Sports

వీరిని వారనుకుని…

Rashi Lateef's Confusion Between Two Indian Openers

టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌, విధ్వంసక బ్యాట్స్‌మన్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ను చూసి ఓ సందర్భంలో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ అనుకున్నానని పాకిస్థాన్‌ మాజీ సారథి రషీద్‌ లతీఫ్‌ అన్నాడు. ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానెల్‌లో మాట్లాడిన లతీఫ్‌ ఈ విషయాన్ని వెల్లడించాడు. శ్రీలంక, టీమ్‌ఇండియా మధ్య జరిగిన ఓ మ్యాచ్‌లో సెహ్వాగ్‌ను చూసి సచిన్‌లా భ్రమపడినట్టు చెప్పాడు. ‘భారత్‌-శ్రీలంక ఆడుతున్న ఓ మ్యాచ్‌ను నేను టీవీలో వీక్షిస్తున్నా. ఆ మ్యాచ్‌లో సచిన్‌ లేడు. అప్పుడు సెహ్వాగ్‌ బ్యాటింగ్‌ చేస్తున్నాడు. అతడిని చూసి ‘‘ఎవరీ ఆటగాడు? అచ్చం లిటిల్‌మాస్టర్‌లా ఆడుతున్నాడు’ అని అనుకున్నా. సచిన్‌ లాగే ప్యాడ్లు, హెల్మెట్‌ ధరించాడు. ఇంకా చెప్పాలంటే సచిన్‌ కంటే బాగా ఆడుతున్నాడు’ అని లతీఫ్‌ నాటి సంగతుల్ని గుర్తుచేసుకున్నాడు. సెహ్వాగ్‌ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అని, అతని గురించి చెప్పడానికి గణంకాలు అవసరం లేదని పాక్‌ బ్యాట్స్‌మన్‌ చెప్పుకొచ్చాడు. ‘సెహ్వాగ్‌ మ్యాచ్‌ విన్నర్‌. ప్రత్యర్థి బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించేలా ఆడతాడు. మాలాంటి ఓపెనర్లు మొదట్లో పిచ్‌లు, ప్రత్యర్థి బౌలర్లను చూసి భయపడేవాళ్లం. కానీ సెహ్వాగ్‌ అలా కాదు. బౌలర్‌ ఎవరైనా అదరడు, బెదరడు. మెక్‌గ్రాత్‌, బ్రెట్‌లీ, వసీమ్‌ అక్రమ్‌, షోయబ్‌ అక్తర్‌.. వీళ్లెవరికీ భయపడేవాడు కాదు. అతనో ప్రభావవంతమైన ఆటగాడు. టీమ్‌ఇండియాలోనూ మంచి ఆదరణ సంపాదించుకున్నాడు. అతని లాంటి క్రికెటర్లు ప్రపంచ క్రికెట్‌లో రాణిస్తారు’ అని లతీఫ్‌ టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌ను కీర్తించాడు. డాషింగ్‌ ఓపెనర్‌కు ఆటమీద కచ్చితమైన నియంత్రణ ఉండేదని, అతని టెక్నిక్‌ కూడా అమోఘమని చెప్పాడు. అయితే, సెహ్వాగ్‌ ఫుట్‌వర్క్‌ పరిమితంగా ఉంటుందని, చాలా మంది దాన్ని విమర్శిస్తారని గుర్తుచేశాడు. కానీ, అదే అతనిని విజయవంతమైన క్రికెటర్‌గా తీర్చిదిద్దిందని పాక్‌ మాజీ సారథి వివరించారు. ఇటీవలి కాలంలో చాలా మంది కోచ్‌లు కూడా తమ బ్యాట్స్‌మెన్‌ను తక్కువ ఫుట్‌వర్క్‌తో ఆడాలని సూచిస్తున్నట్లు చెప్పాడు. కాగా, సెహ్వాగ్‌ మిడిల్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా జట్టులో చేరి గంగూలీ సారథ్యంలో అటు టెస్టుల్లోనూ, ఇటు వన్డేల్లోనూ ఓపెనర్‌గా మారి.. విజయవంతమైన బ్యాట్స్‌మన్‌గా ప్రత్యేక గుర్తింపు సాధించాడు.