వివాహాది శుభకార్యాలకు ఈ నెలాఖరుకి ముహూర్తాలు ముగియనుండటంతో ఆంధ్రప్రదేశ్ లో పెళ్లిళ్లు జరిపించుకునేందుకు అనుమతించాలని దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. ఈ నెల 30 నుంచి శుక్ర మౌఢ్యం ప్రారంభం కానుండగా, ఆపై శ్రావణ మాసంలోనే ముహూర్తాలు ఉన్నాయి. దీంతో చాలా వరకూ వివాహాలు ఈ నెలలోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కరోనా కారణంగా భారీ ఎత్తున బంధుమిత్రులను ఆహ్వానించే పరిస్థితి లేకపోవడంతో, మీ వైపు నుంచి పది మంది, మా వైపు నుంచి పదిమందితో పెళ్లిని ముగించేద్దామని అనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది.
లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉన్న కారణంగా, వివాహాలకు పోలీసుల అనుమతి తప్పనిసరైంది. ఈ నెలలో 12, 13, 14, 15 తేదీల్లో, ఆపై 23, 24 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు అంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో పెళ్లికి పోలీసుల నుంచి అనుమతి తీసుకుంటుండగా, గ్రామాల్లో గుట్టుచప్పుడు కాకుండా పెళ్లిళ్లు జరిగిపోతున్నాయి. మార్చి 22 తరువాత వాయిదా పడ్డ వివాహాలన్నీ ఈ మూడు వారాల వ్యవధిలో జరిగిపోతాయని అంచనా. అతిథులను తక్కువ సంఖ్యలో ఆహ్వానించి, మాస్క్ లు ధరించి, భౌతికదూరం పాటిస్తూ వివాహాలు జరిపించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
కంటైన్ మెంట్ జోన్లలో వివాహాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వబోమని, మిగతా ప్రాంతాల్లో అతికొద్దిమందితో వేడుకలకు అనుమతి ఇస్తున్నామని అధికారులు అంటున్నారు. వరుడు, వధువు ఒకే జిల్లా వారైతే తహసీల్దార్ స్థాయిలో అనుమతులు లభిస్తాయని, వేర్వేరు జిల్లాల వారైతే కలెక్టర్ కార్యాలయం నుంచి అనుమతి పత్రాలను పొందాలని తెలియజేశారు. వివాహ ఆహ్వాన పత్రిక, నిబంధనలు పాటిస్తామన్న హామీ పత్రాన్ని అందించాల్సి వుంటుందని తెలిపారు.