోయారని.. వాళ్లు బతికొస్తారనే చంద్రబాబు రూ.3లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చారా అని కొడాలి నాని ప్రశ్నించారు.
* గ్యాస్ లీకేజ్ ఘటనను రాజకీయం చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. విశాఖపట్నంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై బురదచల్లే విధంగా టీడీపీ ఆరోపణలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ ఘటనకు, ప్రభుత్వానికి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రమాద సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం చాలా వేగంగా స్పందించిందన్నారు. పోలీసులు వెంటనే స్పందించకుండా ఉంటే ప్రమాద తీవ్రత మరోలా ఉండేదన్నారు. సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధితులను పరామర్శించడమే కాకుండా మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని తెలిపారు.
* ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 43 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,930కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 8,338మంది శాంపిల్స్ పరీక్షించగా.. అందులో కొత్తగా 43 మందికి కరోనా సోకినట్టుగా నిర్ధారణ అయింది. కొత్తగా కృష్ణా జిల్లాలో 16,చిత్తూరు జిల్లాలో 11, అనంతపురం జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 6, విశాఖపట్నం జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి.
* లాక్‌డౌన్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు రాష్ట్రానికి వచ్చేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్రానికి రావాలనుకుంటున్న వలస కార్మికుల కోసం ఎనిమిది ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాల్సిందిగా రైల్వే శాఖకు విజ్ఞప్తి చేసింది. కాగా వలస కార్మికుల తరలింపు విషయంలో పశ్చిమ బెంగాల్ సర్కారు కేంద్రానికి సహకరించడం లేదంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లేఖ శనివారం రాసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం తీరు మారకుంటే వలస కార్మికుల కష్టాలు రెట్టింపు అవుతాయని.. శ్రామిక్ రైళ్లను రాష్ట్రంలోకి అనుమతించకపోవడం అన్యాయమని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో వలస కార్మికులను ఆహ్వానిస్తూ మమత సర్కారు వెంటనే నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
* మద్య నియంత్రణ, నిషేధంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. దశలవారీగా మద్యపాన నిషేధంలో భాగంగా ప్రభుత్వం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మద్యం దుకాణాలను తగ్గిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 33 శాతం షాపులను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 4380 మద్యం షాపులను 2934కి తగ్గించింది. గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం దుకాణాలను తగ్గించిన విషయం తెలిసిందే.
* భారత్ లాంటి వర్ధమాన దేశాల్లో కరోనా వైరస్ లాంటి మహమ్మారి బారిన పడి ఎంత మంది చనిపోయారనే విషయం ఎప్పటికీ తేలదట. ఈ విషయాన్ని చెప్పిందెవరో కాదు, భారతలో మరణాలు–వాటి గణాంకాలపై విస్తృతంగా అధ్యయనం చేసిన డాక్టర్ ప్రభాత్ ఝా. ఆయన రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా సహకారంతో ‘మిలీనియన్ డెత్ స్టడీ’ పేరిట ఈ అధ్యయనం చేశారు. ఆయనెవరో కాదు, టొరాంటోలోని ‘సెంటర్ ఫర్ గ్లోబల్ హెల్త్ రిసర్చ్’ వ్యవస్థాపక డైరెక్టర్. ఆయన ‘బిల్ అండ్ మిలిండా ఫౌండేషన్’కు ఎక్స్‌పర్ట్ అడ్వైజర్‌గా కూడా పని చేస్తున్నారు. ప్రభాత్ ఝా అధ్యయనం ప్రకారం భారత్‌లో 80 శాతం మరణాలు గ్రామీణ ప్రాంతాల్లోనే జరుగుతాయి. వాటిలో 70 శాతం మరణాలు మాత్రమే రిజిస్టర్ అవుతాయి. వాటిలో కేవలం 22 శాతం మరణాలకు మాత్రమే మెడికల్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఆ సర్టిఫికెట్లలో కూడా ఎక్కువ వరకు గుండెపోటు కారణంగా మరణించారని పేర్కొంటారు. గుండెపోటు రావడానికి కారణాలేమిటో పేర్కొనరు.
* ఆంధ్రప్రదేశ్‌లో పదోవ తరగతి పరీక్షలకు సంబంధించి సామాజిక మాధ్యమంలో వస్తున్న వదంతులు నమ్మవద్దని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చిన వీరభద్రుడు విజ్ఞప్తి చేశారు. రోజుకు ఒకరకంగా పదో తరగతి పరీక్షలకు సంబంధించిన ఫేక్ న్యూస్‌లను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారన్నారు. మొన్న టైమ్ టేబుల్ విషయంలో వదంతులు సృష్టించగా, నేడు ఏకంగా తన పేరును ఫోర్జరీ చేసి పరీక్ష తేదీలను ఆన్‌లైన్‌లో పెట్టారని తెలిపారు.
* ఇతర దేశాల నుంచి ఏపీకి వచ్చేవాళ్లు సిద్ధంగా ఉండాలని కొవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ కృష్ణబాబు విజ్ఞప్తి చేశారు. వారిని తీసుకొచ్చే విమానాలు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వస్తాయని చెప్పారు. ఆయా విమానాల్లో మన వారిని సిద్ధంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి చేరుకున్నవారికి రెండు రకాల క్వారంటైన్లు సూచిస్తున్నామనీ.. పెయిడ్, ఉచిత క్వారంటైన్‌లలో ఏదైనా ఎంచుకోవచ్చన్నారు. ఇప్పటివరకు 30వేల మంది ఏపీ వాసులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. ఇతర ప్రదేశాల నుంచి వచ్చేవారికి పరీక్షలు చేసి క్వారంటైన్ లేదా కొవిడ్ ఆస్పత్రికి తరలించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
* కరోనా కట్టడిలో కీలకపాత్ర వహిస్తున్న మున్సిపల్ కమిషనర్లను మంత్రి కేటీఆర్ అభినందించారు. ఇదే స్ఫూర్తితో కరోనా కట్టడికి భవిష్యత్తులోనూ చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంలోని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మున్సిపల్ శాఖపై మంత్రి కేటీఆర్ నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. పురపాలక కమిషనర్లు, అదనపు కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. భేటీలో మాన్సూన్ యాక్షన్ ప్లాన్‌పైనా మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… రాష్ట్రంలో దశలవారీగా లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత కరోనా వ్యాప్తిచెందే అవకాశం ఉందన్నారు. కావునా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. పట్టణాల్లో సరి, బేసి విధానంలో దుకాణాల నిర్వహణను పర్యవేక్షించాలన్నారు. వ్యాక్సిన్ వచ్చేవరకు కరోనాతో సహజీవనం చేయాల్సిన పరిస్థితి నెలకొని ఉందన్నారు. కరోనా కట్టడికి అవసరమైన మార్గదర్శకాలను ఆరోగ్య, పురపాలకశాఖలు ఇవాళ విడుదల చేస్తాయని తెలిపారు. మాస్కుల వినియోగం, భౌతికదూరం పాటించడం, శానిటైజర్ల వినియోగాన్ని కొనసాగించాలన్నారు.
* మత్తు మందు కలిపిన జ్యూస్ తాగిపించిన 70 ఏండ్ల వృద్ధుడొకరు.. ఓ ఒంటరి మహిళపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. భర్తను వదిలేసి ఒంటరిగా ఉంటున్న24 ఏండ్ల మహిళకు ఆశ్రయం కల్పిస్తానని చెప్పిన ఒక వ్యక్తి ద్వారా బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో నివసించే మహమ్మద్ సలీం ఇంటికి వచ్చింది. తన ఇంట్లో ఉంచుకొంటానని చెప్పిన ఆ పెద్ద మనిషి.. జ్యూస్‌లో మత్తు కలిపి తనచేత తాగిపించి తనపై లైంగికదాడి చేశాడని సదరు మహిళ పోలీసులకు తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు వృద్ధుడు సలీంను శనివారం నాడు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు బంజారాహిల్స్ ఎస్‌హెచ్‌వో ఎన్ కళింగరావు తెలిపారు.