NRI-NRT

తిరిగొచ్చిన ఎన్నారైలకు నరకం

Foreign Returned Indians Face Horrible Conditions

వారంతా బతుకుదెరువు, ఉపాధి వెతుక్కుంటూ దేశం కాని దేశం వెళ్లారు. అమెరికా, బ్రిటన్‌, గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన వారి పరిస్థితి కరోనా కాటుతో అగమ్యగోచరంగా మారింది. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోవడంతో చేతిలో చిల్లిగవ్వలేదు. ఆకలితో పస్తులున్న సందర్భాలున్నాయి. ఎప్పుడెప్పుడు తమ దేశానికి వెళ్లిపోదామా అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. స్వదేశానికి తీసుకెళ్లాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఎట్టకేలకు వారి మొర ఆలకించిన ప్రభుత్వం వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి తరలిస్తోంది. అలా వచ్చిన వారికి స్ర్కీనింగ్‌ టెస్ట్‌లు చేసి, 14 రోజులు క్వారంటైన్‌ చేయాలని నిర్ణయించింది. అధికారులు వారికి నగరంలోని పలు హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. వాటినే క్వారంటైన్‌ కేంద్రాలుగా మార్చేసినట్లు ప్రకటించారు. మంచి భోజనం, వసతులతో కూడిన క్యారంటైన్‌లో ఉండాలనుకునే వారు కొంత డబ్బు చెల్లించాలని చెప్పడంతో.. పిల్లలు, ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్న వారు పెయిడ్‌ క్వారంటైన్‌లను ఎంచుకున్నారు. వారి నుంచి డబ్బులు వసూలు చేసిన నిర్వాహకులు ఎన్నారైలకు నరకం చూపిస్తున్నారు.
***డబ్బులుంటేనే..
హోటళ్లలో పెయిడ్‌ క్వారంటైన్‌లలో ఉండాలనుకునే ఎన్నారైలకు రూ. 5వేలు, రూ. 15 వేలు, 30వేలు ప్యాకేజీ ఉంటుందని చెప్పారు. ప్యాకేజీ ఎంచుకుని బస్సుల్లో సదరు హోటళ్లకు వచ్చిన తర్వాత పూర్తిగా సీన్‌ రివర్స్‌ అయ్యింది. ‘డబ్బులున్న వారు మాత్రమే హోటళ్లో దిగండి. లేదంటే రావొద్దు’ అని నిర్వాహకులు హుకుం జారీ చేశారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
***పిల్లలు, గర్భిణుల ఆకలి కేకలు..
కరోనా కష్టాల్లోంచి బయటపడి నగరానికి చేరుకున్న ఎన్నారైల పరిస్థితి దారుణంగా తయారైందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ఫోన్లలో చార్జింగ్‌ లేదు. మీరు అడిగిన డబ్బులు మావాళ్ల ద్వారా తెప్పించి ఇస్తాం. 14 రోజులు ఇక్కడే ఉంటాం కదా.. మీ డబ్బులు ఎక్కడికీ పోవు’ అని చెప్పినా వినిపించుకోకుండా నరకం చూపించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం గర్భిణులు, చిన్నపిల్లలకు సైతం సరైన భోజనం పెట్టడం లేదని, భోజనం, కూరలు ఏ మాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడిగినన్ని డబ్బులు చెల్లిస్తేనే ఇక్కడ ఉండాలని, లేదంటే గాంధీ ఆస్పత్రికి తరలిస్తామని బెదిరిస్తున్నారని అంటున్నారు.
***చెకప్‌ లేదు.. పాలూ లేవు..
క్వారంటైన్‌లో గర్భిణులకు హెల్త్‌ చెకప్‌లు ఉంటాయని అధికారులు తెలిపారు. కానీ, ఆ విషయమే పట్టించుకోవడంలేదు. వృద్ధులను క్వారంటైన్‌లో ఉంచకుండా ఇళ్లకు పంపించి హోం క్వారంటైన్‌ చేస్తామని చెప్పిన అధికారులు వారిని పట్టించుకోవడం మానేశారని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గర్భిణులకు మంచి ఆహారం, పిల్లలకు పాలు ఇవ్వాలని కోరినా, పట్టించుకోలేదని కాచిగూడలోని ఓ హోటల్‌ క్వారంటైన్‌లో ఉన్న మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తమ వాళ్లకు ఫోన్‌ చేసి కావాల్సిన పండ్లు, వస్తువులు తెప్పించుకుంటామన్నా అనుమతించడం లేదని, పెట్టింది తినాలి.. అడిగినంతా చెల్లించాలి అన్నట్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించింది. అతికష్టం మీద పిల్లలకు పాలు తెచ్చిన నిర్వాహకులు పాలకు వేరేగా డబ్బులు చెల్లించాలని చెబుతున్నారని కువైత్‌ నుంచి వచ్చిన మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వ ఉన్నతాధికారులు తమ గోడు పట్టించుకోవాలని, సరైన భోజనం, వసతి ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు. డబ్బులు వసూలు చేయడంపై ఉన్న శ్రద్ధ ఆహారం సమకూర్చడంపై లేదన్నారు.
*నిబంధనలు అమలు చేయండి..
నగరంలో కట్టడి కేంద్రాల్లో ప్రభుత్వం అమలు చేసిన నిబంధనలను పెయిడ్‌ క్వారంటైన్‌లలో ఉంటున్న తమకు కూడా అమలు చేయాలని పలువురు ఎన్నారైలు కోరుతున్నారు. కట్టడి కేంద్రాల్లో ఉన్న వారికి కావాల్సిన వస్తువులను ఎలా అయితే కొనితెచ్చారో.. పెయిడ్‌ క్వారంటైన్‌లలో కూడా అదే పద్ధతి పాటిస్తే, పాలు పండ్లు కొనుక్కుంటామని చెబుతున్నారు. దీంతో పిల్లలు, గర్భిణుల ఆకలి బాధలు తప్పుతాయని అంటున్నారు. రెండు రోజులకే పెయిడ్‌ క్వారంటైన్‌లో నరకం చూస్తున్నామని అంటున్నారు. మిగిలిన రోజుల్లో ఇంకా ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించాలని, పెయిడ్‌ క్వారంటైన్‌లో మంచి భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించాలని వారు కోరుతున్నారు. వారు బతుకు జీవుడా అని ఇక్కడికి వచ్చింది.. సొంత రాష్ట్రంలో ఆకలితో చావడానికి కాదని పలువురు ఎన్నారైలు అంటున్నారు.
**రూ.15 వేలు చెల్లించినా.. ఎన్నారై, వరంగల్‌వాసి
ప్రత్యేక ఎయిర్‌ ఇండియా విమానంలో నగరానికి వచ్చాం. కొందరిని కాచిగూడలోని మహారాజా హోటల్‌లో క్వారంటైన్‌ కోసం ఉంచారు. ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి రూ. 15 వేలు వసూలు చేశారు. సరైన ఆహారం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. విమానానికి రూ.25 వేలు, హోటల్‌లకు రూ.15 వేలు మొత్తం రూ. 40 వేలు చెల్లించినా, హోటల్‌లో సరైన సదుపాయాలు లేవు. మంచి ఆహారం దొరకడం లేదు. బ్రేక్‌ఫాస్ట్‌లో కొద్దిపాటి ఉప్మా, లంచ్‌.. డిన్నర్‌లో పప్పు మాత్రమే ఇస్తున్నారు. అది కూడా పరిశుభ్రంగా లేని ఆహారాన్ని ప్యాకెట్లలో ఇస్తున్నారు. ఇప్పటికైనా మంచి ఆహారం అందేలా చూడాలి.