కరోనా కట్టడికి సరైన ప్రణాళికలతో ముందుకెళ్లకపోతే మరింత భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికాకు రోగ నిరోధక శాస్త్ర నిపుణుడు డాక్టర్ రిక్ బ్రైట్ హితవు పలికారు. వైరస్ మళ్లీ విజృంభిస్తే, ఆధునిక చరిత్రలో అత్యంత అంధకార శీతాకాలాన్ని అగ్రరాజ్యం ఈ ఏడాది ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కొవిడ్ ముప్పుపై ప్రతినిధుల సభ కమిటీకి సమర్పించేందుకు రూపొందించిన నివేదికలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన గతంలో ‘బయోమెడికల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్, డెవలప్మెంట్ అథారిటీ’ అధినేతగా పనిచేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ ట్రంప్ ప్రభుత్వాన్ని హెచ్చరించినందుకుగాను ఇటీవల తనను ఉద్యోగం నుంచి తప్పించారని ఆయన ఆరోపించారు. వైరస్ నియంత్రణకు జాతీయ స్థాయిలో సమన్వయంతో పనిచేయకపోతే.. మహమ్మారి మరింత తీవ్రరూపం దాల్చుతుందని బ్రైట్ తన నివేదికలో పేర్కొన్నారు. ఫలితంగా మునుపెన్నడూ ఊహించనంత భారీ స్థాయిలో మరణాలు, కేసులు నమోదవుతాయని అన్నారు. సీజనల్ ఇన్‌ఫ్లుయెంజాతో కలిసి వైరస్ విజృంభిస్తే ఆరోగ్యరంగ వ్యవస్థపై అసాధారణ స్థాయిలో భారం పడుతుందన్నారు.
ఈ శీతాకాలం అమెరికాను వణికించనున్న కరోనా
Related tags :