* కరోనా మహమ్మారిపై పోరులో రాష్ట్ర ప్రభుత్వానికి పలువురు దాతలు అండగా నిలుస్తున్నారు. కొవిడ్ నియంత్రణ చర్యల కోసం తమ వంతు విరాళాలు అందిస్తున్నారు. ఈ మేరకు సీఎం సహాయ నిధికి ఇవాళ ఒక్కరోజే రూ. 8.30 కోట్ల మేర విరాళాలు వచ్చాయి. ఎల్‌టీ మెట్రో రైల్ రూ. 3 కోట్ల విలువైన పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులను అందజేసింది. ఈ మేరకు ఆ సంస్థ సీఈవో కేవీబీ రెడ్డి, ఎండీ ఎన్వీఎస్ రెడ్డి విరాళం చెక్కును కేటీఆర్‌కు అందించారు. పేపర్ బోర్డ్స్ అండ్ స్పెషాలిటీ పేపర్స్ డివిజన్ రూ. 2 కోట్లు విరాళంగా అందించింది. సంస్థ సీఈవో సంజయ్ సింగ్ కేటీఆర్‌ను కలిసి చెక్కు అందజేశారు. ఐటీసీ ఎండీ సంజీవ్ కుమార్ రూ. 2 కోట్లు విరాళంగా అందించారు. పోచంపాడ్ కన్‌స్ట్రక్షన్ ప్రైవైట్ లిమిటెడ్ రూ. కోటి విలువైన పీపీఈ కిట్లను విరాళంగా అందించింది.
* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,930కి చేరింది. కొత్తగా 43 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.
* భారత ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించి వేగవంతంగా చర్యలు తీసుకోవడం వల్ల కొవిడ్-19 కేసులను తక్కువ సంఖ్యకే పరిమితం చేయగలిగిందని మన దేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) రాయబారి డేవిడ్ నబారో స్పష్టం చేశారు. అయితే, కేసుల సంఖ్య జులైలో గరిష్ఠ స్థాయి(పీక్)కి చేరుతుందని అంచనా వేశారు. అంతకంటే ముందు కొన్నిరోజుల పాటు కొత్త కేసుల సంఖ్య స్థిరంగా నమోదవుతాయని తెలిపారు. ప్రముఖ జాతీయ మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
* లాక్‌డౌన్ నిబంధనల సడలింపులపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శవయాత్రలో అయితే కేవలం 20 మందికి అనుమతి ఇచ్చి, మద్యం షాపుల ఎదుట మాత్రం వేలమందికి అనుమతి ఇవ్వడంపై తనదైనశైలిలో కౌంటర్ ఇచ్చారు.
* తమిళనాడులో కరోనా మహమ్మారి వ్యాప్తి ఉద్ధృతి రోజురోజుకీ పెరిగిపోతోంది. గడిచిన 24గంటల్లోనే 526 కొత్త కేసులు; నాలుగు మరణాలు నమోదయ్యాయి. శనివారం నమోదైన కేసుల్లో ఒక్క చెన్నై నగరంలోనే 279 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 6535కి చేరగా.. మరణాలు 44కి చేరాయి.
* లాక్‌డౌన్ నిబంధనల సడలింపుల్లో భాగంగా ఏపీ సర్కార్ మరికొన్ని మినహాయింపులు కల్పించనుంది. ఈ మేరకు కంటైన్‌మెంట్, బఫర్ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో సాధారణ కార్యకలాపాల నిర్వహణకు కసరత్తు చేస్తోంది. లాక్‌డౌన్ వెసులుబాటు సమయాన్ని పెంచాలని నిర్ణయించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు దుకాణాలు తెరిచేలా సడలింపునకు ప్రణాళిక రూపొందించింది. సరి-బేసి సంఖ్యలో దుకాణాలను విభజించి ప్రణాళికను సిద్ధం చేస్తోంది. కేంద్రం సూచనల మేరకు సొంత వాహనాల నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసినట్టు సమాచారం. ఏపీ, తెలంగాణ మధ్య స్వస్థలాలకు వెళ్లే వారికి పరిమిత సంఖ్యలో అనుమతించే అంశంపై ప్రణాళికలు సిద్ధంచేస్తోంది.
* ఇతర దేశాల నుంచి ఏపీకి వచ్చేవాళ్లు సిద్ధంగా ఉండాలని కొవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ కృష్ణబాబు విజ్ఞప్తి చేశారు. వారిని తీసుకొచ్చే విమానాలు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వస్తాయని చెప్పారు. ఆయా విమానాల్లో మన వారిని సిద్ధంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి చేరుకున్నవారికి రెండు రకాల క్వారంటైన్లు సూచిస్తున్నామనీ.. పెయిడ్, ఉచిత క్వారంటైన్‌లలో ఏదైనా ఎంచుకోవచ్చన్నారు. ఇప్పటివరకు 30వేల మంది ఏపీ వాసులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు.
* దశల వారీగా లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాతా కరోనా వ్యాప్తికి అవకాశం ఉందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. శనివారం ఆయన రాష్ట్రంలోని పురపాలక కమిషనర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘పట్టణాల్లో సరి- బేసి విధానంలో దుకాణాల నిర్వహణను పర్యవేక్షించాలి. వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనాతో సహజీవనం చేయాల్సిన పరిస్థితి. కరోనా కట్టడికి అవసరమైన మార్గదర్శకాలను ఈ రోజు ఆరోగ్య, పురపాలక శాఖలు విడుదల చేస్తాయి. మాస్కులు, శానిటైజర్ల వినియోగం, భౌతికదూరం పాటించడం కొనసాగించాలి’’ అని సూచించారు.