భారత్‌లో వ్యాపార కార్యకలాపాలను విస్తరించేందుకు దీర్ఘకాలం నుంచి ఎదురుచూస్తున్న అంతర్జాతీయ టెక్ దిగ్గజం యాపిల్ ఇప్పుడు ఆ అంశంపై దృష్టిసారించింది. భారత్‌లో ఇప్పటివరకు సొంత స్టోర్‌ను ప్రారంభించలేకపోయిన యాపిల్.. ప్రస్తుతం చైనాలోని తమ ఉత్పత్తి కార్యకలాపాల్లో కనీసం ఐదోవంతు భాగాన్ని భారత్‌కు తరలించేందుకు కసరత్తు చేస్తున్నది. దేశంలో మొబైల్ హ్యాండ్‌సెట్ల తయారీదారులతోపాటు ఎగుమతిదారులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకం ద్వారా లబ్ధి పొందాలని ఆ సంస్థ ఆశిస్తున్నది. లోకల్ సోర్సింగ్ నిబంధనల్లో కేంద్రం ఇచ్చిన సడలింపుల ద్వారా కూడా లబ్ధి పొందాలని యాపిల్ ఆకాంక్షిస్తున్నట్టు సమాచారం. ఈ విషయమై యాపిల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఇప్పటికే అనేక దఫాలు చర్చించారు.
కరోనా వైరస్ నేర్పిన గుణపాఠంతో అంతర్జాతీయ టెక్ దిగ్గజం యాపిల్ ఇప్పుడు భారత్‌వైపు చూస్తున్నది. ఈ వైరస్‌కు పుట్టినిల్లయిన చైనా నుంచి తమ ఉత్పత్తి కార్యకలాపాల్లో ఐదో వంతు భాగాన్ని భారత్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నది. ప్రస్తుతం తమ స్మార్ట్‌ఫోన్లతోపాటు ఇతర గ్యాడ్జెట్ల తయారీ కాంట్రాక్టులను ఫాక్స్‌కాన్, విస్ట్రన్ లాంటి సంస్థలకు ఇస్తున్న యాపిల్.. భారత్‌లో దాదాపు 4 వేల కోట్ల డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్లను తయారుచేసేందుకు ఈ కాంట్రాక్టర్లను ఉపయోగించుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై ఆ సంస్థ ఇప్పటివరకు స్పందించలేదు. అయితే పీఎల్‌ఐ పథకంలో కొన్ని అవరోధాలున్నాయని, వాటిని తొలగించాలని యాపిల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు ఈ వ్యవహారంతో సంబంధమున్న అధికారవర్గాలు వెల్లడించాయి. పీఎల్‌ఐ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఏ కంపెనీ అయినా 2020 నుంచి 2025 మధ్యకాలంలో దశలవారీగా కనీసం వెయ్యి కోట్ల డాలర్ల విలువైన మొబైల్ ఫోన్లను తయారు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ పథకానికి ఎంపికైన కంపెనీ తమ వార్షిక లక్ష్యాలను తప్పక అధిగమించాల్సి ఉంటుంది. ఆగస్టు 1 నుంచి ప్రారంభమయ్యే ఈ పథకానికి ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలను ప్రకటించనున్నది. ఈ మార్గదర్శకాలు జారీ అయిన వెంటనే యాపిల్‌తోపాటు శాంసంగ్, వివో, ఒప్పో లాంటి స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు కూడా పీఎల్‌ఐ పథకానికి దరఖాస్తు చేసుకొనే అవకాశమున్నది.
భారత స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో స్వల్ప వాటాను కలిగివున్న యాపిల్.. ప్రధానంగా ఎగుమతుల నిమిత్తమే తమ ఉత్పత్తి కార్యకలాపాల్లో అధిక భాగాన్ని చైనా నుంచి భారత్‌కు తరలించనున్నట్టు తెలుస్తున్నది. యాపిల్ ఇప్పటికే భారత్‌లో ఐఫోన్-7, ఐఫోన్-ఎక్స్‌ఆర్ మోడళ్లను తయారు చేస్తున్నది. గతంలో ఐఫోన్-ఎస్‌ఈ, ఐఫోన్-6ఎస్ మోడళ్లను కూడా భారత్‌లో తయారు చేసినప్పటికీ యాపిల్ తమ అంతర్జాతీయ ఉత్పత్తుల జాబితా నుంచి ఆ రెండు మోడళ్లను తొలగించింది. గత త్రైమాసికం చివరి నాటికి భారత ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో యాపిల్ 62.7 శాతం వాటాను కలిగి ఉన్నట్టు ఇంటర్నేషనల్ డాటా కార్పొరేషన్ కొద్ది రోజుల క్రితం వెల్లడించింది. ప్రస్తుతం భారత్‌లో రీసెల్లర్ల ద్వారా అమ్మకాలు జరుపుతున్న యాపిల్.. ఇప్పటివరకూ ఇక్కడ సొంత స్టోర్లను ప్రారంభించలేకపోయింది. వచ్చే ఏడాది భారత్‌లో యాపిల్ తొలి రిటైల్ స్టోర్‌ను ప్రారంభించే అవకాశాలున్నాయని ఆ సంస్థ సీఈవో టిమ్ కుక్ గతనెల తమ పెట్టుబడిదారులకు తెలిపారు. లోకల్ సోర్సింగ్ నిబంధనలను సడలిస్తున్నట్టు ప్రకటించగానే భారత ప్రభుత్వానికి యాపిల్ ధన్యవాదాలు తెలిపింది. భారత్‌లో తమ తొలి రిటైల్ స్టోర్‌ను ప్రారంభించే రోజు కోసం ఎదురుచూస్తున్నట్టు యాపిల్ ఆ సందర్భంగా పేర్కొన్నది.
ప్రస్తుతం భారత్‌లో యాపిల్ ఏటా దాదాపు 150 కోట్ల డాలర్ల విలువైన ఐఫోన్లను అమ్ముతున్నది. వీటిలో మూడో వంతు కంటే తక్కువ మాత్రమే స్థానికంగా తయారవుతున్నాయి. అయితే చైనాలోని తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టిన అతిపెద్ద సంస్థల్లో యాపిల్ ఒకటి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ చైనాలో దాదాపు 22 వేల కోట్ల డాలర్ల విలువైన వస్తువులను ఉత్పత్తి చేసింది. ఐఫోన్-ఎస్‌ఈ స్మార్ట్‌ఫోన్‌ను అంతర్జాతీయంగా అందుబాటులోకి తీసుకురావడంతోపాటు భారత్‌లోనూ అమ్ముతామని యాపిల్ ఇటీవల వెల్లడించింది. అంతేకాకుండా తమ ఉత్పత్తుల శ్రేణిని మరింత విస్తరించడంతోపాటు ‘హోంపాడ్’ స్మార్ట్ స్పీకర్‌ను మార్కెట్లోకి తీసుకొస్తామని ఆ సంస్థ ప్రకటించింది.