Fashion

వెండి మాస్కు

Telugu fashion news - Silver corona masks hit markets

కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ముఖానికి మాస్క్‌లు ధరించడం మనకు అలవాటుగా మారింది. దాంతో ఒక్కోప్రాంతంలో ఒక్కోరకం మాస్క్‌లు కనిపిస్తున్నాయి. పార్టీల కార్యకర్తలు ఆయా పార్టీల జెండా రంగులు, గుర్తులను మాస్క్‌లుగా తయారుచేయగా.. మహిళలకు నప్పేలా పలు వెరైటీ మాస్క్‌లు కూడా మార్కెట్‌ను ముంచెత్తాయి. చీర, జాకెట్‌కు మ్యాచింగ్‌ రంగుల్లో మాస్క్‌లు ఇప్పుడు ఫ్యాషన్‌గా మారాయి. కర్ణాటక రాష్ట్రంలోని వెండి తయారీకి ప్రసిద్ధి చెందిన బెళగావి స్వర్ణకారులు ఓ అడుగు ముందుకేసి వెండి మాస్క్‌లను తయారుచేశారు. వివాహ వేడుకల్లో ధరించేందుకు వెండితో మాస్క్‌లు మార్కెట్లోకి వచ్చాయి. కర్ణాటకతోపాటు మహారాష్ట్రలో కూడా వీటిని విరివిగా వినియోగిస్తున్నారు. ఒక్కో వెండి మాస్క్‌ రూ.2,500 నుంచి రూ.3 వేల వరకు ఉంటున్నది. వీటిని ధరించేందుకు ఉన్నతస్థాయి వర్గాల వారు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ మాస్క్‌ను మళ్లీ మళ్లీ వినియోగించవచ్చు. ఉతకడం, ఆరేయడం వంటివి అవసరం లేదు. వెరైటీ డిజైన్లతో ఈ వెండి మాస్క్‌లు అందరినీ విశేషంగా ఆకట్టుకొంటున్నాయి.