ప్రయాణికుల రైళ్ల ప్రారంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ ప్రామాణిక నిబంధనలను విడుదల చేసింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదించి రైళ్లు నడపాలని రైల్వే మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ప్రామాణిక నియమాలతో కూడిన లేఖను కేంద్ర ప్రభుత్వంలోని అన్ని విభాగాలకు, అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు, కేంద్ర పాలిత ప్రాంతాల పాలనాధికారులు, జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ సభ్య కార్యదర్శులకు హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖలు రాశారు.
ప్రామాణిక నిబంధనలు ఇవే…
* రైలు షెడ్యూల్, ప్రయాణికుల బుకింగ్, ప్రవేశం, ప్రయాణికుల కదలికలు, కోచ్ సేవల వివరాలను రైల్వే మంత్రిత్వ శాఖే విస్తృతంగా ప్రచారం చేయాలి.
* ధ్రువీకరించిన ఈ-టిక్కెట్లు ఉన్న ప్రయాణికులను మాత్రమే స్టేషన్లోకి అనుమతించాలి.
* ఈ-టికెట్ ఆధారంగానే ప్రయాణీకుల కదలికలతో పాటు రైల్వే స్టేషన్‌కు ప్రయాణీకులను రవాణా చేసే వాహనం యొక్క డ్రైవర్‌కు అనుమతి.
* రైల్వే స్టేషన్లోకి ప్రవేశించే ప్రయాణీకులందరికి తప్పనిసరిగా స్క్రీనింగ్ జరపాలి.
* కరోనా లక్షణాలు లేని ప్రయాణీకులను మాత్రమే రైలు ప్రయాణానికి అనుమతించాలి.
* ప్రయాణికుల కోసం స్టేషన్, కోచ్ ప్రవేశ, నిష్క్రమణ పాయింట్ల వద్ద హ్యాండ్ శానిటైజర్లు పెట్టాలి.
* ప్రయాణీకులందరూ ప్రవేశ సమయంలో, ప్రయాణ సమయంలో ఫేస్ మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలి.
* బోర్డింగ్, ప్రయాణ సమయంలో ప్రయాణీకులందరూ సామాజిక దూరాన్ని పాటించాలి.
* ప్రయాణీకుల కోసం ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ ప్రచారం ద్వారా ఆరోగ్య సలహాలు, మార్గదర్శకాలు అందించాలి.
* ప్రయాణికులు వారి గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత.. ఆ రాష్ట్రం సూచించిన ఆరోగ్య నియమాలకు కట్టుబడి ఉండాల్సిందే.