Devotional

సర్వోత్తముణ్ణి మహోత్తమంగా సేవించిన జీవోత్తముడు

Hanuman Jayanthi 2020 Special Story

కారణజన్ముల పుట్టుకకు కారణాలు చాలా ఉంటాయి. పుట్టిన రోజు సంబరంతోపాటు సాధించిన విజయాలను గుర్తు చేసుకోవడం ఈ సందర్భంలో చాలా అవసరం. హనుమజ్జయంతి ఉత్సవాలు దేశవిదేశాల్లో ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఉత్తరాదిన చైత్ర వైశాఖాలలో, దక్షిణాదిన ధనుర్మాసంలో జయంత్యుత్సవాలు జరుగుతుంటాయి. నేపాల్‌లోనూ సంప్రదాయసిద్ధంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించడం విశేషం. వాతాత్మజుడు- ఒక అప్సరసకు వాయుదేవుడి వరం వల్ల జన్మించాడని, శాపవశాత్తు ఆమె కుంజరుడనే వానరుడికి కూతురిగా పుట్టిందని చెబుతారు. పన్నెండేళ్లు శివుడిని ఆరాధించడం వల్ల శాప విమోచనం పొందినట్లు కథనం ఉంది. ఆ అప్సరసే కుంజరుడి ఇంట అంజనగా వెలసి బృహస్పతి కొడుకు కేసరిని పెళ్లాడింది. సూర్యోదయాన అంజనీదేవి గర్భాన ఆంజనేయుడు పుట్టాడు. ఉదయ సూర్యుణ్ని పట్టుకోబోయి, ఇంద్రుడి వజ్రాయుధానికి గురయ్యాడు. వజ్రఘాతానికి దవడ గురికావడంవల్ల ఆంజనేయుడికి హనుమ అన్న పేరు వచ్చిందంటారు. హనుమ అంటే మనసును హననం చేసినవాడని చెప్పుకోవచ్చు. మనోజయంవల్లే మనోజవంతో నూరు యోజనాల సముద్రాన్ని దాటగలిగాడు. లంకలో సీతను అన్వేషించి రాముడికి శుభవార్త అందించాడు. లంకను దహించి లంకేశ్వరుడికి రాబోయే విపత్తును ఎరుక చేశాడు.

రాముడికి సీతాదేవి చూడామణిని సమర్పించి రాక్షస సంహారానికి ఉసిగొలిపాడు. సుగ్రీవుడి ఆజ్ఞను శిరసావహించి రామకార్యాన్ని విజయవంతంగా సాధించాడు. ఆధ్యాత్మికంగా అంజనీపుత్రుడు మరో ఘనవిజయం సాధించాడని అన్వయిస్తారు. సర్వోత్తముడైన శ్రీహరిని సేవించడానికి జీవోత్తముడుగా అవతరించి, ఆత్మస్వరూపిణి అయిన జనకాత్మజ పరమాత్మల అనుసంధాన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. చిరంజీవి సంజీవరాయుడు ద్వాపరయుగంలోనూ తన దైవానికి సాయం చేశాడు. గంధమాదన పర్వతానికి బయలుదేరిన కుంతీమధ్యముడైన భీమసేనుడికి కనిపించాడు. తమ్ముడి కోరిక మేరకు పాండవ మధ్యముడైన అర్జునుడి రథం మీద జండాపై కపిరాజై కొలువుతీరాడు. రామదాసుగా భక్తుల హృదయసీమలను పండించాడు. ‘గోష్పదీకృతవారాశిం’ అని మొదలుపెట్టి ‘బాష్పవారి పరిపూర్ణలోచనం’తో ముగించి, హనుమాను గురుదేవులతో పాటు భక్తులూ కన్నీటిపర్యంతం అవుతూఉంటారు. ఆంజనేయుడి పేరు వినిపించగానే భయం తొలగి ధైర్యం రాజ్యమేలుతుంది. భూతప్రేత పిశాచాలు ఆ పేరు వినగానే పలాయనం చిత్తగిస్తాయని భక్తుల విశ్వాసం.

హనుమజ్జయంతి రోజు సూర్యోదయం మొదలు పూజలు, పునస్కారాలు, అర్చనలు, ఆరాధనలు, కీర్తనలు, ప్రార్థనలు మందిరాల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. తెలుగురాష్ట్రాల్లో కసాపురం, పొన్నూరు, కర్నూలు, బీచుపల్లి, భాగ్యనగరాల్లో ప్రసిద్ధమైన ఆంజనేయ స్వామి దేవాలయాలున్నాయి. హనుమంతులవారి భక్తిమార్గంలో ఎందరో మహానుభావులు రామచంద్రుడిని కీర్తించి ముక్తులయ్యారు. త్యాగయ్య సంగీతసేవ, రామదాసు కరసేవ, కబీరు కవన సేవ, సంగీత సాహిత్యత్రయం భావుకుల హృదయాల్లో చెరగని ముద్రలు వేశాయి. శ్రీమద్భాగవతాన్ని పోతన- రామచంద్రుడికి అంకితం చేయడం ఆయన రామభక్తికి ప్రబలమైన నిదర్శనం. రాముని మించిన ప్రభువు, హనుమను మించిన బంటు, సీతమ్మను మించిన భార్య, ఇలలో గాని, కలలో గాని లేరనే చెప్పాలి. సీతాంజనేయ సమేతమైన రామావతారం మానవ సమాజానికి ఆదర్శప్రాయం.