Health

కోతులపై కరోనా టీకా సక్సెస్

COVID19 Vaccine Tests On Monkeys Are Successful

కొవిడ్‌-19 నుంచి రక్షణ కోసం ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం రూపొందిస్తున్న టీకా మందు ఆశలు రేపుతోంది. కోతులపై చేసిన చిన్న పరిశోధనలో తేలిన ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ChAdOx1 nCoV-19 వ్యాక్సిన్‌ ఇవ్వడం వల్ల ప్రాణాంతక వైరస్‌ను కోతుల్లోని రోగనిరోధక శక్తి అడ్డుకుందని పరిశోధకులు తెలిపారు. ప్రతికూల ప్రభావాలేమీ కనిపించలేదని వెల్లడించారు.

ఒక వ్యాక్సిన్‌ డోసే ఊపిరితిత్తులు దెబ్బతినకుండా అడ్డుకుందని, ఇతర అవయవాలపై వైరస్‌ తీవ్రత తగ్గించిందని పరిశోధకులు తెలిపారు. ‘వానరాలకు మేం ఒక డోసు వ్యాక్సిన్‌ ఇచ్చాం. మిగతా కోతులతో పోలిస్తే వ్యాక్సిన్‌ తీసుకున్న వాటిలో ఊపిరితిత్తుల్లో ద్రవం తగ్గడం, శ్వాసనాళంలోని కణజాలం వైరస్‌ను అడ్డుకోవడాన్ని మేం గమనించాం. వైరస్‌ తాలూకు న్యుమోనియా సైతం కనిపించలేదు’ అని ఆక్స్‌ఫర్డ్‌ పరిశోధకులు తెలిపారు.

అతి ప్రమాదకర స్థాయి నావెల్‌ కరోనా వైరస్‌కు గురిచేసినప్పటికీ వ్యాక్సిన్‌ తీసుకున్న ఆరు కోతుల్లో న్యుమోనియా లక్షణాలు, దుష్ప్రభావం కనిపించలేదని వెల్లడించారు. ఫలితాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ మానవుల్లో వ్యాక్సిన్‌ ప్రభావం ఎలా ఉంటుందో, ఎంత సమర్థంగా పనిచేస్తుందో తెలియాల్సి ఉందని నిపుణులు అంటున్నారు. ‘ప్రస్తుతం మనుషులపై జరుగుతున్న క్లినికల్‌ ట్రయల్స్‌కు ఈ ఫలితాలు మద్దతుగా నిలుస్తున్నాయి. మనుషులపై ఫలితాలు రావాల్సి ఉంది’ అని కింగ్స్‌ కాలేజ్ లండన్‌లో విజిటింగ్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ పెన్నీ వార్డ్‌ అన్నారు.

వ్యాక్సిన్‌పై తనకు పూర్తి విశ్వాసం ఉందని ఆక్స్‌ఫర్డ్‌ జెన్నర్‌ ఇన్‌స్టిట్యూట్‌ వ్యాక్సినాలజీ ప్రొఫెసర్‌ సారా గిల్‌బర్ట్‌ అంటున్నారు. ‘నిజమే, మానవులపై పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. కరోనా వైరస్‌ సోకకుండా అందరికీ వ్యాక్సినేషన్‌ చేయకముందే పనితీరు తెలియాలి’ అని ఆమె పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ విజయవంతమైతే ఏడాది చివరికల్లా 100 మిలియన్‌ డోసులు ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని బ్రిటిష్ డ్రగ్‌ కంపెనీ అస్త్రాజెనికా వెల్లడించిన సంగతి తెలిసిందే.

బ్రిటన్‌లో టీకా ట్రయల్స్‌ విజయవంతమైతే కెన్యాలో ట్రయల్స్‌ నిర్వహించేందుకు అనుమతి కోరాలని ఆక్స్‌ఫర్డ్‌ భావిస్తోంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు టీకా అవసరం ఎక్కువగా ఉందని తెలిపింది. ప్రస్తుతం బ్రిటన్‌లో 2,34,441 మందికి వైరస్‌ సోకగా 33,693 మంది మరణించారు.