చిన్నతనంలో నాన్నను కోల్పోయాడు. గుండె సంబంధిత వ్యాధితో బాల్యానికి దూరమయ్యాడు. కటిక పేదరికం, వైద్యం చేయించే స్థోమత లేక ఓ బాలుడు లోకాన్ని వీడాడు. చివరికి అంత్యక్రియలకు సాగనంపే సమయంలో ‘ఆ నలుగురూ’ కూడా అందుబాటులోకి రాలేకపోయారు. ఓ వైపు కటిక పేదరికం, మరోవైపు కరోనాతో విధించిన లాక్‌డౌన్ పరిస్థితుల కారణంగా ఓ ఇంట నెలకొన్న ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో చోటుచేసుకుంది. భద్రాచలంలోని సుందరయ్యనగర్ కాలనీకి చెందిన షేక్ సాధిక్ (13) రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడే తండ్రి ముర్తుజాను కోల్పోయాడు. రెండేళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. పేదరికం కారణంగా తల్లి ఫరీదా వైద్యం చేయించలేకపోయింది. దీంతో గత రెండు నెలలుగా సాధిక్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం మృతిచెందాడు. సాధిక్ మరణ వార్తను బంధువులకు చేరవేసినప్పటికీ లాక్‌డౌన్ కారణంగా వారెవరూ రాలేకపోయారు. దీనికి తోడు అంతిమ యాత్రకు ప్రైవేటు వాహనం మాట్లాడి శ్మశాన వాటికకు తీసుకెళ్లే ఆర్థిక స్థోమత లేకపోయింది. దీంతో సాధిక్ తాత తనకున్న రిక్షాపైనే అంతిమ యాత్ర వాహనంగా మార్చారు. దాని మీదే మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించి అక్కడ అంత్యక్రియలు పూర్తిచేశారు.
భద్రాద్రి బిడ్డా…ఏమిటయ్యా ఈ తలరాత?
Related tags :