Agriculture

3కోట్ల మంది రైతులకు లబ్ధి

Nirmala Seetharaman Speaks Of Corona Packages And Agriculture

లాక్​డౌన్ కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థ కోలుకునే విధంగా అన్ని రంగాలకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తోంది కేంద్రం. ఇందులో భాగంగా చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం కలిగేలా పలు ఉద్దీపన చర్యలు ప్రకటించింది. ఆర్థిక వనరులు లేక ఇబ్బంది పడుతున్న రైతులకు పెట్టుబడి కోసం నాబార్డు ద్వారా అదనపు రుణ సాయం అందించనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. చిన్న, సన్నకారు రైతులు సరైన ఆర్థిక వనరులు లేక ఇబ్బంది పడుతున్నారని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వారందరికీ కేంద్రం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రెండున్నర కోట్ల మంది రైతులకు.. రూ.2 లక్షల కోట్ల అదనపు రుణాలు అందించనున్నట్లు తెలిపారు. పశు పోషకులు, మత్స్యకారులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయనున్నట్లు స్పష్టం చేశారు. రైతులకు చేయుతనిచ్చేలా నాబార్డు ద్వారా అత్యవసర వర్కింగ్ క్యాపిటల్ కింద రూ.30 వేల కోట్ల అదనపు రుణ సాయం చేయనున్నట్లు తెలిపారు ఆర్థికమంత్రి. నాబార్డు ద్వారా వ్యవసాయానికి కేటాయించిన రూ.90 వేల కోట్లకు ఇది అదనం అని వెల్లడించారు. రబీ పంట కోత అనంతర కార్యక్రమాలు సహా ఖరీఫ్‌ ముందస్తు ఏర్పాట్లకు ఈ నిధులు ఉపయోగపడతాయని చెప్పారు నిర్మల. దీని ద్వారా 3 కోట్ల మంది రైతులకు అదనపు ప్రయోజనం కలుగుతుందని స్పష్టం చేశారు. గ్రామీణ సహకార బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంకులు ద్వారా రైతులు ఈ పంట రుణాలు తీసుకోవచ్చని తెలిపారు.