*** హ్యామ్‌స్ర్టింగ్ స్ర్టెచ్:
కాళ్లు కొద్దిగా ఎడం పెట్టి, ఇద్దరూ ఎదురెదురుగా నిలుచుని, చేతులు చాచండి. ఇప్పుడు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని, కుడి మోకాలిని వంచుతూ, నిదానంగా ఎడమ కాలిని వెనక్కు తీసుకువెళ్లండి. శరీరం బరువంతా కుడి మోకాలిపైనే ఉండాలి. మళ్లీ మునుపటి పొజిషన్‌కు వచ్చేయండి. ఇదే విధంగా ఎడమ మోకాలిని వంచి చేయండి. ఇలా నిమిషంలో ఎన్ని సాధ్యమైతే అన్ని ప్రయత్నించండి.
*** చెస్ట్ ఓపెనర్:
ఇద్దరూ వెనక్కి తిరగండి. అంటే వీపులు ఎదురెదురుగా ఉండాలి. చేతులు వెనక్కు పెట్టండి. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని, ఒకరినొకరు లాగుతున్నట్టు నెమ్మదిగా ఒక్కో అడుగు ముందుకు కదపండి. అలా సాధ్యమైనంత స్ర్టెచ్ చేసి, ఐదు లెక్కపెట్టే వరకు ఉండి, తరువాత మొదటి భంగిమలోకి రండి. ఇలాగే మళ్లీ చేస్తూ, కౌంట్ పెంచుతూ వెళ్లండి.
*** ఇన్నర్-థై స్ర్టెచ్:
ఎదురెదురుగా నేలపై కూర్చొని, కాళ్లను వీలైనంత ఎడంగా జాపండి. చేతులు ముందుకు చాచి, పట్టుకోండి. మోకాళ్లు వంగకూడదు. ఇప్పుడు ఒకళ్లనొకళ్లు లాగుతూ సాధ్యమైనంత ముందుకు వంగండి. తొడ కండరాల్లో కొద్దిగా నొప్పి అనిపిస్తుంది. ఇలా ఎన్ని సార్లు చేయగలిగితే అన్నిసార్లు చేయండి.