DailyDose

ఇది ట్రంప్ డెత్ క్లాక్-తాజావార్తలు

Times Square Gets New Billboard Called Trump Death Clock

* కరోనా వైరస్‌ తీవ్రత గురించి హెచ్చరించినప్పటికీ చెవికెక్కించుకోలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇప్పటికే విమర్శల పాలైన సంగతి తెలిసిందే. తాజాగా న్యూయార్క్‌ నగరంలోని ప్రఖ్యాత టైమ్స్‌ స్క్వేర్‌ వేదికగా ఇలాంటి వ్యాఖ్యలే వినిపించాయి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న దాని మీద ‘ట్రంప్‌ డెత్‌ క్లాక్‌’ పేరుతో ఒక బిల్‌ బోర్డు వెలిసింది. ట్రంప్ తగిన సమయంలో చర్యలు తీసుకొని ఉంటే ఆపగలిగే మరణాల సంఖ్యను దాని మీద ప్రదర్శించారు. ఆ బిల్‌బోర్డు సృష్టికర్త న్యూయార్క్‌కు చెందిన సినీనిర్మాత యూజీన్‌ జారెకి.

* శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. శ్రీశైలం నుంచి 3 టీఎంసీల నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం తలపెట్టిన కొత్త ఎత్తిపోతలపై తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్‌ బోర్డు ఛైర్మన్‌కు లేఖ రాశారు. విభజన చట్టానికి విరుద్ధంగా ప్రాజెక్టు చేపడుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా ప్రాజెక్టు చేపట్టడం వీలుకాదని లేఖలో పేర్కొంది. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యం పెంచకుండా చూడాలని కోరింది. 80 వేల క్యూసెక్కులకు పెంచే పనుల టెండర్లను చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని కృష్ణా బోర్డును తెలంగాణ ప్రభుత్వం కోరింది.

* ఐక్య రాజ్యసమితి గుర్తించిన మడ అడవులను సైతం వైకాపా ప్రభుత్వం నరికివేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ సమతుల్యం కాపాడటంలో కీలక భూమిక పోషించే మడఅడవులను ఇష్టానుసారం కొట్టేయడం వల్ల పెనువిపత్తులు సంభవించే అవకాశం ఉందన్నారు. తుపాన్లు వచ్చినప్పుడు తీర ప్రాంతాలకు రక్షణగా ఉండేది మడఅడవులేనని చంద్రబాబు గుర్తు చేశారు. పేదల ఇళ్లస్థలాల పేరిట వారికి ఇలాంటి ప్రాంతాల్లో స్థలాలు ఇస్తే అనుకోని ఉపద్రవం ముంచుకొచ్చినప్పుడు వారిని ఎవరు కాపాడతారని ప్రశ్నించారు. మడఅడవులు నరికివేసిన దృశ్యాలను చంద్రబాబు ట్విటర్‌లో పోస్టు చేశారు.

* రాష్ట్రంలో కరోనా బారినపడి కోలుకుంటున్నవారి సంఖ్య పెరగడంతో.. యాక్టివ్‌ కేసులు తగ్గుముఖం పడుతోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1056 మంది డిశ్చార్జి అయ్యారన్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 51.49 శాతంగా ఉందన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. మరణాల శాతం తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు జవహర్‌ రెడ్డి పేర్కొన్నారు. పాజిటివ్‌ కేసుల గుర్తింపుతో పాటు హైరిస్క్‌ కేటగిరీ వారిని రక్షించుకోవాలని జవహర్‌ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. ఇతర వ్యాధులున్న వృద్ధులు ఈ కేటగిరీలోకి వస్తారని.. వృద్ధులకు పరీక్షలు చేయాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించినట్లు పేర్కొన్నారు. అత్యవసర కేసుల్లో ప్లాస్మా సేకరిస్తున్నామని.. దీనిలో భాగంగా స్విమ్స్‌, కర్నూలు జీజీహెచ్‌లో ప్లాస్మా సేకరిస్తున్నట్లు చెప్పారు. మంగళగిరి ఎయిమ్స్‌కు కేంద్రం నుంచి అనుమతి లభించిందన్నారు.

* రోజురోజుకు పెరుగుతున్న కేసులతో గ్రేటర్‌ వణుకుతోంది. తాజాగా సోమవారం 79 కేసులు నమోదవ్వగా వీటిలో దాదాపు మూడోవంతు కేసులు జియాగూడ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇక్కడ నిన్నటి వరకు నమోదైన కేసులు 68 కాగా కేవలం సోమవారం నమోదైనవే 25. దీంతో కుల్సుంపుర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో హైఅలెర్ట్‌ ప్రకటించారు. దుర్గానగర్‌ ఓ వ్యక్తి (75) కరోనాతో మృతిచెందినట్లు కుల్సుంపురా సీఐ శంకర్‌, ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. తాజాగా నమోదు అయిన కేసుల్లో వెంకటేశ్వరనగర్‌లోని 3 కుటుంబాల్లో ఆరుగురు, శ్రీసాయినగర్‌లో ఒకే కుటుంబంలో అయిదుగురు, దుర్గానగర్‌లో 3 కుటుంబాల్లో 12 మంది, ఇందిరానగర్‌, సంజయ్‌నగర్‌ ఒక్కొక్కరు చొప్పున బాధితులున్నారు. సికింద్రాబాద్‌ ఎస్టీరోడ్డులోని ఓ డయాగ్నస్టిక్‌ సెంటర్‌లో పనిచేసే రిసెప్షనిస్టుకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమె తల్లి మలక్‌పేట్‌లోని గంజ్‌లో పనిచేస్తుండగా ఆమెకు పాజిటివ్‌ వచ్చింది. వెంటనే అధికారులు డయాగ్నస్టిక్‌ సెంటర్‌ను మూసివేసి మరో 12 మంది ఉద్యోగులను క్వారంటైన్‌కు తరలించారు. కుషాయిగూడలో సోమవారం మరో మహిళ కరోనా వైరస్‌ బారిన పడింది. ఆమెకు భర్త నుంచి సోకింది. అంబర్‌పేట చెన్నారెడ్డినగర్‌లో ఉంటున్న మరో మహిళ (50)కు కరోనా సోకింది.