NRI-NRT

ఉక్రెయిన్‌లో కడప సతీష్‌రెడ్డి మృతి

Telugu MBBS Student From Kadapa Satish Reddy Dies In Ukraine

కడప జిల్లాకు చెందిన మెడిసిన్‌ విద్యార్థి ఉక్రెయిన్‌లో మృతి చెందాడు. మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లా పెనగలూరు మండలం సోమంతరాజపురం పంచాయతీ బెస్తపల్లి గ్రామానికి చెందిన పాలగిరి సుబ్బారెడ్డి, భారతి కుమారుడు సతీష్‌ రెడ్డి 2018 ఆగస్టులో ఎంబీబీఎస్‌ చదవడానికి ఉక్రెయిన్‌ వెళ్లాడు. గత నెల 25వ తేదీన హాస్టల్‌ గదిలో తాను పడుకున్న మంచంపై నుంచి కిందపడటంతో తలకు బలమైన గాయమైంది. స్నేహితులు, యూనివర్సిటీ అధికారులు వెంటనే స్పందించి సతీష్‌రెడ్డిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెదడుకు బలమైన గాయం కావడంతో శస్త్ర చికిత్స చేశారు. ఈ క్రమంలో ఆ యువకుడు ఆదివారం ఉదయం 11 గంటలకు మృతి చెందాడు. సతీష్‌ రెడ్డి తల్లిదండ్రులు జీవనోపాధి నిమిత్తం కువైట్‌లో ఉన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా మృతుని కుటుంబసభ్యులు ఈనెల 30 తేదీ వరకు ఎటూ వెళ్లలేని పరిస్థితి. మృతునికి సోదరి సాయిగ్రీష్మ ఉన్నారు. ప్రభుత్వం స్పందించి మృతదేహం, మృతుని తల్లిదండ్రులను స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని వారి బంధువులు కోరుతున్నారు. సతీష్‌ రెడ్డి మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.