* గృహ రుణాలు తీసుకున్న మధ్యతరగతికి ఈ కరోనా కాలంలో కేంద్రం ఊరట కల్పించింది. గృహ నిర్మాణ రంగాన్ని బలోపేతం చేసేందుకు గృహ, నిర్మాణ రంగాలకు రూ.70వేల కోట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా మే 2017 నుంచి అమలులో ఉన్న మధ్య ఆదాయ వర్గాలకు గృహ రుణాలపై వడ్డీ రాయితీ పథకాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 31 వరకు ఉన్న ఈ పథకంతో 3.3లక్షల మంది లబ్ధి పొందుతుండగా.. దీన్ని 2021 మార్చి 31వరకు పొడిగించడంతో అదనంగా మరో 2.5లక్షల మంది మధ్యతరగతి ప్రజలకు లబ్దిచేకూరనుంది. రూ.6లక్షల నుంచి 18లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి ఈ వడ్డీ రాయితీ పథకం వర్తిస్తుందని ఆమె తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీ -2 వివరాలను ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ‘‘దేశంలో దాదాపు 50లక్షల మంది వీధి వ్యాపారులకు రూ.5వేల కోట్ల రుణ సాయం చేస్తాం. ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున వర్కింగ్ క్యాపిటల్ కింద రుణం మంజూరుచేస్తాం. నెల రోజుల్లో రుణ సదుపాయం అందుబాటులోకి తెస్తాం. చిన్న వ్యాపారులు బ్యాంకుల ద్వారా లావాదేవీలు జరిపితే మరింత రుణానికి అవకాశం. వారి వ్యాపారాన్ని బట్టి బ్యాంకులు మరింత రుణం ఇచ్చే అవకాశం ఉంటుంది’’ అని తెలిపారు.
* కరోనా మహమ్మారిపై యావత్ దేశం పోరాడుతున్న వేళ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వేతనాన్ని ఏడాది పాటు 30 శాతం తగ్గించుకున్నారు. దీంతో పాటు రాష్ట్రపతి భవన్‌లో పొదుపు చర్యలను పాటించాల్సిందిగా ఆదేశించారు. దీని ద్వారా సమకూరిన మొత్తాన్ని కొవిడ్-19పై పోరుకు వినియోగించాలని నిర్ణయించినట్లు రాష్ట్రపతి భవన్ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
* కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే క్రమంలో భాగంగా దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మూడోసారి ప్రకటించిన లాక్‌డౌన్ మే 17వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో జూన్ 30వ తేదీ వరకూ బుక్ చేసుకున్న అన్ని రైల్వే టికెట్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. జూన్ 30వ తేదీలోగా ప్రయాణించడానికి వీలుగా మార్చి 25వ తేదీ కన్నా ముందు బుక్ చేసుకున్న టికెట్లన్నీ రద్దు అవుతాయని తెలిపింది. టికెట్ల సొమ్ము తిరిగి ప్రయాణికుల ఖాతాల్లో జమ అవుతుందని వెల్లడించింది.
* ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. జులై 10 నుంచి పరీక్షలను నిర్వహించనున్నట్టు ఎస్‌ఎస్‌సీ బోర్డు ప్రకటించింది. అయితే ఈసారి పదో తరగతి పరీక్షల్లో పలు కీలక మార్పులు చేసింది. ప్రతి సబ్జెక్ట్‌కు ఒక్కో పేపర్ మాత్రమే పరీక్ష నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది. గతంలో నిర్వహించిన మొత్తం 11 పేపర్లను ఈసారి 6 పేపర్లకు కుదించినట్లు ఎస్‌ఎస్‌సీ బోర్డు వెల్లడించింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని బోర్డు తెలిపింది. జులై 10న ఫస్ట్ లాంగ్వేజ్, 11న సెకండ్ లాంగ్వేజ్, 12న థర్జ్ లాంగ్వేజ్, 13న గణితం, 14న సామాన్య శాస్త్రం, 15న సాంఘిక శాస్త్రం పరీక్షలు జరుగుతాయని ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు ప్రకటించింది. మార్చి నెలాఖరులో జరగాల్సిన ఈ పరీక్షలు కరోనా ప్రభావంతో వాయిదా పడిన విషయం తెలిసిందే.
* భవన నిర్మాణ అనుమతుల్లో పారదర్శకతే లక్ష్యంగా జూన్ మొదటి వారంలో రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో టీఎస్ బీపాస్ విధానాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఎస్ బీపాస్ కార్యక్రమంపై పురపాలక, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని 87 మున్సిపాలిటీల్లో ఈ విధానాన్ని ఇప్పటికే ప్రవేశపెట్టామన్నారు. ఈ మేరకు వచ్చిన దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోందని.. కొన్నింటికి ఇప్పటికే అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. సుమారు 1,100 దరఖాస్తులు వచ్చాయని.. సాఫ్ట్‌వేర్ ఆధారిత వ్యవస్థకు సంబంధించి వచ్చిన సమాచారం ఆధారంగా రానున్న 15 రోజుల్లో ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు కేటీఆర్ వివరించారు. జూన్ మొదటి వారంలో రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో టీఎస్ బీపాస్ విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు కేటీఆర్ ఆదేశించారు. ఇందుకోసం సంబంధిత సిబ్బందికి ఇవ్వాల్సిన శిక్షణ, అవగాహన కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాలని సూచించారు.
* ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ‘బిల్డ్ ఏపీ’ పేరుతో కొత్త పథకానికి వైకాపా ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం అమలుపై తెదేపా నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ మేరకు పలువురు నేతలు ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఆస్తులన్నీ అమ్మేసి ఏపీని చంపేస్తూ దానికి సీఎం జగన్ మిషన్ ‘బిల్డ్ ఏపీ’ పేరు పెట్టారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ఈ కార్యక్రమం పేరు ‘మిషన్ బిల్డ్ ఏపీ’ కాదని ‘జగన్ కిల్డ్ ఏపీ’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి జగన్ ఉన్మాది కొడుకులా వ్యవహరిస్తున్నారని లోకేశ్ దుయ్యబట్టారు.
* పోతిరెడ్డిపాడుపై కాంగ్రెస్, భాజపా నేతల వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని రాష్ట్ర పర్యాటక, అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే ప్రాజెక్టుకు పునాది పడిందని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. ‘‘ప్రాజెక్టుకు పునాది పడినప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎందుకు నోరు మెదపలేదు. అప్పుడు ప్రాజెక్టు వద్దకు వెళ్లి టెంకాయలు కొట్టి, హారతులిచ్చారు. అలాంటి వారు ఇప్పుడు తెరాస ప్రభుత్వ పాలనపై విమర్శలు చేస్తున్నారు. తెరాస పార్టీ పుట్టిందే నీళ్ల గురించి పుట్టింది. తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు ఇదే పోతిరెడ్డిపాడు విషయంలో పదవులకు రాజీనామా చేసిన చరిత్ర తెరాసది. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కేసీఆర్ కుమ్మక్కయ్యారని మాట్లాడుతున్నారు. కుమ్మక్కై ఉంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చేదా?’’ అని ప్రతిపక్ష నేతలపై శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
* పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచుతూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ…పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచితే కృష్ణా నదిపై ఆధారపడిన రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఏపీ వాటా జలాలే తీసుకెళ్తామని జగన్ చెబుతున్నారు.. సామర్థ్యం పెంచితే ఎన్నినీళ్లు తీసుకెళ్లారనేది ఎవరు లెక్కిస్తారని నిలదీశారు.
* ఎండాకాలంలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుందా? తేమ తగ్గిన వేడి వాతావరణంలో వైరస్ ప్రభావం తగ్గుతుందా? అంటే ఒక్కో అధ్యయనంలో ఒక్కో ఫలితం వస్తోంది. స్థూలంగా ఎక్కువసార్లు వేసవికి, కరోనాకు సంబంధమే లేదని కొందరి వాదన. టొరంటో విశ్వవిద్యాలయం పరిశోధకులూ ఇదే మాట చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ చాలా దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతోందని అధ్యయనానికి నేతృత్వం వహించిన పీటర్ జుని అంటున్నారు.