ఎండాకాలం ఏం తింటే ఏమవుతుందో అన్న దిగులే ఎక్కువ! ఇలాంటి సమయంలో శరీరాన్ని శ్రమ పెట్టకుండా తేలిగ్గా జీర్ణమై పోషకాలను అందించి రోగనిరోధక శక్తిని పెంచే ఆకుకూరలే శ్రీరామరక్ష అంటున్నారు పోషకాహార నిపుణులు…
*నిరోధక శక్తి పెరుగుతుంది:
కనీసం వంద గ్రాముల ఆకుకూరలను రోజూ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. వీటిని క్రమం తప్పకుండా తీసుకునేవారిలో మధుమేహం రావడం తక్కువ అని పరిశోధనల్లో తేలింది. మన శరీరానికి అవసరమయ్యే సూక్ష్మపోషకాలు ఆకుకూరల్లో మెండుగా ఉంటాయి. మాంసకృత్తులు, ఒమేగా-3 కొవ్వులు, విటమిన్-ఇ పుష్కలంగా ఉండే ఆకుకూరలు…రోగనిరోధకతను పెంచడంలో దోహదపడతాయి. వీటిలో ఫోలిక్ యాసిడ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే వీటిని తీసుకుంటే రక్తహీనత సమస్య రాదు.
రక్తపోటును రానీయవు: తోటకూర, గోంగూర, కరివేపాకు… వీటిని నుంచి ఎక్కువ మొత్తంలో పీచు లభిస్తుంది. దాంతో ఆహారం చక్కగా జీర్ణమై మలబద్ధకం సమస్య ఉండదు. వీటిని తరచూ తీసుకుంటే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారికి ఆకుకూరలు మేలు చేస్తాయి. ఇవి యాంటీ క్యాన్సర్ కారకాలుగా పనిచేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా తక్కువ. ఆకుకూరల్లో ఉండే ల్యూటిన్, కెరొటిన్ యాంటీఆక్సిడెంట్లుగా పనిచేసి క్యాన్సర్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తాయి.
ఎలా నిల్వ చేసుకోవచ్చు?
ఆకుకూరలను నీటితో శుభ్రంగా కడిగి తడిపోయేలా తుడిచి, ఆరబెట్టుకోవాలి. టిష్యూపేపర్ లేదా మందమైన వస్త్రంలో చుట్టి పెట్టుకోవచ్చు. వీటిని ఎక్కువసేపు నీటిలో ఉంచకూడదు. టమాట, యాపిల్స్‌తో కలిపి నిల్వ చేయకూడదు. వేర్లతో నిల్వ చేస్తే త్వరగా పాడవుతాయి.
*తోటకూర: ఆకుకూరలన్నింటిలో విటమిన్-ఎ దీనిలోనే ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు విటమిన్-బి, మెగ్నీషియం, పొటాషియం, సెలీనియం, పీచు ఉంటాయి.
*పాలకూర:
దీంట్లో ప్రొటీన్, పీచుపదార్థం, విటమిన్-ఎ, ఇనుము మెండుగా ఉంటాయి.
*పొన్నగంటికూర:
జుట్టుకు పోషణనిచ్చే బయోటిన్ దీనిలో సమృద్ధిగా ఉంటుంది.
*చింతచిగురు:
దీంట్లో మాంసకృత్తులు, జింక్, సెలీనియం ఎక్కువ మొత్తంలో ఉంటాయి. రోగనిరోధకతను పెంచే విటమిన్-సి అధిక మొత్తంలో ఉంటుంది.
*గోంగూర:
పీచుతోపాటు, విటమిన్-కె, ఎ, మెగ్నీషియం ఉంటాయి. ఇనుమూ ఎక్కువే.
వేసవిలో ఆకుకూరలే హాయి
Related tags :