Politics

వలసకూలీలపై విరిగిన ఏపీ పోలీసు లాఠీ

AP Police Lathi Charge On Migrant Labor In Vijayawada

వలసకూలీలపై మరోసారి లాఠీ విరిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో శనివారం ఉదయం పోలీసులు లాఠీఛార్జి చేయడంతో కూలీలు భయంతో పరుగులు తీశారు.

వివరాల్లోకి వెళితే… ఈనెల 15వ తేదీ సాయంత్రం రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న కూలీలను అటుగా వెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గమనించి వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం వారిని పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడి నుంచి స్వస్థలాలకు పంపించాలని అధికారులను ఆదేశించారు.

దీంతో రహదారిపై వెళ్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, ఝార్ఖండ్‌, ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వెయ్యి మంది వలస కూలీలను తాడేపల్లిలోని విజయవాడ క్లబ్‌కు తరలించారు.

వీరిలో కొంతమంది కాలినడకన వెళ్లేవారు, మరికొందరు సైకిళ్లపై వెళ్లేవారు ఉన్నారు.

ఈరోజు ఉదయం పునరావాస కేంద్రంలో అల్పాహారం పంపిణీ చేస్తున్న క్రమంలో సైకిళ్లపై వచ్చిన కూలీలు కొందరు తిరుగు ప్రయాణమయ్యారు.

సుమారు 150 మంది కూలీలు విజయవాడ కనకదుర్గమ్మ వారధి వద్దకు చేరుకోగానే పోలీసులు గుర్తించి అడ్డుకున్నారు.

ఈక్రమంలో పోలీసులు లాఠీఛార్జి చేయడంతో కూలీలు భయంతో పరుగులు తీశారు.

అనంతరం వారందరినీ విజయవాడ క్లబ్‌కు తీసుకొచ్చి వివరాలు నమోదు చేసుకుంటున్నారు.