ఆన్లైన్ సెర్చ్, వ్యాపార ప్రకటనలలో గూగుల్ తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ అమెరికాలో ప్రభుత్వ, ప్రభుత్వ నియంత్రణ సంస్థలు దావా వేయడానికి సిద్ధపడుతున్నాయని తెలుస్తోంది. ఆ మేరకు అమెరికా న్యాయ శాఖ, పలు రాష్ట్రాల నుంచి అటార్నీ జనరల్‌లు దావా వేసే అవకాశం ఉందని దర్యాప్తునకు దగ్గరి సంబంధమున్న గుర్తుతెలియని వ్యక్తులను ఉటంకిస్తూ ‘ద వాల్ స్ట్రీట్ జర్నల్’ తన కథనంలో పేర్కొంది. ముందుగా న్యాయ శాఖ పిటిషన్‌ను దాఖలు చేయవచ్చని.. ఆ తర్వాత టెక్సాస్ అటార్నీ జనరల్ కెన్ పాక్స్టన్, ఇతర రాష్ట్రాలకు చెందిన అటార్నీలు కూడా కేసులు వేయవచ్చని అందులో వివరించింది. న్యాయ శాఖ, పాక్స్టన్లతో చర్చలు జరుగుతున్నాయని గూగుల్ అంగీకరించినప్పటికీ.. ఆ వివరాలను బయటకు వెల్లడించడానికి నిరాకరించింది. ‘మా దృష్టి ఎపుడూ వినియోగదార్లకు, వేల కొద్దీ వ్యాపారులకు సేవలు అందించడంపైనే ఉంటుంది. పోటీని పెంచడానికి కట్టుబడి ఉంటామ’ని ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, గూగుల్ 2013లోనూ ఇదే తరహా ఆరోపణలను ఎదుర్కొంది. అయితే ఎటువంటి చర్యలనూ ఎదుర్కోలేదు.
గూగుల్‌పై అమెరికా ప్రభుత్వం కేసులు
Related tags :