ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారికి కేంద్రబిందువైన చైనాలో తాజాగా వైరస్ తీవ్రత గణనీయంగా తగ్గింది. ఈ సమయంలో భారత్‌లో మాత్రం ఈ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. తాజాగా నిన్న ఒక్కరోజే దేశంలో 3970 పాజిటివ్ కేసులు నమోదుకావడంతో కరోనా కేసుల సంఖ్యలో భారత్.. చైనాను దాటేసింది. ప్రస్తుతం చైనాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 82,900కే పరిమితం కాగా భారత్‌లో మాత్రం 85,940కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదైన దేశాల్లో భారత్ 11వ స్థానానికి ఎగబాకగా..చైనా 13వ స్థానంలో నిలిచింది. అయితే వైరస్ కారణంగా సంభవించిన మరణాల్లో మాత్రం చైనా కంటే తక్కువగా ఉండటం కాస్త ఊరటనిచ్చే విషయం. భారత్‌లో ఇప్పటివరకు కొవిడ్ సోకి 2753మంది మరణించగా..చైనాలో 4633మంది ప్రాణాలు కోల్పోయారు. గత సంవత్సరం డిసెంబరు నెలలో బయటపడిందని బావిస్తోన్న కరోనా వైరస్ చైనాలో విలయతాండవం చేసింది. తక్కువ సమయంలోనే వుహాన్ నగరాన్ని అతలాకుతలం చేసి వేల సంఖ్యలో బాధితులుగా మార్చింది. ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో ఊహించని విధంగా విజృంభించింది. అక్కడ ప్రతిరోజు సరాసరి 2400పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇలా మార్చి మొదటివారానికే చైనాలో 80వేల కేసుల మార్కును దాటింది. మార్చి చివరినాటికి మాత్రం పాజిటివ్ కేసులు పదుల సంఖ్యకు పడిపోయాయి. ఆ సమయంలో(మార్చి రెండో వారం) ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 విజృంభించడం ప్రారంభించింది. అప్పుడు భారత్‌లో ఈ కేసుల సంఖ్య దాదాపు 100 మాత్రమే. ఇలా చైనాతో పోల్చుకుంటే 80వేలు దాటడానికి భారత్‌కి దాదాపు రెండు నెలల సమయం పట్టింది.
చైనా కేసుల కన్నా భారత్‌వి ఎక్కువ
Related tags :