DailyDose

సికింద్రబాద్ ప్యారడైజ్ కక్కుర్తి-వాణిజ్యం

Telugu Business News Roundup Today-Secunderabad Paradise Made To Close

* ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభించే క్రమంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాన్‌- కంటైన్మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ నిబంధనలు మరింతగా సడలిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ సడలింపులు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. సవరించిన నిబంధనల ప్రకారం.. రాష్ట్ర రాజధాని చెన్నైలో నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు అమ్మే షాపులు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు తెరిచి ఉంచవచ్చని తెలిపింది. మిగిలిన స్టోర్లు ఉదయం పదిన్నరకు తెరిచి.. సాయంత్రం ఆరు గంటల వరకు నిర్వహించుకోవచ్చని పేర్కొంది.

* ఐటీ దిగ్గజం కాగ్నిజంట్‌ నికర లాభం ఈ మార్చి క్వార్టర్‌లో 17 శాతం తగ్గింది. గత ఏడాది మార్చి క్వార్టర్‌లో 44 కోట్ల డాలర్లుగా ఉన్న నికర లాభం ఈ ఏడాది మార్చి క్వార్టర్‌లో 37 కోట్ల డాలర్లకు తగ్గిందని కాగ్నిజంట్‌ తెలిపింది. ఆదాయం 3 శాతం వృద్ధితో 420 కోట్ల డాలర్లకు పెరిగిందని కంపెనీ సీఈఓ బ్రియాన్‌ హంఫ్రీస్‌ వెల్లడించారు. కరోనా వైరస్‌ కల్లోలం నేపథ్యంలో ఈ ఏడాది డిమాండ్‌ పరంగా సమస్యలు ఉండొచ్చని అంచనాలున్నాయన్నారు. అందుకే గతంలో వెలువరించిన ఈ ఏడాది ఆదాయ అంచనాలను వెనక్కి తీసుకుంటున్నామని వివరించారు. విభిన్నమైన సేవలందించడం, పటిష్టమైన బ్యాలన్స్‌ షీట్, లిక్విడిటీల దన్నుతో కరోనా కల్లోలాన్ని ఎదుర్కొనగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

* సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్‌ హోటల్‌ లాక్‌డౌన్‌ నిబంధనల్ని ఉల్లంఘించింది. ‘టేక్‌ అవే’ పేరిట పార్శిల్‌ సర్వీసులు ప్రారంభించింది. దీంతో బిర్యానీ కోసం పెద్ద ఎత్తున జనం క్యూ కట్టడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు హోటల్‌ను మూసివేయించారు.

* దేశీయ బ్యాంకులకు వందలాది కోట్ల రూపాయిల బకాయిలను ఎగవేసిన మరో వ్యవహారంలో నిందితులు దేశాన్ని వదిలి పరారైన ఉదంతం అలస్యంగా వెలుగుచూసింది. దిల్లీకి చెందిన బాస్మతీ బియ్యం ఎగుమతిదారు రామ్‌దేవ్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ యజమాన్యం, బ్యాంకుల కన్సార్టియంకు రూ.414కోట్ల మేర రుణాలను ఎగవేసినట్లు భారతీయ స్టేట్‌ బ్యాంకు (ఎస్బీఐ) ఫిర్యాదు చేసింది. రామ్‌ దేవ్‌ సంస్థ- ఎస్బీఐకి రూ.173.11 కోట్లు, కెనరా బ్యాంకుకు రూ.76.09 కోట్లు, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాకు రూ.64.31 కోట్లు, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు రూ.51.31 కోట్లు, కార్పొరేషన్‌ బ్యాంకుకు రూ.36.91 కోట్లు, ఐడీబీఐ బ్యాంకుకు రూ.12.27 కోట్లు బకాయి ఉన్నట్టు స్టేట్‌ బ్యాంకు పేర్కొంది. కాగా, నిందితులు పరారీలో ఉన్నట్టు తన ఫిర్యాదులో తెలిపింది.

* అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్‌ మార్చి-2020తో ముగిసిన నాలుగో త్రైమాసికం ఫలితాల్లో రాణించింది. స్టాండ్‌లోన్‌ పద్ధతిలో రూ.1,221 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.969 కోట్లు నికర లాభం నమోదు చేయడం గమనార్హం. గతంలో పోలిస్తే నికర లాభం 26 శాతం పెరిగింది.