యాభై రోజుల విరామం తర్వాత రెగ్యులర్ ప్రయాణికుల రైళ్లు మంగళవారం నుంచి పట్టాలు ఎక్కనున్నాయి. ఈ రైళ్ల ప్రయాణానికి సంబంధించిన కొత్త మార్గదర్శకాల్ని రైల్వేశాఖ ప్రకటించింది. రైలు ప్రయాణికులు 90 నిమిషాలు ముందుగా స్టేషన్‌కు చేరుకోవాలి. ముఖాలకు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. ఆహారం, మంచినీరు వెంట తెచ్చుకోవాలి. ప్రయాణికులు కోరితే ప్యాకేజ్డ్ వాటర్, భోజనం రైల్వే అధికారులు అందించనున్నారు. టికెట్ తీసుకునే సమయంలోనే వీటిని బుక్ చేసుకోవాలి. జనరల్ టికెట్లు ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవాలి. ప్రయాణికులకు రైళ్లలో బెడ్‌షీట్లు, దిండ్లు ఇవ్వరు. కూపేలు, కిటికీల కర్టెన్లను తొలగించనున్నారు. రెగ్యులర్ ప్యాసింజర్ రైళ్లు, మెయిల్/ఎక్స్‌ప్రెస్‌లు, సబర్బన్ సర్వీసులు తదుపరి ప్రకటన వచ్చేంతవరకు రద్దయినట్లేనని రైల్వేశాఖ పేర్కొంది.
రైళ్ల వివరాలు ఇవే…
* దిల్లీ నుంచి సికింద్రాబాద్ వచ్చే రైలు (నం.02438) 17న ఆదివారం సాయంత్రం 4 గంటలకు బయలుదేరి.. మరుసటిరోజు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుంది. నాగ్‌పుర్, భోపాల్, ఝాన్సీ స్టేషన్లలో ఈ రైళ్లు ఆగనున్నాయి.
* సికింద్రాబాద్ నుంచి దిల్లీకి (నం.02437) 20న బుధవారం మధ్యాహ్నం 1.15 గంటలకు రైలు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 10.40కి చేరుతుంది.
* బెంగళూరు-దిల్లీ-బెంగళూరు డైలీ రైళ్లు (నెం.02691/02692) సికింద్రాబాద్ మీదుగా రాకపోకలు సాగించనున్నాయి. అనంతపురం, గుంతకల్లు, సికింద్రాబాద్‌తో పాటు నాగ్‌పుర్, భోపాల్, ఝాన్సీలలో ఆగనున్నాయి.
* చెన్నై సెంట్రల్-దిల్లీ-చెన్నై సెంట్రల్ ప్రత్యేక రైళ్లు (బైవీక్లీ) విజయవాడ, వరంగల్‌లలో ఆగనున్నాయి.
* ప్రత్యేక రైళ్లలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏసీ బోగీలు మాత్రమే ఉంటాయని.. రెగ్యులర్ రాజధాని రైలు సర్వీసుల ఛార్జీలే ఉంటాయని రైల్వేశాఖ తెలిపింది.
* టికెట్ రద్దు.. ప్రయాణ సమయానికి 24 గంటల ముందు చేసుకోవాలి. 50 శాతం డబ్బు తిరిగివస్తుంది.
* తత్కాల్, ప్రీమియం తత్కాల్ ఛార్జీలు లేవు.
కొందరికే రాయితీ సౌకర్యం
ఈనాడు, దిల్లీ: ప్రత్యేక రైళ్లలో గతంలో ఉన్న అందరికీ రాయితీలు వర్తించవని రైల్వేబోర్డు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. విద్యార్థులు, దివ్యాంగులు, స్వాతంత్య్ర సమర యోధులకు రాయితీ కల్పించినప్పటికీ.. సీనియర్ సిటిజన్లకు రాయితీ ఇవ్వలేదు. రైల్వే మంత్రిత్వశాఖ జారీ చేసిన పలు ఆదేశాలననుసరించి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లలో రిజర్వేషన్ కేంద్రాలు మంగళవారం నుంచి తెరుస్తున్నట్లు రైల్వేబోర్డు పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్, వరంగల్, విజయవాడ, అనంతపురం, గుంతకల్లు స్టేషన్‌లలో ఈ కేంద్రాలను తెరుస్తారు. దివ్యాంగులకు థర్డ్ ఏసీలో రెండు బెర్త్‌లు కేటాయిస్తారు. హెచ్‌ఓఆర్ సదుపాయం ఉన్నవారు.. ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్లమెంట్ హౌస్ కోటా కింద ఫస్ట్ ఏసీలో రెండు బెర్తులు, సెకండ్ ఏసీలో 4 బెర్త్‌ల సదుపాయం ఉంటుందని రైల్వే బోర్డు పేర్కొంది.
ప్రత్యేక కౌంటర్లలో ఎవరు టికెట్లు తీసుకోవచ్చంటే
* ఉన్నతాధికారుల అభ్యర్థన (హెచ్‌ఓఆర్)
* సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు, స్వాతంత్య్ర సమరయోధులు
* నిబంధనల ప్రకారం పూర్తి మొత్తం చెల్లించే వారెంట్లు, ఓచర్లు
* టికెట్లు, ఉచిత ప్రయాణ సౌకర్యం, కార్డ్ పాస్, డ్యూటీ పాస్ కలిగిన రైల్వే ఉద్యోగులు.