DailyDose

జియో మరో సంచలన ఆఫర్-వాణిజ్యం

Telugu Business News Roundup Today-Jio New 365 Day Offer

* రిలయన్స్ జియో ఏది చేసినా సంచలనంగా మారుతుంది.. ప్రత్యర్థులకు సవాల్ విసురుతూనే ఉంటుంది… అన్నీ ఉచితమంటా టెలికాం రంగంలో అడుగుపెట్టిన అందరినీ షేక్ చేసిన ఆ సంస్థ.. తాజాగా తన వినియోగదారుల కోసం మరో వార్షిక ప్లాన్‌ను తీసుకొచ్చింది. ‘జియో వర్క్ ఫ్రం హోం’ పేరుతో ఈ ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది.. ఈ ప్లాన్ ద్వారా తన వినియోగదారులకు హై స్పీడ్ డేటాను అధిక మొత్తంలో అందించనుంది.. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు నిర్ణయించారు.. ఈ ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటా అందిస్తోంది జియో.. దీని కోసం రూ.2,399తో రీచార్జ్ చేసేకోవాల్సి ఉంటుంది. రూ.2,399తో ఈ వార్షిక ప్లాన్‌ను రీచార్జ్‌ చేసుకుంటే.. వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది. రోజుకు 2 జీబీ డేటా లభించనుంది. అంటే మొత్తంగా 730 జీడీ డేటాను పొందవచ్చు.. అంతే కాదు.. జియో నుంచి జియోకు ఉచితంగా అన్ లిమిటెడ్ కాల్స్ వెసులుబాటు ఉండగా.. ఇతర జియోయేతర నెట్‌వర్క్‌కు అయితే.. 12,000 నిమిషాలను అందిస్తోంది. ఇక, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీగా పొందవచ్చు.. వీటితో పాటు జియో యాప్స్‌కు కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. నెలవారీ రీఛార్జ్ కష్టం అనుకేవాళ్లు… కొంత లాంగ్‌టైమ్‌కు చూస్తుంటారు.. అలాంటి వాళ్లకు ఈ ప్లాన్ బాగా ఉపయోగకరంగా ఉండనుంది. అయితే, జియోలో ఇప్పటికే రూ.2,121 వార్షిక ప్లాన్ అందుబాటులో ఉండగా.. ఈ ప్లాన్‌లో మాత్రం రోజుకు 1.5 జీబీ డేటా మాత్రమే అందిస్తున్నారు.. అది కూడా 336 రోజుల వ్యాలిడిటీయే.. కొత్త రూ.2,399 ప్లాన్.. పాత ప్లాన్‌ కంటే బెస్ట్ అంటున్నారు.

* కేంద్ర ప్రభుత్వం వచ్చే వారంలో భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి సర్వం సిద్ధం చేసినట్లు సమాచారం. లాక్‌డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలై, అన్ని రంగాలూ దెబ్బతినడంతో కేంద్రం మరో భారీ ప్యాకేజీతో ప్రజల ముందుకు రానుంది. ఇప్పటికే అధికారులు రాత్రింబవళ్లు శ్రమించి ఈ ప్యాకేజీకి ఓ రూపం ఇచ్చినట్లు సమాచారం.

* వ్యాపార సంస్థలకు డిజిటల్‌ సేవలను అందించే ఆన్‌గో ఫ్రేమ్‌వర్క్‌.. కిరాణా దుకాణాలు, ఇతర చిన్న వ్యాపార సంస్థలు ఆన్‌లైన్‌లో విక్రయాలు చేసుకునేందుకు వీలుగా వెబ్‌సైట్‌ను రూపొందిస్తోంది. ఆయా సంస్థల అవసరాలను బట్టి, కేవలం 15 నిమిషాల్లోనే సైట్లను తయారు చేసి ఇస్తున్నట్లు ఆన్‌గో ఫ్రేమ్‌వర్క్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ రామా కుప్ప తెలిపారు. దీనికోసం ప్రత్యేకంగా ఆన్‌గో రిటైల్‌ను ప్రారంభించామని పేర్కొన్నారు. దుకాణదారుల నుంచి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుంటే.. కృత్రిమ మేధ సహాయంతో వెబ్‌సైట్‌ రూపుదిద్దుకుంటుందని చెప్పారు. కరోనా నేపథ్యంలో నిత్యావసరాలను ఆన్‌లైన్‌లో కొనేవారి సంఖ్య పెరుగుతోందని, స్థానిక కిరాణా దుకాణాలూ దీన్ని అందిపుచ్చుకునేందుకు వీలుగా ఈ వెబ్‌సైట్లు ఉపకరిస్తాయని ఆయన చెప్పారు. వ్యాపారులకు ఒకేచోట అన్ని రకాల డిజిటల్‌ సేవలు అందడంతోపాటు, కొనుగోలుదారులు సులభంగా వస్తువులను ఎంపిక చేసుకోవడం, చెల్లింపులు చేయడంలాంటివి సాధ్యమవుతాయని పేర్కొన్నారు. స్థానికంగా ఉండే దుకాణాల నుంచి కొనుగోలు చేయడంతో వస్తువులను తొందరగా పొందేందుకు వీలవుతుందని తెలిపారు.

* జనవరి-మార్చిలో ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏకీకృత నికర లాభం 6.91 శాతం మేర వృద్ధి చెంది రూ.1251 కోట్లకు చేరుకుంది. కరోనా ప్రభావాన్ని తట్టుకునేందు కోసం రూ.2725 కోట్లు కేటాయించిన అనంతరం ఈ లాభం నమోదుకావడం గమనార్హం. స్టాండలోన్‌ పద్ధతిన చూస్తే బ్యాంకు నికర లాభం 26 శాతం పెరిగి రూ.1221 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో బ్యాంకు లాభం రూ.969 కోట్లుగా ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి చూస్తే స్టాండలోన్‌ నికర లాభం 135 శాతం దూసుకెళ్లి రూ.7,930.81 కోట్లకు చేరుకోవడం విశేషం. ఆస్తుల నాణ్యత విషయంలో బ్యాంకు పుంజుకుంది. సమీక్షిస్తున్న త్రైమాసికం(2018-19 జనవరి-మార్చి)లో స్థూల నిరర్థక ఆస్తుల(ఎన్‌పీఏ) నిష్పత్తి 6.7 శాతంగా ఉండగా.. 2019-20 మార్చి త్రైమాసికానికి అవి 5.53 శాతానికి పరిమితమయ్యాయి. స్టాండలోన్‌ పద్ధతిలో మొత్తం కేటాయింపులు రూ.5,967 కోట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది మార్చి త్రైమాసికంలో ఇవి రూ.5,451 కోట్లుగా ఉండగా.. డిసెంబరు 2019 త్రైమాసికంలో రూ.2,083 కోట్లుగా ఉన్నాయి. తాజా కేటాయింపుల్లో కొవిడ్‌-19 ప్రభావం కోసం జతచేసిన రూ.2,725 కోట్లు కూడా ఉన్నాయి.

* పాలసీ కాల పరిమితి ముగిశాక హామీతో కూడిన రాబడులను అందించే ఎండోమెంట్‌ పాలసీ ఎస్‌బీఐ స్మార్ట్‌ ప్లాటినా అస్యూర్‌ ఈ నెల 14తో ముగియనున్నట్లు ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తెలిపింది. పరిమిత కాలం పాటు ప్రీమియం చెల్లింపుతో ఉండే ఈ పాలసీలో రూ.లక్ష లోపు ప్రీమియానికి ఏడాదికి 5.5శాతం, రూ.లక్షకు మించి ఉంటే 6శాతం చొప్పున రాబడి హామీ ఉంటుంది. చెల్లించిన వార్షిక ప్రీమియానికి పదిరెట్ల బీమా రక్షణ ఉంటుంది. కరోనా నేపథ్యంలో పాలసీదారులకు పాలసీలను అందించేందుకు లైఫ్‌ మిత్ర అనే డిజిటల్‌ వేదికను ప్రారంభించినట్లు సంస్థ వెల్లడించింది. ఏజెంట్లు, పాలసీదారుల దగ్గరకు వెళ్లకుండానే పాలసీలను విక్రయించేందుకు ఇది తోడ్పడుతుందని పేర్కొంది.