##################
రాడికల్ డెమోక్రటిక్ పార్టీ స్థాపించిన ఎమ్.ఎన్.రాయ్
1940 నాటికి భారత దేశంలో రెండవ ప్రపంచ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. జర్మనీ, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్ ఒక కూటమిగాను – బ్రిటీషు వారు, వారి మిత్ర పక్షాలు మరొక కూటమిగా పోరాట రంగంలోకి దిగాయి. భారత దేశంలో బ్రిటీషు వ్యతిరేకత బాగా వుండటం వలన కాంగ్రెస్ పార్టీ అదే అదను అని బ్రిటీషు వారిని వెళ్ళిపొమ్మని క్విట్ ఇండియా నినదించారు. సుభాస్ చంద్రబోసు (23.1.1897–18.8.1945) జైలు నుండి తప్పించుకుని రహస్యంగా కాబూలు మీదుగా, రష్యామీదుగా జర్మనీ చేరుకుని బ్రిటీషు వ్యతిరేక ప్రచారాన్ని రేడియో ప్రసంగాల ద్వారా చేశారు. ఆ నేపథ్యంలో కాంగ్రెసు నుండి బయటికి వచ్చిన ఎమ్.ఎన్.రాయ్ (21.3.1887 – 24.1.1954) ప్రపంచ పరిస్థితుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బ్రిటీషు వారు యుద్ధానంతరం ఎలాగూ వెళ్ళిపోతారని ఈలోగా తొందరపడి హిట్లర్ (20.4.1889 – 30.4.1945) ముఠాను సమర్ధించటం ప్రమాదకరమని హెచ్చరించారు. హిట్లరు గెలిస్తే మళ్ళీ కొన్నివందల సంవత్సరాలపాటు భారతదేశం జర్మనీ అజమాయిషీలో చిక్కుకుంటుందని కనుక తొందరపడరాదని హెచ్చరించాడు. ఆ నేపథ్యంలో ఎమ్.ఎన్.రాయ్ రాడికల్ డెమోక్రటిక్ పార్టీని పెట్టారు. భారతదేశంలో రాజకీయపార్టీలన్నీ ఇంగ్లీషు పేర్లు పెట్టుకోవటం గమనార్హం. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు రంగంలో వుండగా సోషలిస్టు పార్టీ తలెత్తింది. రాష్ట్రాల వారీగా కొన్ని పార్టీలు పుట్టుకొచ్చాయి. ఎమ్.ఎన్.రాయ్ పెట్టిన రాడికల్ డెమోక్రటిక్ పార్టీ ప్రతి రాష్ట్రంలోనూ మేథావులు, కొందరు ఉపాధ్యాయులను, అడ్వకేట్లను, డాక్టర్లను ఆకర్షించింది. రాయ్ తన మేథా సంపత్తిని వినియోగించి స్టడీ కాంపులు పెట్టి రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, ప్రణాళిక పాఠాలు చెప్పారు. ఆయనతోపాటు మరికొందరు మేథావులు సమర్థవంతంగా స్టడీ కాంపులు నిర్వహించారు. కలకత్తా, డెహ్రాడూన్, ముస్సోరి, స్టడీక్యాంపులు కొన్ని వందలమందిని ఆరితేరిన సుశిక్షితులుగా చేశాయి.
దేశంలో స్వాతంత్ర్యం రాగానే అమలుపరచవలసిన ఆర్థిక ప్రణాళికను, ఆమోదించవలసిన రాజ్యాంగాన్ని ముందుగానే సిద్ధం చేసుకోవాలని రాయ్ ప్రతిపాదించాడు. దీనికితగ్గట్లే నమూనా రాజ్యాంగాన్ని, ప్రణాళికను తయారు చేసి చర్చకు పెట్టారు. ఇది మిగిలిన పార్టీలకు ఆదర్శప్రాయమైంది. కాంగ్రెస్ వారు తరువాత బిర్లా ప్రణాళికను తయారు చేయించారు. రాయ్ నిర్వహించిన రాజకీయ అధ్యయన శిబిరాల సారాంశాన్ని పుస్తకాల రూపేణా వెలువరించారు. అందులో ఒకటి సైంటిఫిక్ పాలిటిక్స్ కాగా, రెండవది న్యూ ఓరియంటేషన్ గా బయటికి వచ్చాయి. ఫాసిజాన్ని, నాజీయిజాన్ని బాగా విడమరిచి దాని ప్రమాదాన్ని తేటతెల్లంగా రాయ్ పార్టీ వివరించింది. రాయ్ రాజకీయాలను వ్యతిరేకించిన కమ్యూనిస్టు పార్టీ ఎప్పటికప్పుడు వారిపై దాడులు చేస్తూ పోయారు. దీనివెనుక రష్యా వున్నది. జాతీయవాదం కాలదోషం పట్టిన విధానమని, ప్రజాస్వామిక విధానాలు, వికేంద్రీకరణ, ప్రజా హక్కులు అమలులోకి రావాలని రాయ్ సిద్ధాంతీకరించారు. రాడికల్ డెమోక్రటిక్ పార్టీలో చేరిన కొద్దిమంది మేథావులు మానవవాద సిద్ధాంతాలను ప్రజలలోకి తీసుకెళ్ళటానికి పత్రికలు పెట్టి వ్యాసాలు రాశారు. అనేక ప్రచురణలు ప్రాంతీయ భాషలలో తీసుకువచ్చారు. వి.బి.కర్నిక్ (1902-1985) జి.డి.పరేఖ్, వి.యం.తార్కుండే (3.7.1909 – 22.3.2004), ఆర్.ఎమ్.పాల్ (17.7.1927) మణిబెన్ కారా (1905-1979), కె.కె.సిన్హా, జి.ఆర్.దల్వి, నిసిమ్ ఎజికల్, ప్రేమనాథ్ బజాజ్, గౌరిబజాజ్ వంటి మేథావులు విస్తృతంగా రాడికల్ డెమోక్రటికి సిద్ధాంతాలను సమాజంలోకి తీసుకువచ్చారు.
ఈ పార్టీలో స్త్రీలు అతి తక్కువగా పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, ప్లీడర్లు ఎక్కువగా చేరారు. రాజకీయపార్టీల ఉధృత ప్రచారాన్ని ఈ పార్టీ అంతగా తట్టుకోలేకపోయింది. రాజకీయాలు శాస్త్రీయంగా వుండాలని పార్టీ నొక్కి చెప్పింది. వికేంద్రీకరణ అమలుపరచడంలో గ్రామస్థాయి నుండి కేంద్రం వరకూ పిరమిడ్ ఆకారంలో అధికారం వుండాలని పైకి పోయేకొద్దీ అధికారం తగ్గిపోవాలని విదేశీ వ్యవహారాలు, సైనిక విషయాలు తప్ప కేంద్రానికి అధికారాలు వుండరాదని చెప్పారు. స్వయం పరిపాలన ఎక్కువగా గ్రామస్థాయి నుండి అమలు జరగాలన్నారు. ఎన్నుకున్నవారిని తిరిగి వెనక్కు పిలిపించే అధికారం కూడా ఓటర్లకు వుండాలన్నారు. ఎలాంటి శాసనాలు చెయ్యాలో సూచించే అవకాశం కూడా కిందిస్థాయి పాలనా వ్యవస్థకుండాలన్నారు. వీటన్నిటికీ అనుగుణంగా నవ్య మానవవాద సూత్రాలను బాగా చర్చించి ప్రవేశపెట్టారు. అప్పటికి ఎ.బి.షా (1920-1981) శిబ్ నారాయణ్ రే (1921–2008), ఫిలిప్ శ్ప్రాట్ (26.9.1902 – 8.3.1971), సి.టి.దరు, ఆవుల సాంబశివరావు, ఆవుల గోపాలకృష్ణమూర్తిగారు వంటి వారు కీలక స్థానం వహించారు. ఈ రాజకీయ పాఠశాలలు చాలామందిని సుశిక్షితుల్ని చేయగా వారంతా తిరిగి తమ తమ ప్రాంతాలలో ప్రాంతీయ భాషలలో క్యాంపులు నిర్వహించారు.
వీరు రూపొందించిన 22 సూత్రాలు బాగా చర్చించి ప్రజలకందించారు. కమ్యూనిస్టు పార్టీ మాత్రం అడుగడుగునా వీరిని వ్యతిరేకిస్తూ పోయింది. వాదబలంలో ఈ పార్టీ ధాటికి చాలామంది తట్టుకోలేకపోయారు. కానీ, ప్రజలలో పార్టీ వ్యాపించలేదు. అంబేద్కర్ లాంటి వారు ఈ పార్టీ పట్ల సానుభూతిగా వుండేవారు. ఈ నేపథ్యంలో 1946లో పరిమిత ఓటర్లతో దేశంలో ఎన్నికలు జరిగాయి. ఆస్థిపన్ను చెల్లించేవారికి మాత్రమే ఓటు హక్కు వుండేది. మిగిలిన రాజకీయపార్టీల వలె రాడికల్ డెమోక్రటిక్ పార్టీ కూడా ఎన్నికలలో నిలిచింది. కానీ ప్రజలు ఈ పార్టీని నిరాకరించారు. అభ్యర్థులు ఎక్కడా గెలవలేదు. అంతటితో పార్టీని కొనసాగించాలా లేదా అనే చర్చవచ్చింది. ఎమ్.ఎన్.రాయ్ చర్చల అనంతరం పార్టీని రద్దు చేసుకుని ఉద్యమం కొనసాగించాలని ప్రతిపాదించారు. కొందరు ఈ విషయాన్ని వ్యతిరేకించినా చివరకు పార్టీ రద్దు చేయటాన్నే ఆమోదించారు.
ఆంధ్రప్రదేశ్ లో రాడికల్ డెమోక్రటిక్ పార్టీ శాఖ ఏర్పడి చురుకుగా పనిచేసింది. ప్రతిరాష్ట్రంలోనూ ఇలాంటి సంఘాలు ఏర్పాటు చేశారు. మచ్చుకు ఆంధ్రప్రదేశ్ వివరాలు ఇక్కడ పేర్కొంటున్నాము. పార్టీ పెట్టిన కొత్తలో రాష్ట్రానికి కార్యనిర్వాహకుడుగా అబ్బూరి రామకృష్ణారావు (21.12.1931-28.10.2011) ను నియమించారు. ఆయనకు తాతా దేవకీనందన్, ములుకుట్ల వేంకట శాస్త్రి, పెమ్మరాజు వెంకటరావు తోడ్పడ్డారు. తరువాత రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా సుప్రసిద్ధ రచయిత, విమర్శకుడు, సినీదర్శకుడు, త్రిపురనేని గోపీచంద్ (8.9.1910 – 2.11.1962) ను నియమించారు. ఆయన త్రిపురనేని రామస్వామి (15.1.1887 – 16.1.1943) కుమారుడు తండ్రి దగ్గర నాస్తిక భావాలు విమర్శనాత్మక ధోరణులు పుణికిపుచ్చుకున్నారు. సంస్కరణాయుత సినిమాలు తీయడంలో గూడవల్లి రామబ్రహ్మంగారికి తోడ్పడ్డారు. నాస్తికత్వం నుండి మానవవాదానికి పరిణమించిన వ్యక్తి. అలాంటి వారిని రాష్ట్ర కార్యదర్శిగా నియమించటం వలన కొత్తగా ఏర్పడిన పార్టీకి మంచి బలం చేకూరింది. కార్యదర్శిగా గోపీచంద్ రాష్ట్రంలో పర్యటించి స్టడీ క్యాంపులలో ఉపన్యాసాలిచ్చి విమర్శనాత్మక రచనలు వెలువరించారు. కమ్యూనిస్టులను, సోషలిస్టులను, కాంగ్రెసు వారిని సిద్ధాంతపరంగా దుయ్యబట్టి ఆకర్షణీయమైన రచనలు చేశారు. పట్టాభి సోషలిజం, భార్యల్లో ఏముంది? మొదలైన రచనలు జనాన్ని ఆకట్టుకున్నాయి. ఆయన తరువాత గుత్తికొండ నరహరి రాష్ట్ర కార్యదర్శి అయ్యాడు. ఆయన మంచి ఉపన్యాసకులు. బహిరంగ సభలలో కమ్యూనిస్టులను, కాంగ్రెసు వారిని ఎదుర్కోవటంలో సాటిలేని వ్యక్తిగా పేరొందారు. తెనాలి, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం కేంద్రాలు రాడికల్ హ్యూమనిస్టులతో మేథావులను రచయితలను యువకులను ఆకర్షించింది. భట్టిప్రోలు హనుమంతరావు చరిత్ర అధ్యాపకులుగా పరిశోధనాత్మక రచనలు చేస్తూ రాయ్ జీవితాన్ని తెలుగులోకి అనువదించారు. కోగంటి రాధాకృష్ణమూర్తి ప్రచురణ సంస్థ నెలకొల్పి రాయ్ రచనలతో పాటు అనేక పుస్తకాలను ప్రజలకు అందించగలిగారు. ఆవుల గోపాలకృష్ణమూర్తి ఉపన్యాసకుడుగా విమర్శకులుగా సిద్ధాంత భాష్యకారుడుగా తెనాలి నుండి విశేషంగా కృషి చేశారు. అనేక అధ్యయన శిబిరాలు నిర్వహించారు. ఉపాధ్యాయులు, అడ్వకేట్సు, ఆయనకు బాగా సహకరించారు. కోగంటి సుబ్రహ్మణ్యం రాడికల్ హ్యూమనిస్టు పత్రికను చాలాకాలం నడిపారు. జాస్తి జగన్నాధం రాయ్ రచనలు కొన్నిటిని పత్రికల ద్వారా తెలుగులోకి అనువదించారు. డి.వి.నరసరాజు (15.7.1920 – 28.7.2006) వ్యంగ్య హాస్య విమర్శకులుగా రాడికల్ సిద్ధాంతాలను అందించాడు. పావులూరి కృష్ణ చౌదరి విద్యార్థుల నిమిత్తం పత్రిక పెట్టి వ్రాతప్రతిగా ఆకర్షణీయమైన శీర్షికను తెలుగులోకి తెచ్చారు. ఎలవర్తి రోశయ్యగారు ఉపాధ్యాయులుగా కొన్నివందలమందిని సుశిక్షితులను చేసి రాడికల్ సిద్ధాంతాలను వ్యాపింప చేయటంలో తోడ్పడ్డారు. ఎమ్.ఎన్.రాయ్ వలన తొలుత ప్రభావితులైనవారిలో సుప్రసిద్ధ రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి, అబ్బూరి వరదరాజేశ్వరరావు, అత్తలూరి నరసింహారావు, పి.హెచ్. గుప్త, పువ్వాడ నాగేశ్వరరావు, కొసరాజు సాంబశివరావు, కొల్లి శివరామిరెడ్డి వున్నారు. మరొకవైపు త్రిపురనేని రామస్వామి శిష్యరికం నుండి రాయ్ సిద్ధాంతాలకు పయనించిన రావిపూడి వెంకటాద్రి, (1922) ఎన్.వి.బ్రహ్మం వందలాది కార్యకర్తలను ట్యుటోరియల్ పాఠశాలల ద్వారా సమాజంలోకి తీసుకువచ్చారు. మల్లాది రామమూర్తి నిరంతర కృషితో పార్టీ సిద్ధాంతాలను ఆచరణను అమలులోకి తేవటంలో కృషి చేశారు. కథలు, సెక్స్ విద్య, సినిమా విమర్శలు, వివిధ పత్రికల ద్వారా ప్రవేశపెట్టి, రాడికల్ ఆలోచనలను ఆలపాటి రవీంద్రనాథ్ అందించారు. పెదనందిపాడు కేంద్రంగా లావు అమ్మయ్య, సీతారామయ్య అనేక స్టడీ క్యాంపులు పెట్టి నిరంతర కృషి చేశారు. ఆలూరి భుజంగరావు, సుప్రసిద్ధ కవి బైరాగి త్రిపురనేని గోపీచంద్, పరుచూరి అచ్యుతరామయ్య, కొల్లి శివరామిరెడ్డి, ఎమ్.వి. రమణయ్య క్షేత్ర రంగంలో నిలదొక్కుకుని కృషి జరిపారు.
కల్లూరి బసవేశ్వరరావు విద్యారంగంలో శాస్త్రీయ విధానాలు అమలుపరచటానికి తోడ్పడ్డారు. ఆలపాటి రవీంద్రనాథ్ కథారంగంలోనూ, సినిమారంగంలోనూ, విమర్శకులకు కొత్తదారి చూపారు. అనేకమంది రచయితలను కూడా ఆకర్షించారు. రాష్ట్రంలో వీరందరి సంఖ్య తక్కువే అయినా వారి కృషి వలన ఆకర్షణ పెరిగింది. కానీ, ఎన్నికలలో కాంగ్రెస్ ధాటికి వీరు నిలవలేకపోయారు. 1946లో దేశంలో ఎన్నికలు జరిగాయి. అప్పట్లో ఆస్తిపన్ను కట్టేవారికే ఓటుహక్కు వుండేది. అంటే చాలా పరిమతమైన ఓట్లు మాత్రమే వుండేవి. ఆ ఎన్నికలలో రాడికల్ డెమోక్రటిక్ పార్టీ ఎక్కడా గెలవలేదు. రాష్ట్రంలో బండారు వందనం రావిపూడి వెంకటాద్రి కోగంటి రాధాకృష్ణమూర్తి వంటివారు పోటీ చేసి ఓట్లు తెచ్చుకోలేకపోయారు. ఇదే పరిస్థితి దేశవ్యాప్తంగాను జరిగింది. ఆ ఎన్నికలు పార్టీకి పెద్ద గుణపాఠం నేర్పినట్లయింది.
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన తీరులోనే దేశవ్యాప్తంగా రాడికల్ డెమోక్రటిక్ పార్టీ గెలవలేదు. మేథావులు మాత్రం సిద్ధాంతకారులుగా మిగిలిపోయి రాయ్ తోపాటు ప్రచారాలు కొనసాగించారు. 8 సంవత్సరాల పార్టీ స్వాతంత్ర్యం వచ్చేనాటికి రద్దు చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.
##################
నవ్యమానవవాద పార్టీ రద్దు
రాడికల్ డెమోక్రటిక్ పార్టీగా 1940లో పుట్టిన రాజకీయపార్టీ, 1948లో రద్దయింది. 8 ఏళ్లలో భారత రాజకీయాలలో పేర్కొనదగిన ప్రభావం చూపినా, ప్రజలలో గుర్తింపు రాలేదు. 1946లో వచ్చిన పరిమిత ఓటర్ల ఎన్నికలో తీవ్ర పరాజయం చూచింది. డిపాజిట్లు పోయాయి. మేథావులు, ఉపాధ్యాయులు, ప్లీడర్లు కొందరు గుర్తించినా, ప్రభావితులైనా సామాన్య ప్రజలలో పార్టీ చొచ్చుక పోలేదు. జాతీయవాదం తీవ్రస్థాయిలో సాగుతున్న రోజులలో గాంధీ – నెహ్రూ, పటేల్ నాయకత్వ ప్రభావంలో దేశం సాగింది. అంతర్జాతీయ మద్దతు వున్న కమ్యూనిస్టు పార్టీ నిలవలేక పోయింది. దేశ యువతను ఆకట్టుకొన్న సుభాస్ చంద్రబోస్ పార్టీ – ఫార్వర్డ్ బ్లాక్ – సైతం తట్టుకోలేక పోయింది.
1946లో జరిగిన పరిమిత ఓటర్ల ఎన్నిక ప్రజల మనోభావాల్ని చూపగా, రాడికల్ డెమోక్రటిక్ పార్టీకి స్థానం లేదనేది స్పష్టపడింది. అది గ్రహించిన ఎం.ఎన్.రాయ్ మార్గాంతరంగా పార్టీని రద్దు చేయాలన్నాడు. అప్పటికే 22 సూత్రాలతో ప్రజల్ని విద్యావంతుల్ని చేసే తత్వాన్ని చర్చించారు. పార్టీ రాజకీయాలు గాక, ప్రజలకు విద్య చెప్పే తత్వం, ఆర్థికం, విద్య కావాలని సూత్రీకరించు. 22 సూత్రాలు పొందుపరచి, వాటికి విస్తృతపరచారు. ఆ చర్చలలో మేథావులు, ఉపాధ్యాయులు, ప్లీడర్లు పాల్గొన్నారు. తాత్విక అంశాలు ఔపోశన పట్టారు. రాడికల్ సూత్రాలు రాజకీయ పార్టీకి సరిపడవని తేల్చారు.
పార్టీని రద్దు చేయడానికి కొందరు వ్యతిరేకించారు. ఫిలిప్ శ్ర్పాట్ వంటి మేథావులు పార్టీని రద్దు చేయరాదన్నారు. కానీ వారందరికీ నచ్చజెప్పి, ఎం.ఎన్.రాయ్ పార్టీని రద్దు చేశారు.
1948లో రాడికల్ డెమోక్రటిక్ పార్టీ అధికారికంగా రద్దు అయింది. ఆ స్థానంలో నవ్యమానవ ఉద్యమం సాగించాలని భావించారు. 22 సూత్రాలను బాగా చర్చించి, విపులీకరించారు.
డెహ్రాడూన్ కేంద్రంగా పునర్వికాస కేంద్రం నడిపించాలని భావించారు. 13, మోహినీ రోడ్, రాయ్ దంపతుల నివాసం కాగా అక్కడ నుండి ఉద్యమ కేంద్రం నడపాలన్నారు. అయిష్టంగా వున్నవారు మౌనం వహించారు. క్రమంగా అలాంటి వారు రాజకీయాలకు దూరం అయ్యారు. మరికొందరు కొంత సమయం తరువాత వేరే పార్టీలలో చేరారు. వారిసంఖ్య బహుస్వల్పం. ఆంధ్రలో పెమ్మరాజు వెంకటరావు వంటి వారు కాంగ్రెస్ లో చేరారు.
రాడికల్ హ్యూమనిస్ట్ ఉద్యమానికి ప్రధాన అంగాలుగా పత్రికలు, పుస్తకాలు నిలిచాయి. అధ్యయన తరగతులు బాగా ఉపకరించాయి. ‘మార్క్సియన్ వే’ అనే పరిశోధనా పత్రికను ‘హ్యూమనిస్ట్ వే’ అని మార్చారు. వ్యాస పరంపర అందించడానికి రాడికల్ హ్యూమనిస్ట్ వారపత్రిక బాగా పనిచేసింది. పరిశోధనల్ని చిన్న ప్రచురణలుగా వెలువరించారు. ప్రాంతీయ పత్రికలు కూడా వెలువడ్డాయి. ఏమైనా పార్టీ వున్నప్పటి ఉత్సాహం చాలామందిలో లేదు. ఎమ్.ఎన్.రాయ్, ఎలెన్ రాయ్ లు దేశంలో పర్యటించి ఉద్యమస్ఫూర్తి కొనసాగించారు.
ఉద్యమానికి చేయూతనివ్వటంలో కొత్తగా చేరిన శిబ్ నారాయణ్ రే ఎంతో తోడ్పడ్డారు. ఎ.బి.షా, దయాకృష్ణ, ఆవుల గోపాలకృష్ణమూర్తి, జి.డి.పరేఖ్, వి.ఎమ్.తార్కుండే, వి.బి.కర్నిక్, జయంతి పటేల్ ప్రభృతులు రచనా వ్యాసంగంలోను, సభలు నిర్వహించటంలోను, పత్రికలు కొనసాగించటంలోను, అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూనే స్ఫూర్తినిస్తూ పోయారు. ఎమ్.ఎన్.రాయ్ చేసిన ఉపన్యాసాలను ఆయన భార్య ఎలెన్ షార్ట్ హాండ్ లో రాసుకుని తరువాత గ్రంథ రూపేణా తీసుకొచ్చారు. ఆ విధంగా ఉద్యమానికి పుష్కలంగా సాహిత్యం అందింది. వివిధ రాష్ట్రాలలో వీటిని ఆయా భాషలలోకి అనువదిస్తూ పోయారు. లక్ష్మన్ శాస్త్రీ జోషి వంటి పండితులు ఒకప్పుడు గాంధీకి సలహాదారుగా వుంటూ తరువాత రాయ్ కి సన్నిహితుడై హిందూఇజాన్ని నిశిత పరిశీలనకు గురి చేశాడు. బెంగాల్ నుండి సుశీల్ ముఖర్జీ ప్రచురణలు ప్రారంభించారు. ఢిల్లీలో సి.ఆర్.ఎమ్. రావు చైనాపై ప్రత్యేక అధ్యయనం కొనసాగించారు. ఇది కాక ప్రాంతీయ పత్రికలు ప్రచురణలు విరివిగా వెలువడ్డాయి. మీరట్ నుండి ఆర్. ఎస్. యాదవ్ మాసపత్రిక నడిపారు. ఆర్.ఎమ్.పాల్ ఢిల్లీలో కళాశాల ప్రిన్సిపాల్ గా వుంటూనే రాయ్ ఆరోగ్య సపర్యలు చేస్తూ పోయారు. బొంబాయిలో జె.బి.హెచ్. వాడియా రాయ్ కు మద్దతుగా నిలిచారు. ఈ విధంగా పరిమితంగానైనా ఉద్యమానికి నాంది పలికారు.
##################
22 సూత్రాలతో నవ్యమానవ వాదం
8 సంవత్సరాలపాటు భారత రాజకీయాలలో సిసింద్రీవలె ఉవ్వెత్తున అటు సిద్ధాంతపరంగానూ, ఇటు రాజకీయ ఆచరణలోనూ రాడికల్ డెమోక్రటిక్ పార్టీని ఎనిమిదేళ్ళ ప్రాయంలోనే రద్దు చేసుకున్నారు. భారత ఓటర్లు నిరాకరించినందువలన అలాంటి నిర్ణయానికి వచ్చారు. ఏమైనాసరే పార్టీని కొనసాగించాలనేవారు పక్కకు తప్పుకున్నారు. ప్రజలకు సిద్ధాంతపరంగా, ఆచరణలోను కొత్తరీతులు పాఠాలుగా చెప్పాలనే దృష్టితో ఉద్యమాన్ని కొనసాగించాలనుకున్నారు. అప్పుడే ఉద్యమంలో ప్రవేశించిన శిబ్ నారాయణ్ రే కూడా కొత్తవారికి ప్రోత్సాహాన్నిచ్చాడు. అమృతలాల్ భిక్కు షా శాస్త్రీయపద్ధతిలో పురోగమించటానికి పాఠాలు చెప్పాడు. పార్టీలో ఆరితేరిన విమద్ లాల్ తార్కుండే, గోవింద్ పరేఖ్ వంటి మేథావులు ఉద్యమంలో కొనసాగటానికి ఉద్యుక్తులయ్యారు. ఎమ్.ఎన్.రాయ్ సారధ్యంలో డెహ్రాడూన్ లో రాజకీయ పాఠశాలలు మొదలై దేశంలో అనేకచోట్ల పాఠశాలలలో వైజ్ఞానికంగా అధునాతన విద్యను కొనసాగించారు.
ఈ సూత్రాలను 1946 లో బొంబాయిలో జరిగిన రాడికల్ డెమోక్రాటిక్ పార్టీ మహాసభ చర్చించి ఆమోదించింది. వాటికి మెరుగులు దిద్ది ఎప్పటికప్పుడు వస్తున్న సైంటిఫిక్ పరిశోధనలను దృష్టిలో పెట్టుకుని చర్చిస్తూ పోయారు. 1955 లో ఎమ్.ఎన్.రాయ్ డెహ్రాడూన్ లో చనిపోయారు. ఆ తరువాత ఆయన భార్య ఎలెన్ రాయ్ బాధ్యతలను స్వీకరించి పత్రికలు, ప్రచురణలు, రాజకీయ పాఠశాలలు కొనసాగించడానికి త్వరపడ్డారు. 1960లో ఆమె హంతకుల చేతిలో హతమైన తరువాత మిగిలిన అనుచరులు ఈ బాధ్యతల్ని కొనసాగించారు.
22 సూత్రాలు
మానవుడు సమాజానికి నమూనా (Archtype). సహకార సామాజిక సంబంధాలు వ్యక్తిలోని అంతర్గత శక్తుల వికాసానికి దోహదం చేస్తాయి. వ్యక్తి వికాసమే సమాజ ప్రగతికి ప్రమాణం. సమాజ ఉనికికి వ్యక్తులే ఆధారం. వ్యక్తులు యధార్థంగా అనుభవించే స్వాతంత్య్రమూ, సుఖజీవనాలు మాత్రమే కొలమానం. సమాజ స్వేచ్ఛ, ప్రగతీ కేవలం ఊహాకల్పితాలు, అసాధ్యాలు. వ్యక్తుల అనుభవంలోనికి వచ్చినదే యదార్థమైన సుఖజీవనం. జాతి, వర్గం పేర్లతో మానవ సమాజానికి సమిష్టిభావం కల్పించటం తప్పు. ఆ విధంగా చేయటం వ్యక్తిని సమిష్టిభావానికి బలియడము. వ్యక్తుల సుఖజీవనమే సమిష్టి సుఖజీవనం.
స్వేచ్ఛాపిపాస, సత్యాన్వేషణలు మానవాభ్యున్నతికి ప్రధాన ప్రేరకాలు. స్వేచ్ఛాపిపాస అనేది, శారీరకమైన జీవితపోరాటాన్ని మానవుడు తన బుద్ధిబలంతో, ఉద్వేగంతో, ఉన్నతస్థాయిలో సాగించటమే. స్వేచ్ఛాపిపాసకు ప్రతిచ్ఛాయనే సత్యాన్వేషణ అంటే ప్రకృతిని గురించి క్రమంగా తెలుసుకునే పరిజ్ఞానం వలన ప్రకృతిశక్తుల నుండి ప్రగతి సాధించుటలో మానవునకు ఉపకరించే జ్ఞానాన్ని సత్యం అంటాము.
వ్యక్తిగతంగాకానీ, సమిష్టిగాగానీ జరిగే హేతుబద్ధమైన ప్రయత్నానికి లక్ష్యం ఏమంటే స్వేచ్ఛను సాధించటమే. స్వేచ్ఛ క్షణక్షణం వికాసం చెందుతుంది. సమాజంలోని భాగంగా మాత్రమేకాక మానవులుగా వారి శక్తులు పరిపూర్ణ వికాసం పొందటానికిగల ఆటంకాలను క్రమక్రమంగా తొలగించటమే స్వేచ్ఛ. సమిష్టికృషిగానీ, వ్యవస్థ కృషిగానీ ఎంతవరకు ప్రగతిశీలమూ ఎంతవరకు స్వేచ్ఛాదాయకమూ అని నిర్ణయించటానికి ఆ సమాజంలోని వ్యక్తుల ఉనికియే సాధనం. సమిష్టికృషి యొక్క విజయాన్ని అందరి వ్యక్తుల ప్రయోజనాన్ని బట్టి నిర్ణయించాలి.
మానవులు, నియమబద్ధమైన ప్రకృతినుండి వచ్చారు. అందుచే వారు ప్రాయికంగా హేతువాదులు. హేతుధోరణి మానవ లక్షణం. కాబట్టి ఇచ్ఛకు (will) అది విరుద్ధం కాదు. బుద్ధికుశలత, ఉద్వేగమూ (Emotion) సామాన్య మానవ లక్షణాలుగా నిరూపించవచ్చు. కాబట్టి చారిత్రక నియతివాదం సంకల్పబలానికిగల స్వేచ్ఛను కాదనలేదు. వాస్తవానికి, మానవసంకల్పమే బలీయమైన నిర్ణయకశక్తి, అలా కానిచో చరిత్రగతిలో హేతుబద్ధంగా జరిగిన విప్లవాలకు ఆస్కారం వుండేదికాదు. హేతుబద్ధమూ, శాస్త్రీయమూ ఐన ఈ నియతివాదం ప్రకృతి ప్రయోజన సిద్ధాంతమని (Teleological) గానీ, మతవాదుల కర్మసిద్ధాంతమనిగానీ భ్రమపడకూడదు.
భౌతికవాదాన్ని పొరపాటుగా అర్థం చేసుకొనటం వల్లనే చరిత్రను ఆర్థికశాస్త్రపరంగా నిర్వచించారు.
ఆర్థికశాస్త్ర నిర్వచనంలో ద్వైతభావం (dualism) యేర్పడింది. భౌతికవాదం, అద్వైతాన్ని (monism) ప్రతిపాదించే సిద్ధాంతం. చరిత్రగమనం నియమితమైనది, కాని ఈ గమనానికి గల కారణాలు అనేకం. అందులో మానవ సంకల్పబలం ఒకటి. మానవ సంకల్పబలానికి కేవలం ఆర్థిక అవసరాలే కారణం అని చెప్పలేము.
భావోత్పత్తి శరీరధర్మాలలో ఒకటి, పరిసరాల అనుభూతివల్ల భావోత్పత్తి జరుగుతుంది. ఒకమారు ఉన్నతమైన భావాలు అంతర్గత సూత్రబద్ధాలై వుంటాయి. సమాజ పరిణామమూ, భావగమనమూ పరస్పర ప్రభావానికి లోనవుతూ, సమాంతరంగా పురోగమిస్తాయి. ఐతే, మానవ పరిణామంలోని ఏదశలోనూ ప్రత్యేకించి చారిత్రక సంఘటనలకూ, భావఉద్యమాలకూ సూటియైన సంబంధాలను నెలకొల్పజాలము. సాంస్కృతిక రీతులూ, నైతిక విలువలూ కేవలం వ్యవస్థాపిత ఆర్థికసంబంధాల పునాదులపై ఏర్పడిన భావాలు కాదు. అవి కూడా నియమబద్ధమైనవే.
స్వేచ్ఛాయుత నవప్రపంచాన్ని సృష్టించాలంటే, సమాజ ఆర్థిక పునర్నిర్మాణస్థాయినిదాటి విప్లవం ముందుకుసాగాలి. ”పీడిత వర్గాల పేరుతో, రాజకీయాధికారాన్ని కైవసం చేసికొని, ఉత్పత్తి సాధనాల్లో, సొంతఆస్తిని రద్దుచేసినంత మాత్రాన స్వేచ్ఛ అవతరించి తీరుతుంది.” అనుకొనటం పొరబాటు.
స్వేచ్చ మాత్రమే లక్ష్యం, ఆ లక్ష్యసాధనకు కమ్యూనిజంగానీ, సోషలిజంగానీ ఎంతవరకు ప్రయోజనకారులు అనే విషయాన్ని అనుభవం ద్వారా నిర్ణయించాలి. జాతి, వర్గం అనే ఊహామాత్ర సమిష్టి సూత్రానికి మానవుని బలిచేసే రాజకీయ విధానంగానీ, ఆర్థిక ప్రయోగంగానీ స్వేచ్ఛకు అనుకూలసాధనం కాజాలదు. స్వేచ్ఛను నిరాకరించటం ద్వారా స్వేచ్ఛను సాధిస్తామనటం అసంబద్ధమైన విషయం. ఊహాకల్పితమైన సమిష్టి భావ పూజాపీఠంమీద వ్యక్తిని బలిచేయటం స్వేచ్ఛ కాజాలదు. వ్యక్తికిగల సర్వంసహాధికారాన్ని (soverengnty) గుర్తింపక స్వేచ్ఛను నిస్సారమైన భావనగా త్రోసివేసే సాంఘికసిద్ధాంతం వల్లగానీ, సమాజ పునర్నిర్మాణ ప్రణాళికవల్లగానీ కలిగే ఫలితాలు, విప్లవ ప్రాధాన్యతలు, ప్రగతి చాల సంకుచితంగా ఉంటుంది.
రాజ్యం అంటే సమాజ రాజకీయ నిర్మాణం. (State). రాజ్యం అదృశ్యమౌతుందనే కమ్యూనిస్టు సిద్ధాంతం కేవలం అపోహ అని అనుభవం వల్ల తేలిపోయింది. సమాజపరమైన పరిశ్రమలతో, ప్రణాళికాబద్ధమైన ఆర్థిక విధానానికి పటిష్టమైన రాజకీయ యంత్రాంగం అవసరం. ఆ యంత్రాంగం ప్రజాస్వామ్యం అదుపులోనున్నపుడే, నవసమాజంలో స్వేచ్ఛకు రక్షణ ఉంటుంది. రాజకీయ ప్రజాస్వామ్యమూ, వ్యక్తిస్వేచ్ఛా పునాదులైనప్పుడే ఉత్పత్తి వినియోగం కొరకు వుంటుంది.
ప్రభుత్వ (State) యాజమాన్యంగానీ, ప్రణాళికాబద్ధ ఆర్థిక విధానంగానీ శ్రామికుల దోపిడీని ఆపవు. సంపదను సమంగా పంపిణీ చేయనూలేవు. ఆర్థిక ప్రజాస్వామ్యం లేకుంటే రాజకీయ ప్రజాస్వామ్యం అసంభవం రాజకీయ ప్రజాస్వామ్యంలేని ఆర్థికప్రజాస్వామ్యం అసంభవం.
నియంతృత్వం చిరస్థాయిగా ఉండటానికే ప్రయత్నిస్తుంది. సామర్థ్యమూ, సమిష్టికృషీ, సమాజ ప్రగతీ అనే సాకులతో, రాజకీయ నియంతృత్వంలో అమలుజరిగే ప్రణాళికావిధానం వ్యక్తిస్వేచ్ఛను నిర్లక్ష్యం చేస్తుంది. అందుచే సోషలిస్టు సమాజంలో, ప్రస్తుతం భావింపబడుతున్న ఉన్నతస్థాయి ప్రజాస్వామ్యం అసంభవమౌతుంది. నియంతృత్వం తన లక్ష్యాన్ని తానే నిరోధిస్తుంది.
అనుభవంలో లాంఛనప్రాయ ప్రజాస్వామ్యంలోని లోపాలు బయటపడ్డాయి. అధికారం దత్తం (delegate) చేసే పద్ధతే ఆ లోపాలకు కారణం. ప్రజాస్వామ్యం సమర్థంగా ఉండాలంటే సర్వధా అధికారం ప్రజలపరంగానే ఉండాలి. తమ సర్వంసహాధికారాన్ని పటుతరంగా వినియోగించుకొనటానికి, ఎప్పుడోగాక నిత్యమూ అధికారాన్ని చలాయించుకొనే సదుపాయాలను ప్రజలు ఏర్పరచుకోవాలి. అణువణువులుగా విడిపడియున్న పౌరులు కార్యాచరణలో శక్తిహీనులౌతున్నారు. తమ సర్వంసహాధికారాన్ని వినియోగించటానికీ, ప్రభుత్వయంత్రాంగంపై స్థిరమైన అజమాయిషీ చలాయించటానికి వారికి సాధనాలులేవు.
లాంఛనప్రాయ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉదారవాదం విపరీత వ్యాఖ్యానాలకు లోనై (liberalism) నగుబాట్లపాలైంది. స్వేచ్ఛావాణిజ్యసూత్రం (laisses faire) మనిషిని మనిషి దోచుకొనటానికి చట్టబద్ధమైన అవకాశం కల్పించింది. వ్యక్తివాదం (individualism) స్వేచ్ఛాదాయకమైనదే, కాని ‘డబ్బుమనిషి’ (economic man) అనే భావం ఆ గుణాన్ని పరిహసిస్తున్నది. డబ్బుమనిషి బానిసైనా ఔతాడు. బానిస యజమానియైనా ఔతాడు. మానవుని గురించిన ఈ నీచభావానికి స్వస్తిచెప్పి యదార్థమైనభావాన్ని అంటే హేతుత్వం మానవుని సహజలక్షణమని, హేతుశీలి కావటంచే అతడు నీతిపరుడు అనే భావాన్ని స్థాపించాలి. నీతి అనేది మనస్సు (conscience)కు చేసే విజ్ఞాపన, ఇక, మనస్సు అనేది అప్రయత్నంగా పరిసరాలను గుర్తించి తదనుగుణంగా వ్యవహరించే శక్తియే. కాబట్టి నీతి మానసికస్థాయిలో జరిగే యాంత్రికమైన జీవప్రవృత్తి, అందుచే అది హేతుబద్ధము.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి నియంతృత్వం ప్రత్యామ్నాయం కాదు, నిర్మాణాత్మక ప్రజాస్వామ్యమే ప్రత్యామ్నాయం. అట్టి నిర్మాణాత్మక ప్రజాస్వామ్యం ఒక పిరమిడ్ స్థాయిలో ఉంటుంది. దేశవ్యాప్తంగా నిర్మింపబడిన ప్రజాసంఘాలే దానికి పునాది. శిఖరం పార్లమెంటు ఇతరస్థాయిలో ఉంటుంది. ఈ విధానంలో సమాజరాజకీయ నిర్మాణము సమాజంతో మిళితమవుతుంది. తత్ఫలితంగా రాజ్యం శాశ్వతంగా ప్రజాస్వామికపు అదుపులో ఉంటుంది.
మానవుడు ఆలోచనాపరుడు, వ్యక్తిగా మాత్రమే ఆలోచన చేయగలడు. ఆలోచనాపరుడైన మానవుడు తన ప్రపంచానికి తానే కర్త. ఇదే చరిత్రకు ప్రాతిపదిక. ఈ సూత్రాన్ని బలపరచటమే, విప్లవాత్మకమైన స్వేచ్ఛాదాయకమైన సిద్ధాంతాలకు కర్తవ్యం. మేథస్సు ఒక ఉత్పత్తిసాధనం. అది ఉత్పత్తిచేసే పదార్థం చాల విప్లవాత్మకం. పాతను నిర్మూలింపగల భావాలు విప్లవానికి చాల అవసరం. తమ సృజనా సామర్థ్యాన్ని గుర్తించి, ప్రపంచాన్ని మళ్ళీ నిర్మించాలనే దృఢసంకల్పం కలిగి, భావప్రగతిచే ఉత్సాహవంతులై ‘స్వేచ్ఛామానవులతో స్వేచ్ఛాసమాజం’ అనే ఆదర్శం గల మానవుల సంఖ్య ఇతోధికంగా పెరిగినకొలదీ ప్రజాస్వామ్యానికి అనుకూల శక్తులు ఏర్పడతాయి.
సామాజిక అభ్యుదయంలోని మూలసూత్రాన్ని పునరుద్ఘాటించటం మీదనే సాంఘిక విప్లవ విధానమూ, కార్యక్రమమూ ఆధారపడాలి. స్వేచ్ఛాసూత్రాలను గురించీ, హేతుబద్ధమైన సహకారవిధానాన్ని గురించీ ప్రజలకు చైతన్యం కలిగించే నిరంతరకృషి ద్వారా సాంఘిక పునరుజ్జీవనం సాధ్యమౌతుంది. అప్పుడు ప్రజలు పటిష్టమైన ప్రజాసంఘాలుగా సమీకృతులై, విప్లవానంతర వ్యవస్థకు సాంఘిక, రాజకీయ పునాదులు నిర్మింపగలుగుతారు. చైతన్యవంతులైన వ్యక్తులసంఖ్య పెరుగుతూ, ప్రజాసంఘాలు విస్తృతం కావటం సాంఘికవిప్లవానికి చాలముఖ్యం. అదేవిధంగా, స్వేచ్ఛ, హేతుత్వం, సాంఘిక సామరస్యం అనే సూత్రాలమీదనే విప్లవకార్యక్రమం ఆధారపడాలి. తత్ఫలితంగా సామాజిక జీవిత విధానంలో అన్నిరకాల గుత్తపద్ధతులు, స్వార్థశ్రేయస్సులు తొలగిపోతాయి.
మానవుణ్ణి మానవుడు దోచుకునే అవకాశం తొలగిపోయే విధంగా సమాజ ఆర్థికవిధానాన్ని పునర్మించటమే సమూల ప్రజాస్వామ్యానికి ప్రథమ నిబంధన. సమాజంలో సభ్యులైన వ్యక్తుల వైజ్ఞానిక కళాత్మక మానవశక్తులు వికసించటానికి వారి భౌతిక అవసరాలు అభివృద్ధికరంగా తృప్తిపొందాలి. జీవనప్రమాణంలో క్రమాభివృద్ధికి హామీ ఇవ్వగల ఆర్థిక పునర్నిర్మాణమే సమూల ప్రజాస్వామ్యానికి పునాది. స్వేచ్ఛ అనే గమ్యంవైపు పురోగమించటానికి ఆర్థికంగా విముక్తిపొందటం అవసరం.
నవసమాజ ఆర్థికవిధానం రెండుసూత్రాలపై ఆధారపడి వుంటుంది. వినియోగం కొరకే వుత్పత్తి, మానవ అవసరాల ననుసరించి పంపిణీ. ఇక, నవసమాజ, రాజకీయవ్యవస్థ, ఆచరణలో వాస్తవాధికారం ప్రజలకు లేకుండాచేసే అధికారదత్త విధానంమీదగాక, ప్రజాసంఘాలద్వారా వయోజనులందరూ ప్రత్యక్షంగా జోక్యం కలిగించుకొనే విధానంపై ఆధారపడుతుంది. విజ్ఞానాన్ని విశ్వవ్యాప్త చేయటంపైనే ఆ సమాజ సంస్కృతి నిలబడుతుంది. అందులో వైజ్ఞానిక, సృజనాత్మక కార్యక్రమాలమీద పెత్తనం తక్కువ. వాటికి ప్రోత్సాహమూ, అవకాశమూ ఎక్కువ. ఈ నవసమాజం శాస్త్రీయంగా హేతుత్వంపై నిర్మింపబడినందున, ప్రణాళికాబద్ధమై ఉంటుంది. ఐతే ఈ ప్రణాళిక, వ్యక్తిస్వేచ్ఛయే లక్ష్యంగా తయారౌతుంది. ఈ విధంగా రాజకీయ-ఆర్థిక- సాంస్కృతిక ప్రజాస్వామ్యమైన నవసమాజం తన్ను తానుస్వచ్ఛందంగా రక్షించుకొనగల్గుతుంది.
ఆధ్యాత్మిక స్వాతంత్రాన్ని సాధించి, స్వేచ్ఛాప్రపంచాన్ని సృష్టించాలనే దృఢసంకల్పంతో సన్నిహితులైన మానవుల సమిష్టి కృషిద్వారా సమూల ప్రజాస్వామ్య ఆదర్శం సాధ్యమౌతుంది. ఇట్టి మానవులు, భావి రాజ్యవ్యవస్థలో పరిపాలకులుగాగాక, ప్రజలకు మార్గదర్శకులుగా, మిత్రులుగా వుంటారు. తదనుగుణంగా, రాజకీయ ఆచరణ హేతుబద్ధమౌతుంది. అందుచే అది నీతివంతమౌతుంది. ప్రజలలో స్వేచ్ఛాసక్తి పెరిగినకొలదీ, వారికృషికి బలం చేకూరుతుంది. చివరకు, ప్రబుద్ధమైన ప్రజాభిప్రాయంపైనా, వివేకవంతమైన ప్రజాసహకారం మీదా సమూలప్రజాస్వామ్యం అమలులోనికి వస్తుంది. అధికారకేంద్రీకరణ స్వేచ్ఛకు ఆటంకమని గుర్తించటంవల్ల సమూల ప్రజాస్వామ్యవాదులు విస్తృతమైన అధికార వికేంద్రీకరణకు కృషి చేస్తారు.
చివరకు తేలిన సారాంశంః వ్యక్తి స్వేచ్ఛను హరించకుండా సమాజ అభ్యుదయానికి దోహదమిచ్చే విధంగా పునర్నిర్మించటానికి పౌరులను విద్యావంతులుగా చేయటం ముఖ్యఅవసరం. పౌరునిపౌర, రాజకీయ శిక్షణకు ప్రజాసంఘాలే పాఠశాలలుగా ఉపకరిస్తయ్. సమూల ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థ , నిస్సంగులై తప్పుకు తిరిగే వ్యక్తులను సైతం ప్రజాహిత కార్యాలలో పాల్గొనేటట్టు చేస్తుంది. అట్టి వ్యక్తులచే నడపబడే ప్రభుత్వ యంత్రాంగం, ఒక వర్గం మరొక వర్గంపై అధికారం చెలాయించటానికి సాధనం కాదు. స్వేచ్ఛ సాధించిన వ్యక్తులు అధికారంలో ఉన్నప్పుడే దాస్యశృంఖలాలను ఛేదించి అందరికీ స్వేచ్ఛను ప్రసాదింప గలుగుతారు.
రాడికల్ సిద్ధాంతం శాస్త్రవిజ్ఞానాన్ని సమాజ నిర్మాణంలో అంతర్భాగంగా చేస్తుంది. వ్యక్తిత్వానికీ, సమిష్టి జీవితానికీ పొత్తు సాధిస్తుంది. స్వేచ్ఛకు నైతిక, మానసిక, సాంఘిక ప్రాధాన్యతను చేకూరుస్తుంది. ఆర్థిక నియతివాదంలోనూ, భావగమనవాదంలోనూ గల గతితార్కికాలను గమనించి సమగ్రసామాజికాభ్యుదయ సిద్ధాంతాన్ని రూపొందించింది. ఆ సిద్ధాంతం ఆధారంగానే నేడు సామాజిక విప్లవానికి అవసరమైన విధానాన్నీ, కార్యక్రమాన్నీ నిర్ణయించింది.
”మానవుడే అన్నిటికీ ప్రమాణం” (ప్రోటోగొరస్), ”మానవజానికి మానవుడే మూలం” అనే సూక్తులనుండి ‘రాడికలిజం’ ఉత్పన్నమైంది. ఆధ్యాత్మికంగా విముక్తి పొందిన నీతిపరుల సమిష్టి కృషిద్వారా ప్రపంచాన్ని శ్రేయోరాజ్యంగా (Common wealth) విశ్వ సౌభ్రాతృత్వ వ్యవస్థగా పునర్నిర్మించటమే రాడికలిజం ఆశయం.
ఈ సూత్రాలను బాగా మధించి, చర్చించి ఆమోదించిన తరవాత ఉద్యమానికి ఊతం లభించింది. ఇందుకు అనుగుణంగా పత్రికలు, ప్రచురణలు తోడ్పడ్డాయి. మానవేంద్రనాథరాయ్, ఎలెన్ రాయ్, వి.యం.తార్కుండే, శిబ్ నారాయణ్ రే, జి.డి.పరేఖ్, ఆవుల గోపాలకృష్ణమూర్తి, మొదలగువారంతా స్టడీ క్యాంపులను పెట్టి దేశవ్యాప్తంగా భావ ప్రచారం చేశారు. రాడికల్ హ్యూమనిస్టు పత్రిక ఈ విషయాలను ఎప్పటికప్పుడు ప్రచురిస్తూమారుమూల వున్నవారికి విషయాలను అందించింది
##################
మానవవాద ఉద్యమం – నాడు నేడు
భారతదేశంలో 70 ఏళ్ళపాటు కొనసాగిన నవ్యమానవవాద ఉద్యమం నేడు అతి బలహీనస్థాయిలో వున్నది. వివిధ రాష్ట్రాలలో అక్కడక్కడ కొందరు వ్యక్తులు మిగిలారు. ప్రాంతీయ పత్రికలు కొన్ని వెలువడుతున్నాయి. ఇంగ్లీషులో రాడికల్ హ్యూమనిస్ట్ మాసపత్రిక నిరాఘాటంగా వస్తున్నది. అప్పుడప్పుడూ కొందరు మానవవాదుల రచనలు భారతీయ భాషలలోనూ, ఇంగ్లీషులోనూ వెలుగు చూస్తున్నాయి.
ఉద్యమం దేశవ్యాప్తంగా ఎన్నడూ వ్యాపించలేదు. కాని కొన్ని రాష్ట్రాలలో బాగా నిలదొక్కుకుని ప్రభావాన్ని చూపెట్టింది. అందులో ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మహరాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ పేర్కొనాలి. యూనివర్సిటీలలో, విద్యారంగంలో మానవాదం పాఠ్య ప్రణాళికలలో రాలేదు. పాఠ్యగ్రంథాలూ లేవు.
మహరాష్ట్ర బొంబాయి ప్రాంతాలు రాడికల్ హ్యూమనిస్ట్ వుద్యమంలో చాలా ప్రముఖపాత్ర వహించాయి. అందులో పేర్కొన దగిన కొందరు వ్యక్తులు –
1. జె.బి.హెచ్. వాడియా, 2. విమద్ లాల్ మహదేవ్ తార్కుండే, 3. జస్టిస్ జహగిర్దార్, 4. ఎస్.ఎం.జోషి, 5. హమీద్ దల్వాయ్, 6. ఎ.బి.షా., 7. సుమన్ ఓక్, 8. నరేంద్ర దభోల్కర్, 9. తహిర్ భాయి పూనావాలా, 10. ఎం.పి.రేగే, 11. శకుంతల పరంజపీ, 12. వి.కె.సిన్హా, 13. ప్రభాకర్ నానావతి, 14. లక్ష్మణ శాస్త్రి జోషి, 15. మేధా పాట్కర్, 16. శరద్ బేడేకర్, 17. జి. ఆర్. దల్వి
వీరంతా భిన్న రంగాలలో మానవవాద ఉద్యమ వ్యాప్తికి కృషి చేశారు.
హ్యూమనిస్ట్ ఉద్యమంలో గుజరాత్ వారి కృషి అద్వితీయం. అందులో కొందరు ప్రముఖులు.
1. రావోజీభాయి పటేల్
2. చంద్రకాంత్ దరు
3. దశరద్ లాల్ థక్కర్
4. ప్రసన్ వదన్ పట్వారి
5. దురాశంకర్ త్రివేది
6. జయంతి పటేల్
7. బిపిన్ ష్రాఫ్
8. దవాయ్ మెహతా
9. రమేష్ కోర్డే
10. హెచ్.బి.షా
11. నానావతి కిరణ్
12. గౌతం థక్కర్
13. దినేష్ శుక్ల
14. బిపిన్ పరేన్
15. వినూ పటేల్
16. ధీరూభాయ్ షేట్
17. అంబూభాయ్ పటేల్
18. ముల్జి భాయ్ పరాఖ్
19. మాన్ సింగ్ ఛారా
20. నితిన్ త్రివేది
21. మణిబెన్ కారా
22. ప్రకాష్ దేశాయ్
వివిధ ప్రాంతాల వారు రాజధాని ఢిల్లీలో స్థిరపడి ఉద్యమానికి భిన్న రీతులలో తోడ్పడ్డారు. అందులో కొందరు ముఖ్యమైన వ్యక్తులు.
1. సి. ఆర్. ఎం. రావు
2. ప్రేమనాథ్ బజాజ్
3. గౌరీ మాలిక్
4. సుయేష్ మాలిక్
5. వినోద్ జైన్
6. ఎన్.డి. పాంచోలి
7. వి.ఎం.తార్కుండే
8. సునీల్ భట్టాచార్య
9. బలరాజ్ పూరి
10. ప్రకాశ్ నారాయణ్
11. బ్రహ్మదత్,
12. ఆర్.ఎం.పాల్
13. మానిక్ తార్కొండే
ఉత్తర ప్రదేశ్ లో మానవవాదుల కృషి అంతంత మాత్రమే. ఎస్.ఎన్.పూరి డెహ్రాడూన్ లో రాయ్ ఇల్లు ఆక్రమించి వున్నాడు. మీరట్ లో రేఖా సరస్వతి రాడికల్ హ్యూమనిస్ట్ పత్రిక ఎడిటర్ గా కృషిచేసింది, ఆమె తండ్రి ఉద్యమానికి బాగా తోడ్పడ్డారు. బీహార్ లో శివరంజన్ పూజ బాగా కృషి చేశారు.
పశ్చిమ బెంగాల్ నుండి ఉద్యమంలో పాల్గొన్న కొంతమంది ప్రముఖుల పేర్లు –
రజనీ ముఖర్జీ, నళిని దాస్గుప్తా, స్వదేష్ రంజన్ దాస్, సదానంద బెనర్జీ, శాంతిబ్రితా సేన్, ప్రోబోజ్ భట్టాచార్య, మణి దాస్గుప్తా, జగన్నాథ్ బోస్, అనాత్ మిత్ర, సిటంగ్సు చటర్జీ, హరిపాద చటర్జీ, సౌరెండో మోహన్ గంగులి, బిశ్వనాధ్ బెనర్జీ, రాఖల్ దాస్, సరోజ్ మిత్రా, సలీల్ దాస్గుప్తా, దేబోబ్రత సుర్రోవ్ధూరి, మొనాజ్ దత్తా, సుభాంకర్ రే.
ఎలెన్ మార్గదర్శకత్వంలో మానవవాద ఉద్యమం
మానవేంద్రనాథ్ రాయ్ చనిపోవడంతో ఏర్పడిన అఖాతాన్ని ఆయన భార్య ఎలెన్ లోటు లేకుండా పూరించింది. రాయ్ రచనలు పరిష్కరించి ప్రచురించడం, ఉపన్యాసాలను ఎడిట్ చేసి వెలువరించడంలో ఉద్యమకారులకు ఎంతో విలువైన సమాచారం అందించినట్లయింది. పార్టీస్, పవర్, పాలిటిక్స్ అనే పుస్తకం అలా వెలువరించినదే.
ఉద్యమానికి చెందిన 22 సూత్రాల విపులీకరణేగాక, హేతువాదం, ఉద్వేగవాదం, విప్లవం అనే శీర్షికన రాయ్ రాసిన విపుల గ్రంథాన్ని ప్రచురించింది. అది దేశ విదేశాల దృష్టిని ఆకట్టుకున్నది. సుప్రసిద్ధ మానసిక, సామాజిక శాస్త్రజ్ఞుడు ఎరిక్ ఫ్రాం ఆ గ్రంథాన్ని ప్రస్తావిస్తూ, తన సేన్ సొసైటీ రచనలో – యూరోప్ పునర్వికాసం అవగాహన కావాలంటే రాయ్ రచన చదవమనడం విశేషం.
ఉద్యమంలోకి కొత్తగా వచ్చిన ప్రొఫెసర్ శిబ్ నారాయణ్ రే ఆస్ట్రేలియా నుండి తిరిగి వచ్చి రాయ్ రచనలన్నీ పరిష్కరించి ఆక్స్ ఫర్డ్ ప్రచురణల కర్త ద్వారా 4 సంపుటాలుగా ప్రపంచానికి అందించాడు. అంతటితో మానవవాద సిద్ధాంతాలు, రాయ్ రచనలు ప్రపంచ నలుమూలలా తెలిశాయి.
రాయ్ సిద్ధాంతాల వెనుక వున్న వైజ్ఞానిక పద్ధతిని ప్రొఫెసర్ ఎ.బి.షా చక్కగా వివరించి, అధ్యయన తరగతులలో పాఠాలుగా చెప్పాడు.
ప్రతిసంవత్సరం భారత అధ్యయన తరగతులు నిర్వహించడంగాక, ప్రాంతీయంగా వివిధ రాష్ట్రాలలో తరగతులు సాగించారు. ఉపాధ్యాయులు ప్లీడర్లు, వివిధ రంగాలలో ఆసక్తి వున్నవారు పాల్గొని శిక్షణ పొందారు. అందుకు అనుగుణంగా ప్రాంతీయ పత్రికలు కూడా నడిపారు.
ఎలెన్ రాయ్ దేశవ్యాప్తంగా పర్యటించి, అందరినీ మేలుకొలుపుతూ పోయింది. ప్రతి రాష్ట్రంలో కీలక వ్యక్తులు ఆమె పర్యటన వలన చాలా అధునాతనంగా పెంపొందారు.
ఎలెన్ రాయ్ స్వదేశంలోనే గాక అమెరికా, యూరోప్ కూడా పర్యటించింది. ఆమెరికాలో మానవవాదులను, తన సోదరుడిని కలిసింది. ఎం.ఎన్.రాయ్ మొదటి భార్య ఎవిలిన్ తో ఉత్తర ప్రత్యుత్తరాలు నడపడం గమనార్హం.
డెహ్రాడూన్ కేంద్రంగా మానవవాద ఉద్యమం అలా సాగుతుండగా ఒకనాడు 13 మోహినీ రోడ్ లో నివశిస్తున్న ఎలెన్ ఇంట్లోకి యిరువురు దొంగలు అర్థరాత్రి ప్రవేశించి, వెతుకుతుండగా, ఎలెన్ లేచి అడ్డుపడగా, తలపై కొట్టి వారు పారిపోయారు. ఆ దెబ్బలకు ఎలెన్ చనిపోయింది. ఉద్యమానికి 1960లో మరో తీవ్ర విఘాతం ఏర్పడింది.
ఎమ్.ఎన్.రాయ్ స్థాపించిన భారత పునర్వికాస సంస్థ పక్షాన కొన్ని పుస్తకాలు ప్రచురించారు. రాడికల్ హ్యూమనిస్ట్ పత్రిక కూడా ఆ సంస్థ తరఫునే వెలువడుతున్నది.
తదుపరి భాగంలో ఆంధ్రప్రదేశ్ లో మానవవాద ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖుల వివరాలు తెలిచేయబడతాయి.
##################
ఆంధ్రప్రదేశ్‌లో మానవవాద ఉద్యమ పరిణామం
భారతదేశంలో మానవవాద ఉద్యమం పాశ్చాత్య దేశాలతోపాటే ప్రారంభమైంది. భారత మానవవాద ఉద్యమాన్ని ఎం.ఎన్.రాయ్ ప్రారంభించాడు. రాడికల్ హ్యూమనిస్టు, మార్క్సియన్ వే, హ్యూమనిస్టు వే అనే సిద్ధాంత పత్రికలను నడిపాడు. పునర్వికాసం, వికేంద్రీకరణ, ప్రజాస్వామ్య రాజ్యాంగం, ప్రజలకు అధికారం, రాజకీయాల్లో నైతికత, ఓటర్లకు శాసనసభ్యులను వెనుకకు పిలిపించే అధికారం, అన్నిటినీ మించి అన్ని సమస్యలకు శాస్త్రీయపద్ధతిలో పరిష్కారాలను వెదకడం వంటి వాటన్నిటికీ ఎం.ఎన్.రాయ్ ఆద్యులు.
రాడికల్ డెమోక్రటిక్‌పార్టీ తన అధ్యయన తరగతులు, శిక్షణా శిబిరాలు, పత్రికలద్వారా శాస్త్రీయ రాజకీయాలకు ఆదర్శంగా నిలిచింది. కొత్త ఒరవడితో శాస్త్రీయ రాజకీయాలను ప్రచారం చేయడంలో రినైజాన్స్ క్లబ్బులు రాష్ట్రస్థాయిలో, దేశస్థాయిలో గణనీయమైన పాత్ర నిర్వహించాయి. 1940 లో ప్రారంభమైన రాడికల్ డెమోక్రటిక్ పార్టీ కాంగ్రెస్, సోషలిస్టు, కమ్యూనిస్టు పార్టీలకంటే సిద్ధాంతంలో భిన్నమైనది, ఆదర్శవంతమైనదని తేలింది..
మానవవాద ఉద్యమంలో ఆంధ్రప్రదేశ్ పాత్ర
1936 లో ఫైజ్‌పూర్ కాంగ్రెస్ సభలో రాయ్ చేసిన ఉపన్యాసం సాంప్రదాయ రాజకీయ ధోరణికి భిన్నంగా వున్నట్లు ఆ సభలకు హాజరైన ప్రతినిధులు భావించారు. ఆంధ్రప్రదేశ్ నుండి ఆ సభలకు హాజరైన ములుకుట్ల వెంకటశాస్త్రి ఎం.ఎన్.రాయ్‌ని ఆంధ్రకు రమ్మని ఆహ్వానించారు. శాస్త్రి కుందూరు ఈశ్వరదత్తు నడిపే పత్రికకు ప్రతినిధిగా అక్కడకు వెళ్ళారు. అతని ఆహ్వానాన్ని రాయ్ అంగీకరించారు. తరువాత కోస్తాంధ్ర తీరంలో వున్న నెల్లూరులో జరిగిన వ్యవసాయకూలీల మహాసభకు రాయ్‌ని ఆహ్వానించారు. రాష్ట్రపతి వి.వి.గిరి బంధువైన వెన్నెలకంటి రాఘవయ్య రాయ్‌ని ఆహ్వానించారు. 1938 జూలై 31 న ఆంధ్రకు వచ్చిన ఎం.ఎన్.రాయ్‌ని కోస్తాంధ్ర తీరంలోని కాకినాడ పట్టణానికి తీసుకెళ్ళారు. ఆంధ్రవిశ్వవిద్యాలయంలో లైబ్రేరియన్‌గా పనిచేస్తున్న అబ్బూరి రామకృష్ణారావుకు ఈ వార్త తెలిసింది. అతడు రాయ్‌ని వాల్తేరుకు తీసుకొచ్చారు. విశాఖపట్నంలో మహారాణిపేటలో వున్న హెచ్.గుప్తాగారి ఇంట్లో రాయ్ విశ్రాంతి పొందారు. అక్కడే ఆయన ఆరోగ్యం కుదుటపడింది. అప్పుడు ఎల్లెన్ రాయ్ కూడా వాల్తేరుకు వచ్చి రాయ్‌ని కలిసింది. అబ్బూరి రామకృష్ణారావుగారు ఎం.ఎన్.రాయ్‌ని ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్‌గారికి పరిచయం చేశారు. అప్పటి వైస్ ఛాన్స్‌లర్‌గా వున్న కట్టమంచి రామలింగారెడ్డి(సి.ఆర్.రెడ్డి) విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేయమని రాయ్‌ని కోరారు. రాయ్ దాన్ని సున్నితంగా తిరస్కరించారు. వారిద్దరూ గొప్ప స్నేహితులయ్యారు. ”జైలు ఉత్తరాలు” నుండి అనే రాయ్ పుస్తకానికి సి.ఆర్.రెడ్డి గొప్ప పరిచయం రాశారు. అప్పటి నుండి రాయ్ చివరివరకు తరచుగా ఆంధ్రవిశ్వవిద్యాలయాన్ని ఆంధ్రప్రాంతాన్ని సందర్శిస్తూ వచ్చారు. జైలు ఉత్తరాలు గ్రంథాన్ని తరువాత అనువదించి రాడికల్ హ్యూమనిస్ట్ తెలుగు పక్షపత్రికలో ధారావాహికగా ప్రచురించారు.
బ్రిటిష్ పాలనలో రాయ్ ఆరేళ్ళు జైలుశిక్ష అనుభవించారు. ఆయన జైలు నుండి విడుదలయ్యే సమయానికి ‘ఆధునిక విజ్ఞాన శాస్త్ర తాత్విక ఫలితాలు’ అనే బృహద్రచన పూర్తయింది. ఈనాటి వరకూ అది పూర్తిగా అచ్చు కాలేదు. అందులో కొంతభాగం ‘సైన్స్ అండ్ ఫిలాసఫీ’ గ్రంథంలో వెలువడింది. ఆద్యంతాలు, నియతివాద సమస్య, జీవానికి మూలం వంటి అనేక విషయాల గురించి రాయ్ సమగ్రంగా ఆలోచించారు. తరువాత, వాటిలోని కొన్నిభాగాలను తెలుగులోకి అనువదించగా అవి ప్రసారిత త్రైమాసిక పత్రికలో అచ్చయ్యాయి. ప్రొఫెసర్ ఎ.బి.షా, రాయ్ రాతప్రతులను కొందరు మిత్రులకు పంపి చర్చకు పెట్టారు. తరువాతి రచనలలో రాయ్ మరికొన్ని భాగాలను వాటిలో చేర్చారు.
రాడికల్ డెమోక్రటిక్ పార్టీకి అబ్బూరి రామకృష్ణారావు మొదటి రాష్ట్ర ఆర్గనైజర్ అయ్యారు. అతనికి ఎం.వి.శాస్త్రి, ఏ.ఎల్. నరసింహారావు, పెమ్మరాజు వెంకట్రావు, విజయనగరం మునిసిపల్ ఛైర్మన్‌గా వున్న తాతా దేవకీనందన్ సమర్థవంతంగా సహకరించారు. ఆంధ్రలో రాయ్ సందేశం త్వరితగతిన వ్యాపించింది. రచయిత, సినీదర్శకుడైన త్రిపురనేని గోపీచంద్ రాడికల్ డెమోక్రటిక్ పార్టీకి మొదటి రాష్ట్రకార్యదర్శి అయ్యారు. రాజకీయ కథానికలను తెలుగువారికి పరిచయం చేసిన గొప్ప రచయిత గోపీచంద్. అతడు కమ్యూనిస్టులను, కాంగ్రెస్‌పార్టీని, సోషలిస్టు పార్టీని తీవ్రంగా దుయ్యబట్టాడు. రాయ్ ఆలోచనలలో చాలా భాగం గోపీచంద్ కథానికలు, నాటకాలు, విమర్శల రూపంలో తెలుగులోకి తెచ్చారు. ఆనాడు పత్రికారంగం తీవ్రజాతీయ భావాలతో కూడి వున్నందువల్ల హ్యూమనిస్టుల రాడికల్ భావాలను వారు పట్టించుకోలేదు. సినీదర్శకుడైన గూడవల్లి రామబ్రహ్మం ప్రజామిత్ర అనే వారపత్రికను ప్రారంభించి అందులో రాయిస్టుల వ్యాసాలను ప్రచురించేవారు.
రామబ్రహ్మం మద్రాసులో జర్నలిస్టుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొందరు పత్రికా విలేకరులు ప్రశ్నలడిగారు. అటువంటి వారిలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంపాదకులైన ఖాసా సుబ్బారావు ఒకరు. ఎల్లెన్ రాయ్ గురించి అతడు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే, అలాంటి వారికి బడితెపూజ చేయాలంటూ రాయ్. తన చేతిలోని పత్రికను ఖాసా సుబ్బారావును చూపిస్తూ అన్నాడు. దాంతో నిరసన వ్యక్తం చేస్తూ జర్నలిస్టులు అక్కడనుండి బయటకు వెళ్ళిపోయారు. ఆంధ్ర ప్రభ రాయ్ వార్తలను చాలాకాలం ప్రచురించలేదు. ఇది 1938 లో జరిగింది. రాడికల్ హ్యూమనిస్టుల వార్తలను పత్రికలు బహిష్కరించాయి.
అయితే రాడికల్ హ్యూమనిస్టులు ఎవరితోనూ రాజీపడలేదు. ఆంధ్రలో వారు రాజకీయ పాఠశాలలను నడిపి చాలామంది యువకులకు శిక్షణనిచ్చారు. విజయవాడ నుండి బండి బుచ్చయ్య సంపాదకత్వంలో నడిచే ములుకోల వంటి కొన్ని పత్రికలు మాత్రమే రాయిస్టుల వ్యాసాలను ప్రచురించాయి. 1941 లో డెహ్రాడూన్‌లో ప్రథమ రాడికల్ డెమోక్రటిక్ రాజకీయ పాఠశాలను నడిపారు. అక్కడ జరిగిన ప్రసంగాలన్నిటిని (సైంటిఫిక్ పాలిటిక్స్) ‘శాస్త్రీయ రాజకీయాలు’ అనే గ్రంథరూపంలోకి తెచ్చారు, దాన్ని ‘వర్గ సంబంధాలు’గా తెలుగులోకి అనువదించారు. ఇది చాలామంది మేథావులను ఆకర్షించింది. కమ్యూనిస్టులకు తగిన సమాధానం చెప్పింది.
ఉద్యమ ప్రారంభదశలో బండారు వందనం పనిచేశారు. అతడు 1946లో రాడికల్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేశాడు. జంపాల శ్యాంసుందరరావు, కొసరాజు సాంబశివరావు, కొసరాజు అమ్మయ్య, వాసిరెడ్డి శివలింగయ్య ఉద్యమంలో పనిచేసినవారిలో వున్నారు.
తెనాలిలో న్యాయవాదవృత్తిలో వున్న పి.వి.సుబ్బారావు ఉద్యమారంభదశలో పనిచేయడమేగాక వ్యాసాలు, పుస్తకాలు రాశాడు.
పరమయ్య, చలమయ్య, చుంచు శేషయ్య, జాన నాగేశ్వరరావు, కొల్లా సుబ్బారావు మొ|| వారు కూడా ఉద్యమం కోసం కృషి చేశారు. కొల్లా సుబ్బారావుగారు రాయ్ భావాలను ప్రచురించడమేగాక సహకార ఆర్థికవిధానం గురించి రాశాడు. రెండు పుస్తకాలను కూడా తెలుగులోకి అనువదించాడు. గురువులు, పి.ఎస్.రాజు, సత్యనారాయణరాజు ఉద్యమం కోసం కృషిచేశారు.
జాస్తి రామస్వామి, జాస్తి జవహర్‌లాల్ వివిధ స్థాయిల్లో ఉద్యమానికి తోడ్పడడమేగాక సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసికెళ్ళారు. పియస్సార్ వెంకటాద్రిగారితో కలిసి ‘ఆంధ్రప్రదేశ్‌లో హేతువాద మానవవాద ఉద్యమాల చరిత్ర’ అనే గ్రంథాన్ని రచించారు. రక్తదానం, నేత్రదానం, అంశాలను పియస్సార్ ప్రజల్లోకి తీసికెళ్ళి సహాయపడ్డాడు.
ఎం.ఎన్.రాయ్ మానవవాదానికి అనుకూలంగా పాలగుమ్మి పద్మరాజు, జి.వి.కృష్ణారావు శక్తివంతమైన సాహిత్య రచనలు చేశారు. మానవవాదమే కేంద్రభావనగా పద్మరాజు రెండవ అశోకుడి మూణ్ణాళ్ళ ముచ్చట రాజ్యం అనే నవల రాశాడు. గాలివాన అనే కథానిక ప్రపంచ బహుమతిని గెలుచుకుంది. చాలా సినిమాలకు అతను స్క్రిప్టు రాశారు. రాయ్ ప్రతిపాదించిన తత్వానికి సిద్ధాంత రచయితగా జి.వి.కృష్ణారావు ఆవిర్భవించారు. కళలకు సంబంధించిన కమ్యూనిస్టుల సిద్ధాంతాన్ని పూర్వపక్షం చేశారు. పాపికొండలు అనే ఆయన నవల అసంపూర్తిగా మిగిలింది.
కూచిపూడి గ్రామస్తుడైన కోగంటి రాధాకృష్ణమూర్తి ప్రజాస్వామ్య సాహిత్య ప్రచురణల పేరిట ఒక సంస్థనే ప్రారంభించారు. అనేక గ్రంథాలను, అనువాదాలను ప్రచురించారు. ఎం.ఎన్.రాయ్ రచనల మీదనే అతడొక పుస్తకాన్ని రాశారు.
రెండవప్రపంచ యుద్ధకాలంలో రాయ్, అతని సన్నిహిత సహచరుడైన జి.డి.పరేఖ్ ప్రజాప్రణాళిక పేరిట ప్రత్యామ్నాయ ఆర్థిక ప్రణాళికను ప్రతిపాదించారు. బిర్లా తదితర ధనవంతుల బొంబాయి ప్రణాళికకు ప్రత్యామ్నాయంగా ఈ ప్రణాళికను పరిగణించారు. రెండవ ప్రపంచయుద్ధ సమయంలో ఫాసిస్టులకు, నాజీలకు వ్యతిరేకంగా బ్రిటిషువారిని సమర్థించినందుకు రాయ్‌పై, రాడికల్స్‌పై కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వారు దుష్ప్రచారం చేశారు. దాంతోనే ఆగిపోకుండా యుద్ధప్రచారానికి 13 వేల రూపాయలు తీసుకున్నందుకు వారిని నిందించారు. బ్రిటిష్‌వారిని యుద్ధవిషయంలో ఎందుకు సమర్థించిందనే విషయాన్నంతటినీ వి.బి.కార్నిక్ ప్రపంచానికి సహేతుకంగా వివరించారు. తరువాత కాలంలో యుద్ధం విషయంలో కమ్యూనిస్టులు తప్పని, రాయ్ సరైనవైఖరని రుజువైంది. అదేవిధంగా అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షపదవికి సుభాష్ చంద్రబోస్ (1938)ను రాయ్ సమర్థించాడు. గాంధీ వ్యతిరేకించినప్పటికీ బోసు గెలిచారు. గాంధీ అనుయూయులను కార్యవర్గంలో చేర్చరాదని, అలా చేస్తే వారు వెన్నుపోటు పొడుస్తారని రాయ్ సలహా యిచ్చారు. రాయ్ సలహాను పెడచెవినబెట్టిన బోసు గాంధేయులకు కార్యవర్గంలో స్థానం కల్పించారు. వారు బోసును వెన్నుపోటు పొడిచారు. మరోసారి బోసు ఓటమి పాలయ్యారు. అతడు ఓడినపుడు ఎవరూ అతన్ని పట్టించుకోలేదు. బోసు లక్నోకు వచ్చినపుడు ఎం.ఎన్.రాయ్ అనుచరులే అతనికి స్వాగతం పలికారు. ఆవుల గోపాలకృష్ణమూర్తి, మరికొందరు కలిసి అతనికి విశ్వవిద్యాలయ హాస్టలులో అతిథ్యమిచ్చారు.
డెహ్రాడూన్‌లో రెండవ అఖిలభారత అధ్యయన శిబిరం జరిగింది. ఆ సందర్భంగా చేసిన ప్రసంగాన్నిటిని న్యూ ఓరియెంటేషన్ అనే గ్రంథంగా తీసుకొచ్చారు. అందులోని సారాంశాన్ని తెలుగులోకి అనువదించారు.
యుద్ధసమయంలో బెంగాలులో, ప్రత్యేకించి కలకత్తా కమ్యూనిస్టులు రాడికల్స్ మీద దాడిచేశారు. వారి అధ్యయన తరగతులను అడ్డగించారు. వారి హింసాత్మక దాడికి గురైనవారిలో ఎం.వి.రామమూర్తిగారొకరు.
1946లో జరిగిన మొదటి ఎన్నికలలో రాడికల్ డెమోక్రటిక్ పార్టీ పోటీ చేసింది. అప్పుడు ఓటర్లు పరిమితంగానే వున్నారు. పన్నుకట్టేవారికి మాత్రమే ఓటు హక్కు వుండేది. ఆంధ్రనుండి కొద్దిమంది అభ్యర్థులే పోటీచేసి గొప్ప సవాలును ఎదుర్కొన్నారు. రాజకీయపార్టీల నుండి, జాతీయవాద ఓటర్ల నుండి వారు చాలా వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. దాంతో అభ్యర్థులందరూ ఎన్నికలలో ఓడిపోయారు. అయినప్పటికీ హ్యూమనిస్టు ప్రత్యామ్నాయాన్ని ప్రచారం చేయడానికి రాడికల్స్‌కు అదొక గొప్ప అవకాశమైంది. కోగంటి రాధాకృష్ణమూర్తి, రావిపూడి వెంకటాద్రి, బండారు వందనం, దేవకీ నందన్ పోటీ చేశారు. ఎం.వి.రామమూర్తి, గుత్తికొండ నరహరి, ఆవుల గోపాలకృష్ణమూర్తి, ఎన్.వి,బ్రహ్మం, మరికొందరు అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ఆ ఎన్నికలు రాడికల్ డెమోక్రటిక్ పార్టీనే గొప్ప మలుపు తిప్పాయి. ఆ ఎన్నికల తరువాత ఉద్యమం కోసం ఎం.ఎన్.రాయ్ రాడికల్ డెమోక్రటిక్ పార్టీనే రద్దు చేయాలని ప్రతిపాదించాడు. వెంటనే దాన్ని ప్రత్యామ్నాయ రాజకీయతత్వంగా 22 సిద్ధాంతాల రూపంలో వెలువరించారు. సుదీర్ఘ చర్చలు జరిగాయి. తెలుగు అనువాదం వెలువడింది. పార్టీ రద్దుచేయడాన్ని ఫిలిప్‌స్ప్రాట్ వ్యతిరేకించారు. అయినా రాయ్ తన పట్టును వీడలేదు.
జవహర్‌లాల్ నెహ్రూ అనే పేరుతో ఎం.ఎన్.రాయ్ ఒక శక్తివంతమైన చిన్న పుస్తకాన్ని ప్రచురించారు. అందులో నెహ్రూ రాజకీయతత్వాన్ని బట్టబయలు చేశారు. అందులో నెహ్రూకు తగిన సమాధానాన్ని యిచ్చారు. నెహ్రూ విమర్శిస్తూ తనకు రాయ్ ఆర్థికవిధానాలు నచ్చాయిగాని, రాజకీయాలు నచ్చలేదన్నారు. దానికి రాయ్ ప్రతి విమర్శ చేస్తూ, తన రాజకీయాలు, ఆర్థికవిషయాలు కలిసే వుంటాయని వాటిని వేరుచేయలేమని సమాధానమిచ్చారు.
గాంధీపై రాయ్ చేసిన విమర్శను ఆంధ్రలోని తొలి రాడికల్ గ్రూపు చక్కగా ఆకళింపు చేసుకుంది. గోపీచంద్, ఆవులగోపాలకృష్ణమూర్తి, గుత్తికొండ నరహరి ఆ విమర్శను సమర్థవంతంగా నిర్వహించారు. రాయ్ శాస్త్రీయదృష్టితో గాంధీ మతభావాలను దుయ్యబట్టారు. రాయ్ చేసిన విమర్శ ఆధారంగా ఆవుల గోపాలకృష్ణమూర్తి తెలుగులో గాంధీపై అనేక వ్యాసాలను ప్రచురించారు. ఆ విమర్శ అబ్బూరి రామకృష్ణారావు వంటి జాతీయవాదులకు మింగుడు పడలేదు. దాంతో అబ్బూరి రామకృష్ణారావు ఆవుల గోపాలకృష్ణమూర్తిపై రాయ్‌కి ఫిర్యాదు చేశారు. అయితే ఆవుల గోపాలకృష్ణమూర్తి విమర్శ సరైనదని రాయ్ కితాబిచ్చారు.
కోగంటి రాధాకృష్ణమూర్తి రాయ్ వ్యాసాలను సులభశైలిలో తెలుగులోకి అనువదించారు. అతడు ప్రింటింగ్ ప్రెస్‌ను పెట్టి అనేక హ్యూమనిస్ట్ రచనలను ప్రచురించారు.
రాయ్ నవ్యమానవవాద రచనను ఆవుల గోపాలకృష్ణమూర్తి తెలిగించారు. అది చిన్నదైనా సిద్ధాంతపరంగా శక్తివంతమైనది.
స్వాతంత్య్రానంతరం ఆంధ్రలో కమ్యూనిస్టులు గొప్ప బలమైనశక్తిగా వుండేవారు. వారిని సిద్ధాంతపరంగా, ప్రత్యామ్నాయాలతో ఎదుర్కోగలిగినవారు రాడికల్ డెమోక్రాట్లు మాత్రమే. ఎం.ఎన్.రాయ్, ఫిలిప్‌స్ప్రాట్‌లు ‘బియాండ్ కమ్యూనిజం’ అనే గ్రంథాన్ని తెచ్చారు. దాన్ని వెంటనే ఎం.వి.రామమూర్తిగారు తెలుగులోకి అనువదించారు. అది రాడికల్స్‌కు బాగా ఉపయోగపడింది.
రాయ్ రచనలలో మకుటాయమానమైన బృహత్ గ్రంథం రీజన్, రొమాంటిసిజమ్, రెవల్యూషన్, (వివేకం, ఉద్వేగం, విప్లవం). అది రాడికల్ హ్యూమనిస్టు పత్రికలో ధారావాహికగా వచ్చింది. ఆ తరువాత రెండు సంపుటాలుగా అచ్చయింది. ఐరోపా రినైజాన్స్‌ను అర్థం చేసుకోవాలంటే ఇది తప్పక చదవాల్సిన గ్రంథమని ఎరిక్‌ఫ్రాం సిఫారసు చేశారు. (1955లో వెలువడిన అతని గ్రంథం ‘సేన్ సొసైటీ’ లో). ఈ విషయాన్ని ఆవుల గోపాలకృష్ణమూర్తి రాడికల్ హ్యూమనిస్టుల దృష్టికి తెచ్చారు. రీజన్ రొమాంటిసిజమ్ అండ్ రివల్యూషన్ అనే గ్రంథంలోని మార్క్సిజం, హ్యూమనిజం వంటి కొన్ని భాగాలను జాస్తి జగన్నాధం తెనిగించారు. అది ‘వాహిని’ తెలుగు వారపత్రికలో ధారావాహికగా వచ్చింది.
ఆవుల గోపాలకృష్ణ మూర్తి ‘వ్యాసోపన్యాసకుడు’గా ప్రసిద్ధి చెందారు. అతడు రాడికల్, రాడికల్ హ్యూమనిస్టు, సమీక్ష పత్రికలలో చాలా వ్యాసాలు రాశారు. అతడు వృత్తిరీత్యా న్యాయవాది అయినప్పటికీ తన కార్యకలాపాల ద్వారా మానవవాదాన్ని ప్రచారం చేశారు. మానవవాద ప్రచారంలో భాగంగా అతడు చాలా సెక్యులర్ పెళ్ళిళ్ళు చేశారు. సాహితీ చర్యలలో చురుకుగా పాల్గొని విశ్వనాథ సత్యనారాయణ వంటి అభ్యుదయ నిరోధక కవులను తీవ్రంగా విమర్శించాడు. రాయ్‌ని, మానవవాదాన్ని విమర్శించే కమ్యూనిస్టులకు, కాంగ్రెస్‌వారికి, సోషలిస్టులకు దీటుగా సమాధానాలిచ్చాడు. అఖిలభారత రాడికల్ హ్యూమనిస్టు అధ్యయన తరగతులలో పాల్గొన్నారు. ఎ.జి.కె. కవులను, రచయితలను, గాయకులను, కళాకారులను ప్రోత్సహించి, కళలద్వారా మానవవాద భావజాలాన్ని ప్రచారం చేశారు.
బి.ఎస్.ఎల్.హనుమంతరావు చరిత్రను శాస్త్రీయంగా బోధించడమేగాక గ్రంథాలను రచించి ప్రచురించారు. కల్లూరి బసవేశ్వరరావు హనుమంతరావుతో కలిసి చరిత్ర పాఠ్యగ్రంథాలను రచించారు. ఎం.ఎన్.రాయ్ స్మృతులను తెలుగులోకి ప్రప్రథమంగా అనువదించింది హనుమంతరావే.
ఎం.ఎన్.రాయ్ రచించిన పిల్లి ఆత్మకథకు తెలుగులో మంచిపేరొచ్చింది. ముందుగా దాన్ని ఎ.వి.మోహన్ తెలుగులోకి అనువదించగా, తరువాత వెనిగళ్ళ కోమల కూడా దాన్ని తెనిగించారు. అది మూడుసార్లు పునర్ముద్రణ పొందింది.
ఎం.ఎన్.రాయ్ రచించిన రీజన్, రొమాంటిసిజం, రెవెల్యూషన్ అనే గ్రంథంలో మార్క్సిజాన్ని గురించి జాస్తి జగన్నాథం తెలుగులోకి అనువదించారు. కేవలం అందులోని కొంతభాగం మాత్రమే కొన్ని పత్రికలలో ప్రచురించబడింది.
ఆలపాటి రవీంద్రనాథ్ తెనాలి నుండి జ్యోతి పత్రికను ప్రారంభించారు. అది ఎం.ఎన్.రాయ్, ఎల్లెన్ రాయ్, యితర రాడికల్ హ్యూమనిస్టుల భావాలను ప్రచారం చేసి మంచి ప్రజాదరణ పొందింది. రవీంద్రనాథ్ కథలు చెప్పడంలో కొత్త ఎత్తుగడలను ప్రవేశపెట్టారు. శాస్త్రీయ సెక్సువిద్యను, కుటుంబనియంత్రణను కూడా అతడే పరిచయం చేశారు. ఎల్లెన్‌రాయ్ వ్యాసాన్ని ప్రచురించి కుటుంబనియంత్రణను ప్రోత్సహించినందుకుగాను 1948లో అతనిపై కేసుపెట్టారు. సంప్రదాయవాదులకు కుటుంబనియంత్రణ భావమే మింగుడుపడేది కాదు. తరువాత అతడు మిసిమి అనే మాసపత్రికను ప్రారంభించారు. అది సాహితీప్రియుల మన్ననలను అందుకొంది.
సినీ రచయిత డి.వి.నరసరాజు జీవితాంతం రాయిస్టుగా వున్నారు. అతడు విరివిగా రచనలు చేశారు. వాటిలో కథానికలు, కథలు, వ్యంగవ్యాసాలు మంచి పేరు గడించాయి.
‘రాడికల్ హ్యూమనిస్టు’ తెలుగు పత్రికకు కోగంటి సుబ్రహ్మణ్యం సంపాదకుడిగా వుండేవారు. హ్యూమనిజం భావాలను వ్యాప్తిచేయడంలో అతడు బాగా శ్రమించారు. కొల్లి శివరామిరెడ్డి, ఎమ్.వి.రమణయ్య హ్యూమనిస్టు పత్రికలకు ఇతోధికంగా సహాయపడ్డారు.
రావిపూడి వెంకటాద్రి 1946లో రాడికల్ డెమోక్రటిక్‌పార్టీ తరపున పోటీ చేశారు. అప్పుడు జాతీయవాదుల నుండి కమ్యూనిస్టుల నుండి వ్యతిరేకత ఎదురైనా పల్లెల్లో రాయ్ భావాలను వ్యాప్తి చేయడానికి అదొక గొప్ప అవకాశాన్ని కలిగించింది. జ్యోతిషం, జీవానికి మూలం, గతితర్కం వంటి రాయ్ భావాలను ప్రచారం చేయడంలో అందరికంటే ముందున్న రచయిత అతడు. ఎం.ఎన్.రాయ్ భావాలపై గొప్ప గ్రంథాలను రచించి కమ్యూనిస్టుల బండారాన్ని బయటపెట్టారు. తన ఉపన్యాసాల ద్వారా, అధ్యయన తరగతుల ద్వారా, ‘హేతువాది’ పత్రికకు సంపాదకత్వం వహించడం ద్వారా హేతువాద ఉద్యమాన్ని నడిపారు. మార్క్సు గతితర్కాన్ని తీవ్రంగా విమర్శించి, హ్యూమనిజం గొప్పతనాన్ని చాటారు. జ్యోతిష్యంలోని బండారాన్ని సులభశైలిలో బయటపెట్టారు. ‘జీవమంటే ఏమిటి’ అనే తన గ్రంథం ద్వారా జీవుల పుట్టుకను, పెరుగుదలను శాస్త్రీయంగా వివరించి, మన నమ్మకాలలోని డొల్లతనాన్ని బయటపెట్టారు. ఎం.ఎన్.రాయ్ పట్ల కమ్యూనిస్టులు చేసిన తప్పుడు విమర్శలను’ఎం.ఎన్.రాయ్ భారత కమ్యూనిజం’ అనే తన ఉద్గ్రంథం ద్వారా తిప్పికొట్టారు. వెంకటాద్రి ‘హేతువాది’ మాసపత్రికను నడపడానికి, మతవిమర్శకు, మతనమ్మకాలను, పద్ధతులను, కల్పితాలను విమర్శించడానికి అంకితమయ్యారు.
డెహ్రాడూన్‌లో జరిగిన అఖిలభారత రాడికల్ హ్యూమనిస్ట్ అధ్యయన తరగతుల్లో ముందుతరం విద్యార్థిగా పాల్గొన్నవారిలో ఎన్.వి.బ్రహ్మం ఒకరు. తెలుగులో బ్రహ్మం రాసిన ‘బైబిలు బండారం’ నిషేధానికి గురైంది. తరువాత సుప్రీంకోర్టు ఆ నిషేధాన్ని తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అతడు తాను నడిపిన ట్యుటోరియల్ సంస్థల ద్వారా మానవవాద భావాలను ప్రచారం చేశారు.
గుంటూరులో ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీలో పనిచేసీన ఎలవర్తి రోశయ్య, ఎం.ఎన్.రాయ్ భావాలను తన విద్యార్థులకు ప్రచారం చేసినవారిలో ఆద్యుడు. అతని విద్యార్థులలో చాలామంది రాయిస్టులుగా తయారయ్యారు.
తెలుగులో మంచివక్తగా వున్న గుత్తికొండ నరహరి రాడికల్ డెమోక్రటిక్ పార్టీకి ఆంధ్రలో కార్యదర్శిగా పనిచేశారు. మంచి ఉపన్యాసాలు చేసే నరహరిపై కమ్యూనిస్టులు తీవ్రవిమర్శలు చేసేవారు. తన వాగ్దాటితో వారి విమర్శలకు తగిన జవాబు చెప్పేవారు. కార్మిక పత్రిక నడిపారు.
ఆంధ్రలో రాడికల్ హ్యూమనిస్టు భావాజాలాన్ని ప్రచారంచేసిన వారిలో ఎం.వి.రామమూర్తి చెప్పుకోదగినవారు. అతడు అఖిలభారత రాడికల్ డెమోక్రటిక్ సంఘానికి అధ్యక్షుడిగా వున్నాడు. తన భార్య మల్లాది సుబ్బమ్మతో కలిసి హ్యూమనిస్టు ఉద్యమానికి అంకితమై పనిచేశారు. వ్యాసాలు, పుస్తకాలు, అనువాదాలు రచించి ప్రచురించారు. కోగంటి రాధాకృష్ణమూర్తితో కలిసి ప్రజాస్వామ్య ప్రచురణలు అనే సంస్థను స్థాపించి, రాయ్ రచనలను తెలుగులోకి తీసుకొచ్చారు. రామమూర్తి ‘వికాసం’ మాసపత్రికను ప్రారంభించి కొన్ని సంవత్సరాలు దానికి సంపాదకుడిగా పనిచేశారు. అతడు భారతదేశమంచటా పర్యటించి మానవవాదులతో పరిచయాలు పెట్టుకున్నారు. 1940 నుండి జీవితాంతం వరకు రామమూర్తి హ్యూమనిస్టు ఉద్యమవ్యాప్తికై కృషిచేశారు.
రాయ్ పేర్కొన్న విధంగా బచ్చు వెంకటేశ్వర్లు రినైజాన్స్ క్లబ్‌ను ఏర్పాటు చేసి యువకులను విశేషంగా ఆకర్షించారు. చీరాల పట్టణం నుండి దాన్ని నడుపుతూ పిన్నవయసులోనే అర్థాంతరంగా ప్రమాదంలో మరణించారు.
ఉద్యమం ఆర్థిక సంక్షోభంలో వున్న సమయంలో కొల్లి శివరామిరెడ్డి, న్యాయవాది కెఠెవరం గ్రామం నుండి ‘సమీక్ష’ పత్రికకు సంపాదకుడిగా ఉన్నారు. ఇతనికి తెనాలిలో ఉపాధ్యాయుడిగా వున్న ఎం.వి.రమణయ్య సహాయపడ్డాడు. తెనాలిలో ఉపాధ్యాయుడిగా వున్న పరశురాం మానవవాద భావాలు అట్టడుగు వర్గాల ప్రజలలో వ్యాపింపచేయడానికి సాహితీ ప్రక్రియను ఎన్నుకున్నాడు. మంచి ఉపన్యాసకుడిగా, రచయితగా వున్న మేకా చక్రపాణి స్థానికంగా హ్యూమనిస్టు భావాలను ప్రచారం చేశాడు.
ఎం.నారాయణ, తెలంగాణా ప్రాంతంలో పల్లె పల్లెలో పర్యటించి ఎం.ఎన్.రాయ్ ప్రతిపాదించిన అధికార వికేంద్రీకరణ, ప్రజలకే అధికారం అనే భావాలకు విస్తృత ప్రచారం కల్పించాడు. రాయ్ రచనలను ఆ ప్రాంత ప్రజల్లోకి తీసికెళ్ళిన నారాయణ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేసి మరణించారు.
మద్రాసులోని బ్రిటిష్ కౌన్సిల్‌లో పనిచేసిన వి.ఎస్.అవధాని అధ్యయన తరగతుల్లో పాల్గొని ఎం.ఎన్.రాయ్‌ని వ్యతిరేకించి, ఆ వార్తలను దినపత్రికలలో రాకుండా అడ్డుపడ్డారు. తరువాత రాయ్ రచనలు చదివిన నార్ల పూర్తిగా మారిపోయాడు. రాయ్ గురించి, హ్యూమనిజం గురించి అనేక రచనలు చేసి ప్రచురించాడు. తన రచనలలో కొన్నింటిని వి.ఎం.తార్కుండే, ప్రేమనాథ్ బజాజ్, నిరంజన్‌ధర్, సుశీల్ ముఖర్జీలకు అంకితమిచ్చాడు. శిబ్ నారాయణ్ రే, ఎ.బి.షా, తార్కుండేగార్లకు సన్నిహితుడయ్యాడు.
చీరాల నుండి అంచా బాపారావు హ్యూమనిస్టు పత్రికకు సంపాదకత్వం వహించాడు. సంక్షోభసమయంలో ఉద్యమానికి తోడ్పడ్డాడు. చీరాలలోని అతని వివేక విద్యాలయం చాలాకాలం మానవవాద కార్యకలాపాలకు కేంద్రంగా వుండేది.
ఉద్యమం క్లిష్టపరిస్థితుల్లో వున్నప్పుడు దాన్ని ఆదుకోడానికి ఎం.బసవపున్నారావు చాలా కష్టపడ్డాడు. ఆంధ్రప్రదేశ్‌లో హేతువాద, నాస్తికవాద సంఘాల సమాఖ్య (ఫెరా) ఏర్పరచారు. అనేక మానవవాద కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు.
ప్రేమానంద్‌ను ఆహ్వానించి, కోటపాటి మురహరిరావు యువకులకోసం మ్యాజిక్ తరగతులు నిర్వహించారు. దొంగ గురువుల, బాబాల, అమ్మల బండారాన్ని బయటపెట్టాడు.
తెనాలిలో గురజాల సీతారామయ్య నిరంతరం ఉద్యమానికి ఆర్థిక సహాయాన్ని అందజేసి బాగా ఆదుకున్నారు. అతని ఎం.ఎన్.రాయ్ భవన్, నవీనలాడ్జి అనేక సభలు, సెమినార్లు, అధ్యయన తరగతులు నిర్వహించుకోడానికి బాగా తోడ్పడ్డాయి.
సి.ఎల్.ఎన్.గాంధీ, ఆయన భార్య రాధారాణి ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యమానికి సహాయపడుతున్నారు.
ఎస్.ఎ.బక్షి, విజయలక్ష్మి మతాంతర సెక్యులర్ వివాహం చేసుకొని ఉద్యమంలో ఆదర్శంగా నిలిచారు. వారు తను నడిపే పాఠశాల ద్వారా, క్యాంపులద్వారా భావ ప్రచారానికి తోడ్పడ్డారు. విజయలక్ష్మి స్త్రీ సమస్యలను ముఖ్యంగా వీరేశలింగం చేసిన కృషిని గ్రంథస్తం చేశారు.
ఎం.ఎన్.రాయ్ ఆర్థిక వికేంద్రీకరణ గురించి పల్లె జీవనం గురించి రాసిన భావాలను తీసుకొని కలకత్తా నుండి స్వదేశీరంజన్‌దాస్ కోఆపరేటివ్ కామన్‌వెల్త్’ అనే గ్రంథాన్ని రచించాడు. అది తెలుగులోకి వచ్చింది. తెనాలి నుండి కోగంటి సుబ్రహ్మణ్యం నడిపిన ‘రాడికల్ హ్యూమనిస్టు’ తెలుగువారపత్రికలో ఆ అనువాదం సీరియల్‌గా అచ్చయింది.
ఎం.ఎన్.రాయ్ రచించిన ‘హెర్సిస్ ఆఫ్ ట్వంటియత్ సెంచరీ’ అనే గ్రంథంలోని వ్యాసాలు ‘ప్రజావాణి’, ‘రాడికల్ హ్యూమనిస్ట్’ తెలుగు పత్రికలలో అచ్చయ్యాయి.
పసల భీమన్న తన మ్యాజిక్ ప్రదర్శనల ద్వారా యువతలో శాస్త్రీయభావాల వ్యాప్తికి కృషి చేస్తున్నాడు. అతడు కొన్ని పుస్తకాలు రచించారు. ఉద్యమవ్యాప్తికి కృషి చేసిన వారిలో క్షేత్రస్థాయిలో అనేకమంది వున్నారు. అటువంటి వారిలో గోరంట్ల రాఘవయ్య ఒకడు.
సి.హెచ్. రాజారెడ్డి తన లిబర్టీ ప్రింటింగ్ ప్రెస్ ద్వారా, పబ్లికేషన్ ద్వారా ఉద్యమానికి పెద్ద అండగా నిలిచాడు. కొంతకాలం సమీక్ష పత్రికకు సంపాదకత్వం వహించాడు.
తోటకూర వెంకటేశ్వర్లు ‘చార్వాక’ మాసపత్రికకు సంపాదకుడిగా వున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఆ పత్రిక వల్ల చాలామంది యువకులు స్ఫూర్తి పొందారు. చార్వకపత్రిక కొద్దికాలం నడిచినా చాలా సర్క్యులేషన్ తో విపరీతంగా ఆకర్షించింది.
ఎం.ఎన్.రాయ్, ఎ.బి.షా, వి.బి.కార్నిక్, శిబ్‌నారాయణ్‌రే, అగేహానందభారతి, వి.ఆర్.నార్ల రచనలు తెలుగులోకి వచ్చాయి. వాటిని తెలుగు అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయాలు ప్రచురించాయి.
చీరాల, ఇంకొల్లు నుండి ‘హేతువాది’ మాసపత్రిక రావిపూడి వెంకటాద్రి సంపాదకత్వంలో, మేడూరి సత్యనారాయణ సహాయసహకారాలతో వెలువడుతోంది. ఇంకొల్లు గ్రామంలోని చురుకైన, రాడికల్ భావాలుగల యువకులు మేడూరి సత్యనారాయణ, కుర్రా హనుమంతరావు, కరి హరిబాబు, షేక్ బాబు తమ శక్తిని, కాలాన్ని ఉద్యమానికి ధారబోస్తున్నారు.
పెదనందిపాడు గ్రామం నుండి లావు అంకమ్మ, పెద్ది సత్యనారాయణ మానవవాద ఉద్యమం కోసం కృషి చేశారు.
ప్రభుత్వోద్యోగం నుండి పదవీ విరమణ చేసిన గుమ్మా వీరన్న గత మూడు దశాబ్దాలుగా తన శక్తి సామర్థ్యాలను ఉద్యమానికై వినియోగిస్తున్నారు. ఆలోచనను రేకెత్తించే అనేక వ్యాసాలను తెలుగు పత్రికలకు రాయడమేగాక మానవవాదంపై కొన్ని గ్రంథాలను ప్రచురించాడు. ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి అతడు ఇప్పటికీ శాయశక్తులా కృషి చేస్తున్నాడు. వి.ఎం.తార్కుండేగారు ఇంగ్లీషులో రాసిన ‘రాడికల్ హ్యూమనిజం’ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించాడు. దాన్ని తెలుగులోకి అకాడమీవారు ప్రచురించారు. వెంకటాద్రి రచనలపై సిద్ధాంత గ్రంథం వెలువరించి పిహెచ్.డి. పొందారు.
ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్‌లో వుంటున్న అరమళ్ళ పూర్ణచంద్ర మానవవాద ఉద్యమానికి, ఇంకొల్లులోని రాడికల్ హ్యూమనిస్టు సెంటర్‌కు నిరంతరం సహాయపడుతూనే వున్నాడు. అతను శాస్త్రీయగ్రంథాలను, వ్యాసాలను రచించాడు. ఆంధ్రప్రదేశ్ మానవవాద ఉద్యమానికి ఆర్థికసహాయమేగాక చాలా పుస్తకాల ప్రచురణకు తోడ్పడ్డాడు. ఇంకా నర్రా కోటయ్య, సి.రంగనాయకులు, రాఘవరావు, పర్వతయ్య వున్నారు.
తెనాలి నుండి ప్రపుల్లచంద్ర తన ఆలోచనాత్మకమైన రచనల ద్వారా ఉద్యమానికి తోడ్పడ్డారు.
మల్లాది సుబ్బమ్మ మహిళాభ్యుదయానికై కృషి చేశారు. సెక్యులర్ హ్యూమనిజానికి తోడ్పడ్డారు. ఆమె తన నివాసం నుండే మహిళల అభ్యున్నతికి కృషి చేశారు. ఆమె ‘స్త్రీ స్వేచ్ఛ’ అనే మాసపత్రికకు సంపాదకత్వం వహించారు. అది మానవవాద భావాల వ్యాప్తికి తోడ్పడింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఆవుల సాంబశివరావు జీవితాంతం మానవవాద ఉద్యమానికి సహాయపడుతూ స్ఫూర్తిగా నిలిచాడు, అనేక వ్యాసాలు రాశాడు. సెక్యులర్ వివాహాలకు అధ్యక్షత వహించారు.
విజయవాడ నుండి మండవ శ్రీరామమూర్తి, అవనిగడ్డ నుండి కోనేరు కుటుంబరావు, త్రిపురనేని గోకుల్‌చంద్, పోలు సత్యనారాయణ, వై.రాఘవయ్య, బి.ఎ.వి.శర్మ, ఆలూరి భుజంగరావు వివిధస్థాయిల్లో ఉద్యమాభివృద్ధికై పనిచేశారు.
అఖిలభారత మానవవాద నాయకులు చాలామంది రాష్ట్రాన్ని సందర్శించి సభలు సమావేశాల్లో ఉపన్యసించారు. కార్యకర్తలను, రచయితలను ఉత్తేజపరిచారు. వారిలో సునీల్ భట్టాచార్య, మణిబెన్‌కారా, ఇందుమతి ఫరేఖ్, ఎ.బి.షా, సి.టి.దరు, జి.ఆర్.దల్వి, వి.యం.తార్కుండే, శిబ్‌నారాయణ్‌రే, వి.కె.సిన్హా, గౌరీ బజాజ్, పంచోలి, ఆర్.ఎస్.యాదవ్, లక్ష్మణశాస్త్రి జోషి, జయంతి పటేల్, జె.బి.హెచ్. వాడియా వున్నారు.
రాయ్ మరణానంతరం 1955 తర్వాత చాలమంది ఉద్యమంలోనివారు చప్పబడ్డారు. పెమ్మరాజు వెంకట్రావు రాడికల్ భావాలను ప్రవేశపెట్టాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్‌పార్టీలో చేరాడు. తరువాత తెలుగుదేశం పార్టీకి చేరువయ్యాడు.
ఎం.వి.శాస్త్రి స్వతంత్రపార్టీలో చేరాడు. పట్టబద్రుల నియోజకవర్గం నుండి అతడు శాసనమండలికి ఎన్నికయ్యాడు. అబ్బూరి రామకృష్ణారావు సాంస్క ృతిక కార్యక్రమాలకు దూరమై క్రమంగా ఆస్తికుడిగా మారిపోయాడు. గుత్తికొండ నరహరి, ఎన్.జి.రంగాను చేరి స్వంత పొగాకు వ్యాపారాన్ని ప్రారంభించాడు.
త్రిపురనేని గోపీచంద్ క్రమంగా అరవిందుడి భావాలకు ఆకర్షితుడై భక్తుడిగా మారిపోయాడు.
ఎల్లెన్‌రాయ్ రాష్ట్రాన్ని తరచుగా సందర్శించి ముఖ్యులతో పరిచయాలను కొనసాగించింది.
వి.యం.తార్కుండే పార్టీరహిత రాజకీయాల కోసం, పౌరబక్కులకోసం జయప్రకాశ్ నారాయణ్‌తో చేతులు కలిపారు. ఒకదశలో కమ్యూనిస్టులు కూడా తమ పౌరహక్కుల ప్రజాసంఘం ద్వారా తార్కుండేతో కలసి పనిచేశారు.
ఎ.బి.షా. సెక్యులర్ సొసైటీని స్థాపించి తరచుగా రాష్ట్రాన్ని సందర్శించి రాష్ట్రశాఖను ఏర్పాటు చేశాడు. సాంస్క ృతిక స్వేచ్ఛకోసం అతడే కాంగ్రెస్‌తో కూడా కలసి పనిచేశాడు. ఎ.బి.షా రచించిన ‘సైంటిఫిక్ మెథడ్’ గ్రంథాన్ని శాస్త్రీయ పద్ధతిగా తెలుగులోకి వచ్చింది. అది మూడు ముద్రణలు పొందింది. 1970 దశకంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం తత్వశాస్త్ర విభాగంవారు ఎం.ఎన్.రాయ్ రాజకీయతత్వాన్ని ఎం.ఎ.సిలబస్‌లో పెట్టారు. రాజకీయశాస్త్ర విభాగం వారు ఎం.ఎన్.రాయ్ రాజకీయతత్వాన్ని ఎం.ఎ. విద్యార్థులకు బోధించారు.
22 సిద్ధాంతాలపై ఎ.బి.షా పెద్ద చర్చను లేవదీశాడు. రాయ్ రచించిన ఆధునిక విజ్ఞానశాస్త్ర తాత్విక ఫలితాలను ఆధునిక విజ్ఞానశాస్త్రంలో చోటుచేసుకుంచున్న నూతన పరిణామాల ప్రకారం సవరించాలని సూచించారు. షా నడిపిన క్వెస్ట్, న్యూ క్వెస్ట్, సెక్యులరిస్ట్ పత్రికలు తాను ప్రారంభించిన చర్చలు కొనసాగడానికి తోడ్పడ్డాయి. ఆ చర్చలో రాజస్థాన్ నుండి ప్రొఫెసర్ దయాకృష్ణ పాల్గొన్నారు.
రాయ్ సిద్ధాంతాన్ని సరిచూసే ప్రధానమైన పని ఇంకా పెండింగ్‌లోనే వుంది. డా||పుష్పభార్గవ కూడా సిద్ధాంతాలను క్షుణ్ణంగా చర్చించారు. ఆ సిద్ధాంతాలకు మరికొంత మెరుగులు దిద్దడం అవసరమని శిబ్‌రే కూడా సూచించారు.
ఎ.బి.షా ఆంధ్రప్రదేశ్‌లో సెక్యులర్ సొసైటీ శాఖను నెలకొల్పి దాని బాధ్యతను ఇన్నయ్యకు అప్పగించారు. ఆంధ్రలో మేధోపరమైన చర్చలు, సెమినార్లు చాలా జరిగాయి. ఆ సెమినార్లలో విశ్వవిద్యాలయ మేధావులేకాక, హిందూ, ముస్లిం, క్రైస్తవ సంఘాలవారు కూడా పాల్గొన్నారు.
సెక్యులర్ భావాల వ్యాప్తికి ప్రొ||బి.ఎ.వి.శర్మ, వి.కె.సిన్హా , ప్రొ|| ఆలం కుంద్‌మిరి, ప్రొ||కె.శేషాద్రి కృషి చేశారు. షా రచనలలో చాలా వాటిని ఇన్నయ్యకు తెలుగులోకి అనువదించారు.
మత ఫండమెటలిస్టులు ఎ.బి.షా సెక్యులరిస్టులపై దాడి జరిపారు. అయినావారు ఆ దాడిని ఎదుర్కొని నిలబడ్డారు. వి.ఎస్.అవధాని సెక్యులరిస్టు. హ్యూమనిస్టు క్యాంపుల్లో పాల్గొన్నారు. న్యాయమూర్తులు పింగళి జగన్మోహనరెడ్డి, ఎ.గంగాధరరావు, జీవన్‌రెడ్డి, చిన్నప్పరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌లోని సెక్యులరిస్ట్, హ్యూమనిస్టు అధ్యయన తరగతుల్లో పాల్గొని ఉత్సాహపరిచారు. 1982లో ఎ.బి.షా మరణించాక సెక్యులర్‌వాద ఉద్యమం వెనకడుగేసింది.
పంచాయతీరాజ్ వ్యవస్థను అభివృద్ధి చేయడానికై వి.బి.కార్నిక్, లెస్లీ సహానీ సంస్థలో పనిచేశాడు. రాష్ట్రాన్ని సందర్శించి అధ్యయన తరగతులకు ఉత్తేజాన్ని యిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యమంతో నిరంతర పరిచయాన్ని కలిగివున్నాడు. కార్నిక్, ఎం.ఎన్.రాయ్ జీవితచరిత్ర పెద్ద, చిన్న సంపుటాలను నేను తెలుగులోకి అనువదించగా తెలుగు అకాడమీ వాటిని ప్రచురించింది.
డబ్ల్యు.ఎస్.కానే ఆ సంపుటాలను వెలువరించడమేగాక అనేకసార్లు ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించారు.
డా||జి.ఆర్.దల్వి స్ఫూర్తిదాయకమైన ఆర్థికవేత్త. ఆంధ్రరాడికల్స్‌తో అతడు పరిచయాలను బాగా పెంచుకున్నాడు. అతడు ‘అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో పనిచేశాడు. ఆ సమయంలో ప్రముఖ రాడికల్స్‌గా వున్న వి.బి.కార్నిక్, ఎ.బి.షా, నిస్సిమ్ ఎజికల్‌లను హైదరాబాద్‌కు ఆహ్వానించాడు. వారు వచ్చి అనేక ఉపన్యాసాలిస్తూ రాష్ట్రమంతటా పర్యటించారు. ఇదే విధంగా జె.బి.హెచ్. వాడియా, లక్ష్మణ్ శాస్త్రి జోషి కూడా రాష్ట్రాన్ని సందర్శించారు. ప్రేమనాథ్ బజాజ్ కూడా హైదరాబాద్‌తో నిరంతరం సత్సంబంధాలు కొనసాగించారు. ఇందుమతి రాడికల్ హ్యూమనిస్టు సంఘానికి అధ్యక్షురాలిగా వున్నప్పుడు ప్రొ||జయంతి పటేల్ రాష్ట్రంలో పర్యటించారు.
రాడికల్ హ్యూమనిస్టు సంఘానికి అధ్యక్షురాలుగా వున్నప్పుడు ఇందుమతి పరేఖ్ రాష్ట్రంతో సంబంధాలను కొనసాగించింది. భారతమహిళా సంఘానికి ఛైర్మన్ హోదాలో మణిబెన్‌కారా రాష్ట్రాన్ని సందర్శించింది.
రాష్ట్రంలో ఆవుల గోపాలకృష్ణమూర్తి మానవవాద జ్యోతిని చేపట్టి ఉద్యమాన్ని కాపాడటానికి విశేషకృషి చేశాడు. 1967లో ఆయన ఆకస్మిక మరణంతో ఉద్యమానికి చాలా నష్టం వాటిల్లింది. అపుడు ఎం.వి.రామమూర్తి బాధ్యతలను స్వీకరించి, ఉద్యమకార్యకలాపాలను నిర్వహించాడు. తరువాత రావిపూడి వెంకటాద్రి హేతువాద ఉద్యమాన్ని, హేతువాద పత్రికను కొనసాగించారు. ఆ పత్రిక అన్ని సంఘాలకు వారధిగా పనిచేస్తున్నది.
రాడికల్ హ్యూమనిస్టు రచయితలు సృష్టించిన సాహిత్యంతో, అనువాదాలతో, పత్రికలతో తెలుగునాడు సంపన్నంగా వుంది. 1987లో రాష్ట్రంలో ఎం.ఎన్.రాయ్ శతజయంతి ఉత్సవాలు జరిగాయి. రాయ్ గురించి కార్నిక్ రాసినవి, ఇతరులు రాసినవి, వి.బి.కార్నిక్ రాసిన ఎం.ఎన్.రాయ్‌జీవితచరిత్ర అన్నింటిని తెలుగు అకాడమీ ప్రచురించి వెలువరించింది. విజయవాడలో మహాసభ జరిగింది. అందులో రాష్ట్ర విద్యామంత్రిగా వున్న ఇంద్రారెడ్డి, దగ్గుపాటి వెంకటేశ్వరరావు, ప్రొ|| సి.లక్ష్మన్న, రావిపూడి వెంకటాద్రి, నేను పాల్గొన్నాము.
పి.సుబ్బరాజు, వెంకటాద్రితో కలిసి ఆంధ్రప్రదేశ్ మానవవాద, హేతువాద చరిత్ర రాయగా దానిని తెలుగు అకాడమీ వారు ప్రచురించారు. వీరు నేత్రదాన, రక్తదాన కార్యక్రమాల ద్వారా ఉద్యమాలు నిర్వహించారు. సుబ్బరాజు క్త్రైస్తవుల మూఢనమ్మకాలను బట్టబయలు చెయ్యడంలో, పెళ్ళిమంత్రాల అసభ్య పదజాలాన్ని తెలియజెయ్యడంలో విశేష ఆకర్షణ పొందారు.
ఎం.ఎన్.రాయ్ శతజయంతి సంవత్సరంలో అగేహానంద భారతి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోను, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలలోను రాయ్‌పై ఉపన్యాసాలిచ్చారు.
అధ్యయన తరగతులు, సభలు, మ్యాజిక్ ప్రదర్శనలు, రాలీలు నిర్వహించటంలో సోదరసంస్థలు సహకరించాయి. హ్యూమనిస్టు సెంటరును ఏర్పాటు చేయడానికి చేసిన అనేక ప్రయత్నాలు విఫలమైనాయి. వ్యక్తులు మాత్రమే ఇళ్ళ నుండి, కార్యాలయాల నుండి పనిచేస్తున్నారు. చీరాల పట్టణ సమీపంలో వున్న ఇంకొల్లు గ్రామంలో రాడికల్ హ్యూమనిస్టు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన అవసరమైన స్థలాన్ని హ్యూమనిస్ట్ మిత్రుడు రావి సుబ్బారావుగారు ఇచ్చారు. అక్కడ వార్షిక సమావేశాలు, ఇతర సభలూ జరుపుతూ సాహిత్యాన్ని ప్రచురిస్తూ కొద్దిమంది నిబద్ధత కలిగిన హ్యూమనిస్టులు సెంటర్ కోసం పనిచేస్తున్నారు.
జనవిజ్ఞాన వేదిక, మానవ వికాస వేదిక కార్యకలాపాల ద్వారా మానవవాద ఉద్యమానికి సహకరిస్తున్నారు. వీటితోపాటు మలయశ్రీ, భాను ప్రసాద్, ఇంతి వెంకటేశ్వరరావు తమ పత్రికల ద్వారా ఉద్యమానికి సహకరిస్తున్నారు.
తెలుగు విశ్వవిద్యాలయం వారు ఎమ్.ఎన్.రాయ్ రచనలన్నీ ఎన్.ఇన్నయ్య అనువాదాలను తెలుగులో ప్రచురించారు. వి.బి.కర్నిక్ రాసిన ఎమ్.ఎన్.రాయ్ జీవితచరిత్ర కూడా ఎన్.ఇన్నయ్య అనువాదాన్ని వెలువరించారు. అగేహానంద భారతి రాసిన ఉన్నత సప్రదాయం స్వల్ప సంప్రదాయాలు అనే పరిశోధనా గ్రంథాన్ని కూడా ఎన్. ఇన్నయ్య అనువాదం ప్రచురించారు. తెలుగు విశ్వవిద్యాలయం వారు ఎమ్.ఎన్.రాయ్ జీవితచరిత్రను శిబ్ నారాయణ్ రే రాయగా ఆయన తెలుగు అనువాదాన్ని ఎన్. ఇన్నయ్య చేశారు. అది కూడా తెలుగు యూనివర్సిటీ వారు ప్రచురించారు.
నేటి మానవవాద ఉద్యమ స్థితి
ఎనభై సంవత్సరాల తరువాత మానవవాద ఉద్యమం ఆంధ్రప్రదేశ్ లో కొనవూపిరితో కొనసాగుతున్నది. ఆడపదడప తెలుగు ప్రచురణలు వెలువడుతుండగా, హేతువాది మాసపత్రిక రావిపూడి వెంకటాద్రి నాయకత్వాన వెలువడుతున్నది. చీరాల వద్ద ఇంకొల్లు కేంద్రంగా మానవాద కార్యకలాపాలు సాగుతున్నది. ఇంకొల్లు మానవవాద కేంద్రానికి ఇతోధికంగా ఆరమళ్ళ పూర్ణచంద్ర దంపతులు ఆర్థికంగా చేయూతనిచ్చారు. ఎం. సత్యనారాయణ, షేక్ బాబు, కుర్రా హనుమంతరావు తదితరులు యథాశక్తి కేంద్ర కార్యకలాపాలు సాగిస్తున్నారు. 97వ ఏట వెంకటాద్రి యిస్తున్న స్ఫూర్తి బాగా ప్రోత్సాహాన్ని కల్పిస్తున్నది. మానవవాద సాహిత్యం యీ కేంద్రం నుండి వెలువడుతున్నది. గుమ్మా వీరన్న యిందుకు తగినంతగా రచనలు అందిస్తున్నారు.
గోగినేని బాబు మానవవాదిగా అంతర్జాతీయ రంగంలో పనిచేసి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్నెట్ ద్వారా కొందరు యువతకు మానవవాదాన్ని శాస్త్రీయ పద్ధతిలో చెపుతున్నారు. వీరి శ్రీమతి సహన అఖిలభారత రాడికల్ హ్యూమనిస్టు సభలలో పాల్గొన్నారు.
మానవవాదానికి చేరువగా వున్న వ్యక్తులు సంస్థలు పరిమితంగానైనా ప్రజలలో వైజ్ఞానిక దృక్పథాన్ని ప్రచారం చేస్తుండడం గమనార్హం. ఈ విషయంలో నార్నె వెంకటసుబ్బయ్య కృషి బాగా సాగుతున్నది. నిర్మాణరంగంలో పి.ఎస్.రాజు కార్యక్రమాలు చేసి ఆదర్శప్రాయులయ్యారు.
జనవిజ్ఞానవేదిక మానవ వికాసవేదిక అటు పత్రికల ద్వారా యిటు ప్రసార మాధ్యమాలతో ప్రజలలో వైజ్ఞానిక చింతనకు ప్రయత్నిస్తున్నారు.
ఉద్యమంలో భావసారూప్యరీత్యా తోడ్పడుతున్న వారిలో వెనిగళ్ళ వెంకటరత్నం, సి.భాస్కరరావు, రమణ, ఇసనాక మురళీధర్, నర్రాకోటయ్య చెప్పదగినవారు. రావెల సోమయ్య ఆది నుండీ ఉద్యమానికి భిన్నరీతులలో ఆదుకున్నారు. ప్రస్తుతం హ్యూమనిస్ట్ రచనలు, పత్రికలు వెబ్ సైట్ లో వారి కుమారుడు అందిస్తున్నారు. ములుగు చంద్రశేఖర్ కార్యకర్తగా అండగా నిలిచారు.
పుట్టా సురేంద్ర సత్యాన్వేషణ సంస్థద్వారా ఉద్యమానికి బాగా తోడ్పతున్నారు. గవిని వెంకటస్వామి హ్యూమనిస్ట్ ఉద్యమంతో బాగా కలసి వచ్చి, సిద్ధాంత రచనలు చేశారు.
విజయవాడ కేంద్రంగా నాస్తిక సెంటర్ ద్వారా అనేకరీతులుగా మానవవాద ఉద్యమంతో కలసి వచ్చినవారుగా గోరా, విజయం, లవణం, సమరం, మైత్రి, కుటుంబసభ్యులందరూ కృషిచేస్తున్నారు.
రావూరి అర్జునరావు 103వ ఏటకూడా హేతువాదిగా మానవవాదిగా ప్రోత్సాహాన్నిస్తున్నారు.
మానవవాదిగా స్ఫూర్తినిస్తూ ఉద్యమానికి దశాబ్దాలుగా తోడ్పడుతున్న వ్యక్తి మండవ శ్రీరామమూర్తి జాస్తి జవహర్లాల్ అమెరికా నుండీ భారతదేశంలో తన రచనలతో మానవవాద ఉద్యమస్ఫూర్తికారులయ్యారు.
ఏతావాతా చూస్తే మానవవాద ఉద్యమం పెరగ లేదు. విద్యారంగంలో దీని ప్రభావం బాగా తక్కువ. చరిత్రలో భాగంగా నిలుస్తుంది.
నవ్య మానవవాద ఉద్యమ చరిత్రను రాయాల్సివుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఉద్యమం నడిచిన విధానానికి ఒక రూపు ఇవ్వడానికి జరిగిన ప్రయత్నమే ఈ రచన. ఇదేవిధంగా ప్రతిరాష్ట్రంలో జరిగిన ఉద్యమ చరిత్రను జోడిస్తే భారతదేశ మానవవాద ఉద్యమ చరిత్రను అందజేయడానికి వీలు కలుగుతుంది.
##################