* దేశంలో కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఈ నేపధ్యంలోనే చాలామంది భారతీయులు విదేశాల్లో చిక్కుకుపోయారు. ఇక వారిని సొంత ప్రాంతాలకు తీసుకు రావడానికి మోదీ సర్కార్ వందే భారత్ మిషన్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రెండో విడతలో ఆంధ్రప్రదేశ్‌కు విదేశాల నుంచి త్వరలోనే నాలుగు ప్రత్యేక విమానాలు రానున్నాయి. వీటి గురించి పూర్తీ వివరాలు తెలుసుకోవడానికి ప్రవాసాంధ్రులు ఆయా దేశాల ఇండియన్ ఎంబసీలను సంప్రదించాల్సి ఉంటుంది. ప్రత్యేక విమానాల లిస్టు – సౌదీఅరేబియా – విజయవాడ (20/05), ఖతర్ – విశాఖపట్నం(20/05), లండన్ – విజయవాడ(20/05), కువైట్ – తిరుపతి(21/05)
* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.గడిచిన 24 గంటల్లో నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో 48 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2137కి చేరింది.ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 948 మంది చికిత్స పొందుతున్నారు.ఇప్పటి వరకు కరోనా నుంచి 1142 మంది డిశ్చార్జి అయ్యారు.మృతుల సంఖ్య 47కి చేరింది.ఇవాళ నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 12 కేసులు ఉన్నాయి.గుంటూరు నుంచి కోయంబేడు మార్కెట్ కు వెళ్లిన వారికే కరోనా వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు.కోయంబేడు మార్కెట్‌కు వెళ్లిన 140 మందిని ఇప్పటికే గుర్తించారు.వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు.
* లాక్‌డౌన్ నేపథ్యంలో వలస కూలీలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. తమ స్వస్థలాలకు చేరుకునేందుకు వందల కిలోమీటర్లు రోజుల తరబడి కాలినడకతోనే చేరుకుంటున్నారు. తాజాగా కాలినడకన స్వస్థలానికి వెళ్లేందుకు ఓ నిండు గర్భిణిని తర భర్తతో కలిసి బయలుదేరింది. మహారాష్ట్ర నుంచి తమ స్వస్థలమైన మధ్యప్రదేశ్‌లోని సత్నాకు చేరుకునేందుకు కాలినడక ప్రారంభించారు. అయితే ఎక్కువ దూరం నడవడం వల్ల మార్గమధ్యంలోనే ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. దీంతో రోడ్డుపైనే సదరు మహిళా వలస కూలీ ప్రసవించింది. అక్కడే రెండు గంటల పాటు ఉండి.. అనంతరం తిరిగి మళ్లీ అప్పుడే పుట్టిన పాపతో మరో 150 కిలోమీటర్లు నడిచింది. సత్నా సరిహద్దులో వారిని గుర్తించిన అధికారులు వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం వలస కార్మికులను తరలించేందుకు శ్రామిక్ రైళ్లు నడుపుతున్నప్పటికీ వలస కార్మికులు ఎక్కేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
* పిడియాట్రిక్ మల్టీ-సిస్టం ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్… ఇదో రకమైన కొత్త రోగం. దీన్నే కవాసాకీ వ్యాధి లేదా టాక్సి షాక్ సిండ్రోమ్ అని కూడా పిలుస్తున్నారు. ఇది ఈమధ్య న్యూయార్క్ లోని పిల్లలకు వ్యాపిస్తోంది. ఈ పిల్లల్లో చాలా మంది కరోనా సోకి… కోలుకున్నవారే. దాదాపు 100 మంది పిల్లలకు ఈ రోగం వ్యాపించింది. ఇప్పటికే ఐదుగురు పిల్లలు ఈ సిండ్రోమ్‌తో చనిపోయారు. గురువారం తొలిసారిగా ఐదేళ్ల పిల్లాడు న్యూయార్క్‌లో చనిపోయాడు. ఆ చిన్నారి ఆల్రెడీ కరోనా సోకి రికవరీ అయ్యాడు. కొంత మంది పిల్లల్లో కరోనా సోకిన 6 వారాల తర్వాత ఈ కొత్త రోగం వ్యాపిస్తోందని తేలింది. పిల్లల్లో ఈ సిండ్రోమ్ లక్షణాలు కనిపిస్తే… వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని న్యూయార్క్ మేయర్… ప్రజలను కోరారు.
* రేషన్‌తో సంబంధం లేకుండా తెల్లకార్డు వారికి ₹1500 ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కొంతమంది తెల్లరేషన్ కార్డుదారులకు ₹1500 నిలిపేయటంపై హైకోర్టులో విచారణ జరిగింది. మూడు నెలలు రేషన్ తీసుకోలేదన్న కారణంగా ₹1500 ఇవ్వలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. ‘‘₹1500లు నిలిపివేసే ముందు లాక్‌డౌన్‌లో పేదల పరిస్థితి ఆలోచించాల్సింది. కనీసం నోటీసు ఇవ్వకుండా 8 లక్షల కార్డులు ఎలా రద్దు చేస్తారు’’ అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘‘తెల్లరేషన్ కార్డులను ప్రభుత్వం రద్దు చేయలేదు. ఎందుకు నిలిపివేశారో పూర్తి వివరాలు నివేదించేందుకు గడువు కావాలి’’ అని అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ కోరారు. దీంతో విచారణ జూన్ 2కి హైకోర్టు వాయిదా వేసింది.
* దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో కేసుల సంఖ్య 75వేలకు చేరువైంది. మరణాల సంఖ్య 2,415కి చేరింది. ఎక్కువగా కేసులు నమోదైన దేశాల్లో చైనాలో 11వ స్థానంలో ఉండగా.. భారత్ 12వ స్థానంలో ఉంది. రోజుకు 3వేలకు పైగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆ దేశాన్ని మనం దాటేసే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా నాలుగైదు రాష్ట్రాల్లోనే ఈ కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. అందులోనూ ఆయా రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల నుంచే ఈ కేసులు ఎక్కువగా నమోదవుతుండడం గమనార్హం. రాష్ట్రంలో తీవ్రంగా ప్రభావితమైన ఐదు రాష్ట్రాల పరిస్థితిని గమనించినప్పుడు ఈ పరిస్థితి అర్థమవుతుంది.