DailyDose

చైనా మొహం మీద సూపర్ పంచ్ కొట్టనున్న అమెరికా-వాణిజ్యం

Telugu Business News Roundup Today-USA Withdrawing Investments In China

* అన్ని రంగాల్లోని అగ్రగ్రామి కంపెనీలు ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ఆరంభించేందుకు తొలి అడుగులు వేశాయి. వాహన రంగ దిగ్గజం మారుతీ సుజుకి, ఎలక్ట్రానిక్స్‌ సంస్థ శామ్‌సంగ్‌, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సహా అనేక కంపెనీలు పనులు ఆరంభించాయి. దశల వారీగా ఉత్పత్తిని పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఒకే సారి కాకుండా మెల్లమెల్లగా పూర్తి స్థాయిలో ఉత్పత్తి పెంచాలని కంపెనీలు భావిస్తున్నాయి. కొవిడ్‌-19 వ్యాపించే ప్రమాదం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. కఠిన మార్గనిర్దేశాలు అమలు చేయాలని ప్రభుత్వం సూచించడం ఇందుకు మరో కారణం. ఉద్యోగుల సంరక్షణ, పరిశుభ్రతకు యాజమాన్యాలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి.

* కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో చైనాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న అమెరికా మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతీకారంగా చైనా ఈక్వీటీ మార్కెట్లలో పెట్టాలని నిర్ణయించిన భారీ పెట్టుబడుల్ని నిలిపివేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ‘ఫాక్స్‌ బిజినెస్‌’ ఓ కీలక పత్రాన్ని స్వాధీనం చేసుకుంది.

* లాక్‌డౌన్‌ కారణంగా ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ నిబంధనలను ఒక్కొక్కటిగా సడలిస్తున్నారు. ఇప్పటికే రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఇక విమాన ప్రయాణాలపైనే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాగా, పౌర విమానయానశాఖ కొన్ని సూచనలతో ముసాయిదాను రూపొందిచినట్లు సమాచారం.

* మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో స్థిరాస్తి సంస్థ గోద్రేజ్‌ ప్రోపర్టీస్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.101.08 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ.156.66 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 35 శాతం తక్కువ. ఇక మొత్తం ఆదాయం రూ.1,203.21 కోట్ల నుంచి రూ.1,288.17 కోట్లకు పెరిగింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం (2019-20)లో కంపెనీ నికర లాభం రూ.253.15 కోట్ల నుంచి రూ.267.21 కోట్లకు వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.3,221.98 కోట్ల నుంచి రూ.2,914.59 కోట్లకు పరిమితమైంది. ఇక మొత్తం అమ్మకాల బుకింగ్‌లు రూ.5,915 కోట్లు; 8.80 మిలియన్‌ చదరపు అడుగులుగా నమోదైంది. 2018-19లో ఇది రూ.5,316 కోట్లు; 8.76 మి.చదరపు అడుగులుగా ఉంది. ఇక ఆర్థిక సంవత్సరంలో ఇవే అత్యధిక అమ్మకాలు అని గోద్రేజ్‌ ప్రోపర్టీస్‌ తెలిపింది.

* అంతర్జాతీయ ప్రతికూలతల నేపథ్యంలో నేడు స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:50 గంటల సమయంలో సెన్సెక్స్‌ 602 పాయింట్లు కోల్పోయి 30,965 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 167 పాయింట్లు దిగజారి 9,070 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.13 వద్ద కొనసాగుతోంది. మార్చిలో ఐదు నెలల కనిష్ఠానికి పడిపోయిన రిటైల్‌ ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ(సీపీఐ).. ఏప్రిల్‌ వివరాలు నేడు విడుదల కానున్న నేపథ్యంలో మదుపర్లు దీనిపై దృష్టి సారించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మరోవైపు అమెరికా మార్కెట్లు ఊగిసలాటలో ముగిశాయి. ఇటు దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 70వేల మార్క్‌ దాటడం మదుపర్ల సెంటిమెంటును ప్రతికూలపరిచినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే సూచీలు నేలచూపులు చూస్తున్నాయి.

* ప్రపంచ ప్రఖ్యాత విద్యుత్‌ కార్ల తయారీ కంపెనీ టెస్లా అమెరికాలో తన కార్యకలాపాల్ని పునఃప్రారంభించింది. స్థానిక అధికారులు అనుమతులు ఇవ్వకపోయినప్పటికీ.. సీఈఓ ఎలన్‌ మస్క్‌ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఒకవేళ కంపెనీ పునరుద్ధరణకు అనుమతించకపోతే టెక్సాస్‌ లేదా నెవడాకు ప్రధాన కార్యాలయాన్ని మారుస్తామని కాలిఫోర్నియా ప్రభుత్వాన్ని హెచ్చరించిన మరుసటి రోజే ఆయన కంపెనీని తిరిగి ప్రారంభించడం గమనార్హం. ఈ మేరకు కంపెనీ ఉద్యోగులు, కార్మికులకు ఆయన లేఖ రాశారు. సోమవారం నుంచి కంపెనీ సాధారణ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఇది అలమెడా స్థానిక ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ.. ముందుకు వెళ్లేందుకే నిర్ణయించుకున్నామన్నారు. ఒకవేళ అరెస్టు చేయాలని అధికారులు భావిస్తే తనని మాత్రమే చేయాలని తేల్చి చెప్పారు. కాలిఫోర్నియా గవర్నర్‌ అనుమతించినప్పటికీ.. అలమెడా అధికారులు వాటిని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగుల భద్రతకు అన్ని రకాల ఏర్పాట్లు తీసుకున్నామన్నారు.