దేశవాళీ క్రికెట్లో సంస్కరణలు లేకపోవడంతో పాకిస్థాన్ క్రికెట్ తీసికట్టుగా మారిపోయిందని ఆ జట్టు మాజీ పేసర్ వసీమ్ అక్రమ్ అన్నాడు. భారత్ ఈ విషయంలో ఎంతో మెరుగ్గా ఉందని పేర్కొన్నాడు. చెల్లింపు విధానంలో మార్పులు, స్థానిక టోర్నీల్లో నాణ్యతను పెంచడంతో టీమ్‌ఇండియా రోజురోజుకీ పటిష్ఠంగా మారుతోందని వెల్లడించాడు.
‘పాక్ క్రికెట్ బోర్డులోకి ఎవరొచ్చినా స్వల్పకాలిక లక్ష్యాలే పెట్టుకుంటున్నారు. దేశవాళీ క్రికెట్‌ను పట్టించుకోలేదు. 30 ఏళ్లుగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఎలాంటి మార్పుల్లేవు. పాక్ క్రికెట్ దిగజారిపోవడానికి కారణమదే. ఇప్పుడు మార్పు చోటు చేసుకున్నా ఫలితాలు కనిపించేందుకు నాలుగైదేళ్లు పడుతుంది’ అని అక్రమ్ పేర్కొన్నాడు.
‘భారత్ ఈ విషయంలో మెరుగ్గా ఉంది. ఐపీఎల్ ద్వారా వచ్చిన డబ్బును హృదయపూర్వకంగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌పై పెట్టుబడి పెట్టింది. దేశవాళీ క్రికెట్‌ను సంపూర్ణంగా మార్చేసింది. ప్రపంచంలోనే అత్యంత ప్రొఫెషనల్స్, అత్యుత్తమ ఫిజియోలు, శిక్షకులను తీసుకొచ్చింది. మాజీ క్రికెటర్లూ మంచి కోచ్‌లుగా మారారు. మరికొందరు కోచ్‌లుగా ఉద్యోగాలు సంపాదించుకున్నారు. భారత్, పాక్‌కు అదే తేడా’ అని అక్రమ్ వెల్లడించాడు.