* గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీ క్లీనికల్ ట్రయల్స్ మొదలయ్యాయి. ఐసీఎంఆర్ పర్యవేక్షణలో ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వైరస్ సోకి వ్యాధి నుంచి బయటపడిన 15 మంది తమ రక్తం ఇవ్వడానికి ముందుకు వచ్చారు.
* ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి ఇప్పటికే దాదాపు 3లక్షల మందిని బలితీసుకుంది. మరో 40లక్షల మంది దీనికి బాధితులుగా మారిన విషయం తెలిసిందే. విస్తృత వేగంగా వ్యాపిస్తోన్న ఈ వైరస్ తీవ్రత కొన్నిదేశాలతో పోల్చితే భారత్‌లో తక్కువగానే ఉంది. దీనికి ఇక్కడ వెచ్చని వాతావరణ పరిస్థితులు దోహదపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ సమయంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా వైరస్ వ్యాప్తి తగ్గుతుందనే విషయాన్ని కొట్టిపారేయలేం.
* కరోనా రోగి లక్షణాల ఆధారంగా డిశ్చార్జి విధానంలో మార్పులు చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ‘‘హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న వ్యక్తి కుటుంబసభ్యులకు దూరంగా ఉండాలి. కరోనా బాధితులు డిశ్చార్జి అయ్యాక 7 రోజులు హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలి. హోమ్ ఐసోలేషన్ పూర్తయ్యాక పరీక్షలు చేయాల్సిన అవసరం లేదు. విదేశాల నుంచి వచ్చేవారు కేంద్ర సూచనలు కచ్చితంగా పాటించాలి. 23 విమానాల్లో 4వేల మంది భారతీయులను తీసుకొచ్చాం. 468 రైళ్లలో 5 లక్షల మందికిపైగా వలస కార్మికులను స్వస్థలాలకు పంపాం’’ అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
* రైల్వే శాఖ ఈ నెల 12 నుంచి రైళ్లను నడపనున్న విషయం తెలిసిందే. దీని కోసం రైల్వే శాఖ కొన్ని ప్రామాణిక నిబంధనలు విడుదల చేసింది. దీని ప్రకారం.. టికెట్లను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో మాత్రమే బుక్ చేసుకోవాలి. ఏడు రోజుల ముందస్తు రిజర్వేషన్‌కు మాత్రమే అనుమతి ఉంది. ఆన్‌లైన్‌లో మాత్రమే టికెట్లను క్యాన్సిల్ చేసుకునే అవకాశం. టికెట్ ను 24గంటల ముందుగా రద్దు చేసుకోవాలి.. 50% రుసుము మాత్రమే తిరిగి చెల్లిస్తారు.
* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. కొవిడ్ – 19 పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 38 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 2018కి చేరింది.
* కరోనా వైరస్ తీవ్రత మహిళల్లో కంటే పురుషుల్లోనే ఎక్కువ అని ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చాయి. దీనికి గల కారణాలను కూడా విశ్లేషించాయి. అయితే, ఇప్పటి వరకు ఎవరూ దీనికి పక్కా శాస్త్రీయమైన ఆధారాన్ని మాత్రం పేర్కొనలేదు. మగవారి జీవనశైలి, మహిళల్లో సాధారణంగా ఉండే అధిక రోగనిరోధక శక్తిని దృష్టిలో పెట్టుకొని పరిశోధనలు సాగించారు. కానీ, తాజాగా వెలువడిన ఓ అధ్యయనం ఓ ఆసక్తికరమైన ఆధారాన్ని తెరమీదకు తెచ్చింది.