ScienceAndTech

గూగుల్ పేపై కేసు

Delhi Man Files Case Against Google Pay

గూగుల్‌ పే యూపీఐ సేవలను నిలిపివేయాలని దాఖలైన పిటిషన్‌కు సంబంధించి ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, గూగుల్‌ ఇండియా డిజిటల్‌ సర్వీసెస్‌ ప్రవేట్‌ లిమిటెడ్‌కు నోటీసులు జారీచేసింది. కేంద్రం, ఆర్‌బీఐ మార్గదర్శకాలను గూగుల్‌ యూపీఐ ఉద్దేశపూర్వకంగానే పాటించడంలేదని ఆరోపిస్తూ శుభమ్‌ కపాలే అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. గూగుల్‌ ఇండియా డిజిటల్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై తక్షణమే చర్యలు తీసకోనేలా కేంద్రం, ఆర్‌బీఐని ఆదేశించాలని పిటిషనర్‌ విజ్ఞప్తి చేశారు.

అలాగే గూగుల్‌ పే ఇండియా యాజమాన్యంపై భారీ జరిమానా విధించాలని కోరారు. సరైన మార్గదర్శకాలు పాటించే వరకు గూగుల్‌ పే యాప్‌ ద్వారా యూపీఐ సేవలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఆర్‌బీఐ ఆదేశాలకు అనుగుణంగా గూగుల్‌ పే యాప్‌ పనిచేస్తుందో, లేదో తెలుసుకోవడానికి స్వతంత్ర విచారణ జరిపించాలని కూడా కోరారు. తాజాగా ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు.. రిప్లై పిటిషన్‌ దాఖలు చేయాలని కేంద్రం, ఆర్‌బీఐ, గూగుల్‌ పే ఇండియాను కోరింది. గూగుల్‌ ఇండియా డిజిటల్‌ సర్వీసెస్‌ తరఫున నోటీసులు స్వీకరించిన లాయర్‌ అఖిల్‌ ఆనంద్‌.. రిప్లై పిటిషన్‌ దాఖలు చేసేందకు మూడు వారాల గడువు కోరారు.