లాక్‌డౌన్ తర్వాత సినిమా థియేటర్లలో సీను మార్చేందుకు రంగం సిద్ధం చేశారు యజమానులు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా థియేటర్లలో అనేక కొత్త చర్యలు తీసుకొస్తున్నట్లు వారు తెలిపారు. లాక్‌డౌన్ తర్వాత తిరిగి సినిమా ప్రదర్శనలు మొదలైతే థియేటర్‌లో ఒక సీటు వదిలి మరో సీటులో కూర్చునే విధానాన్ని రూపొందిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. మరో రెండు రోజుల్లో ఓ ప్రముఖ థియేటర్లో ఈ విధానాన్ని ప్రదర్శించాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో రెండు రోజుల కింద జంటనగరాల్లోని దాదాపు వందమంది థియేటర్ యజమానులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ సమస్యలపై చర్చించుకున్నారు. లాక్‌డౌన్ తర్వాత.. ప్రభుత్వం థియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇచ్చేందుకు ముందే తామే వైరస్ నిరోధానికి కొన్ని చర్యలు తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు.
అలాగే ప్రభుత్వ పెద్దలని కలిసి.. ప్రత్యేకంగా తయారుచేసిన నివేదికను అందజేయనున్నారట.
సినిమా హాళ్లలో కొత్తరూల్స్ ఇవే:
– ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్ చేసుకున్నప్పుడే ఒక సీటు తర్వాత మరో సీటు అందుబాటులో ఉండదు. ఉదాహరణకు.. ఒకరు ఒకటో నెంబర్ సీటు బుక్ చేసుకుంటే.. రెండో నెంబర్ సీటు కనిపించదు. అలాగే ప్రభుత్వం అనుమతిస్తే గనుక.. ఒకే ఫ్యామిలీకి చెందిన కుటుంబసభ్యులకు మాత్రం సీట్లను వరుసగా కేటాయించే అవకాశం ఇవ్వాలనుకుంటున్నట్లు వారు నివేదికలో పేర్కొన్నారు.
– అలాగే ప్రతీ ఆట ముగియగానే అన్ని సీట్లను శానిటైజ్‌తో శుభ్రపరుస్తామన్నారు
– అలాగే ఒక సినిమా ముగిసిన 45 నిమిషాల తర్వాత మరో సినిమాను మొదలుపెడతారట
– కాగిత రూపంలో ఇచ్చే టికెట్లకు చెక్ పెట్టి.. క్యూఆర్‌కోడ్‌తో ఉన్న టికెట్‌ను సెల్‌ఫోన్‌కు పంపిస్తారట.
– అలాగే టాయ్‌లెట్స్, ఫుడ్ స్టాల్స్ వద్ద భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నానట్లు నివేదికలో పేర్కొన్నారు థియేటర్ల యజమానులు.