సర్ ఆర్థర్ కాటన్ గారు
ఎందరో మహానుభావుల జీవితములు మనకు మార్గదర్శనములు, నిరంతర స్ఫూర్తిదాయకములు. అటువంటి మహానుభావులలో ఒకరైన సర్ ఆర్థర్ కాటన్ గారి జయంతి సందర్భముగా వారి కృషి, దీక్ష, మానవత్వము గురించిన కొన్ని విశేషములు పూజ్య గురువులు బ్రహ్మశ్రీ డా||చాగంటి కోటేశ్వర రావు గారి మాటలలో…
సర్ ఆర్థర్ కాటన్ ఒకప్పుడు బర్మా నుంచి సముద్రం మీద వచ్చేస్తున్నారు. చీకటి పడింది, చల్లటి గాలి వేస్తోంది. ఆ ఓడ యొక్క పై భాగం మీదకి ఎక్కి కూర్చున్నారు. కూర్చుని ఆకాశం వంక చూస్తున్నారు. ఆకాసంలో నక్షత్రాలు మిణుకు మిణుకుమని మెరుస్తున్నాయి, మధ్యలో చంద్రబింబం వెలుగుతోంది. ఆయనకు ఆకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది – “నేను ఒక చిన్న ఆనకట్ట కడితేనే చాలా గొప్ప అనుకుంటానే, అలాంటిది ఇన్ని నక్షత్రాలు, చంద్రుడు, నదులు, సముద్రాలు, మన శరీరము, బుద్ది ఇన్నిటిని సృష్టించిన పరమేశ్వరుడికి మనము ఏమివ్వగాలము? ఆయన సంతోషించేలా బ్రతకాలి…భగవంతుడు సంతోషించేలా బ్రతకడమంటే మనిషిలా బ్రతకడమే. అంటే నా కోసము, నా సంతోషము కోసము మాత్రమే బ్రతుకకుండా, ఎవరు కష్టంలో ఉన్నా ఆదుకోవటానికి నేను వెళ్ళటమే…” అంతే, అది కాటన్ జీవితాన్ని మార్చేసింది. గబగబా ఓడ క్రిందకు వెళ్లి, తన మత పవిత్ర గంథాన్ని తీసుకుని చదువుకున్నారు. ఇక అక్కడనుంచి కాటన్ జీవితాన్ని చూస్తే, ఎక్కడ ఎవరు ఆపదలో ఉంటె అక్కడకు వెళ్ళేవారు.
ఒకప్పుడు విశాఖపట్నంలో కాటన్ తిరుగుతున్నారు. తుఫాను వాతావరణం. కొబ్బరి బొండాలు, అరటిపళ్ళ గెలలతో ఒక మాదిరి ఓడ అక్కడకు వచ్చింది. కొంత మంది దొంగలు ఒక గుంపుగా ఆ ఓడ చుట్టూ చేరి కర్రలు పట్టుకుని కేరింతలు కొడుతూ ఆ ఓడలోని వారిని అదిలిస్తున్నారు. ఆ చిన్న ఓడ కెరటాలకు, రాళ్ళకు కొట్టుకుని బద్దలైపోతే, అందులో ఉన్న మనుషులు చల్లా చదర అయ్యిపోతే, ఆ కొబ్బరి బొండాలు, అరటిపళ్ళు దోంగాలించచ్చు అని వాళ్ళ ఆలోచన. ఇంత పశుత్వముతో సాటి మనుషులు ఒడ్డున దిగటానికి లేక భయపడుతుంటే, వాళ్ళని కర్రలతో అదిలించి, బొండాలు, పళ్ళు ఎత్తుకుపోవటానికి చూస్తున్నారు…ఈరోజు వీళ్ళని నియంత్రించి, ఓడలోని వారికి సహాయము చేసి భగవంతుడు సంతోషించేలా జీవిస్తాను అని అనుకుని, కాటన్ ఒక దుడ్డు కర్రతో ఒక్కడే వాళ్ళందరిని అదిలించటం మొదలు పెట్టారు. ఒడ్డున ఒక మనిషి ఆసరా దొరకటముతో ఓడలోని వారంతా కూడా ధైర్యము గా కేకలు వేసి ఆ దొంగలని అదిలించి, వాళ్ళని అక్కడనుంచి పారిపోయేలా చేసారు. ఓడలోని వారంతా కాటన్ ని అభినందించి, కృతఙ్ఞతలు తెలిపినా తాను పొంగిపోకుండా, భగవంతుడు సంతోషించేలా జీవించానని ఆనందించారు.
ఆ తరువాతి కాలంలో ఈ దేశములోని రైతులు సంతోషించాలని ఆయాన పొందిన పరివేదన, ఆనక్కట్టలు కట్టటానికి పడిన కష్టము అనన్య సామాన్యము. ఒకప్పుడు ఆయన కోనసీమలో గోదావరి నది మీదనుంచి పడవలో వెళ్తున్నారు. ఒక ఒడ్డున దిగి నడిచి వెళ్తున్నారు. అక్కడ ఒక బ్రాహ్మణుడు సంధ్యావందనము చేస్తూ “కాటన్ ఋషయేనమః” అని నమస్కారము చేసారు. ఇది విన్న కాటన్ కి తన పేరు తప్ప ఏమి అర్థము కాలేదు. అక్కడ ఉన్న ఇంకొక ఆయన్ని పిలిచి, ఆయన ఏమంటున్నారు అని అడిగారు. మీరే కాటన్ అని ఆయనకు తెలియదు కానీ మీకే ఆయన నమస్కారము చేస్తున్నారు. ఆశ్చర్యపోయిన కాటన్ ఆ బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్లి ఎందుకలా చేసారు అని అడిగారు. దానికి ఆ బ్రాహ్మణుడు “ఋషి అంటే ఎవరు? లోకము యొక్క క్షేమము కోసం తపించేవారు. ఇక్కడున్న రైతుల కోసము ఇంత కష్టపడి, గోదావరి మీద ఆనకట్ట కట్టి, ఇన్ని లక్షల ఎకరాలు సాగు అవ్వటానికి కారణము అయిన మీరు నా దృష్టిలో ఒక ఋషి. అందుకే మీకు కూడా నమస్కారము చేస్తూ సంధ్యావందనములో ఈ మంత్రము చెప్పాను” అన్నారు.
దానికి కాటన్ “ఈ దేశ ప్రజలకు ఎంత సంస్కారము! ఎంత కృతఙ్ఞతా లక్షణము!” అని సర్ ఆర్థర్ కాటన్ ఎంతో ఆనందించారు. మనిషికి ఇవ్వటములో ఒక గొప్ప సంతోషము ఉంటుంది. అందుకే “the hands that give are holier than the lips that pray”. ఇచ్చే చేతులు అంత పవిత్రము. ఒకరి కంటి నీరు తుడవటము కోసం ముందుకు వచ్చిన చెయ్యి, ఓదార్చటానికి చేసిన ప్రయత్నము, తన చుట్టూ ఉన్న వారికి ఉపకారము చెయ్యాలన్న తాపత్రయము మనిషిని మనిషిగా నిలబెడుతుంది. అలా బ్రతికిన వారెవరో,అట్టి మనుషులే మహానీయులౌతారు…..