DailyDose

హువావేపై సరికొత్త ఆంక్షలు-వాణిజ్యం

USA Imposes New Sanctions On Huawei-Telugu Business News

* రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తన రూ.53,125 కోట్ల రైట్స్‌ ఇష్యూకు మే 20 నుంచి వాటాదార్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జూన్‌ 3ను చివరి తేదీగా ప్రకటించింది. భారత్‌లోనే అతిపెద్దదైన ఈ రైట్స్‌ ఇష్యూను కంపెనీ ఏప్రిల్‌ 30న ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతీ 15 షేర్లకు ఒక షేరు చొప్పున కేటాయించనున్న ఈ ఇష్యూకు రికార్డు తేదీని మే 14గా నిర్ణయించిన విషయం విదితమే. ఆ తేదీ నాటికి రిలయన్స్‌ షేర్లు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉంటుందన్నమాట. ఆ మేరకు మే 20న ఇష్యూ మొదలు పెట్టి జూన్‌ 3న ముగించాలని బోర్డు డైరెక్టర్లు మే 15న జరిగిన సమావేశంలో నిర్ణయించారని కంపెనీ ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో తెలిపింది. ఏప్రిల్‌ 30 తేదీ నాటి ధరపై 14 శాతం డిస్కౌంట్‌ ధర అయిన రూ.1257తో షేర్లను కేటాయించనున్నప్పటికీ.. అప్పటి నుంచీ షేరు పెరుగుతూనే వచ్చింది. శుక్రవారం ట్రేడింగ్‌ ముగిసే సమయానికి రూ.1458.90 వద్ద స్థిరపడింది. అయితే రైట్స్‌ ఇష్యూ ధరలో మార్పు లేదు.

* ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌’లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 20లక్షల 97వేల కోట్లతో ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వివిధ భాగాలుగా ప్యాకేజీ కేటాయింపులను వివరించారు. బుధవారం ప్రకటించిన తొలి ప్యాకేజీలో(పార్ట్‌-1) లో 5,94,550కోట్ల విలువైన ఉద్దీపనలు ప్రకటించారు. పార్ట్‌-2లో 3,10,000 కోట్లు, పార్ట్‌-3లో 1,50,000 కోట్లు, పార్ట్‌-4,5లలో 48,000 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇవన్నీ కలిపి రూ. 11,02,650కోట్లు అవుతున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇదివరకే ప్రకటించిన ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన ద్వారా రూ 1,92,800కోట్లు, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించిన ఉద్దీపనల మొత్తం రూ 8,01,603కోట్ల కలిపి 9,94,403కోట్లు గా లెక్కకట్టారు. ఇలా పలు విడతల్లో ప్రకటించిన ప్యాకేజీ మొత్తం విలువ రూ. 20,97,053కోట్లు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

* ప్రముఖ సోషల్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ వినియోగదారుల కోసం పేమెంట్స్‌ ఆప్షన్‌ను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి బీటా వర్షన్‌ కూడా అందుబాటులోకి వచ్చింది. దాదాపు పదిలక్షల మంది యూజర్లతో ఈ ప్రయోగాత్మక వర్షన్‌ కొనసాగుతోంది. ఈ సమయంలో మెసేజింగ్‌ యాప్‌లో ఉన్న పేమెంట్స్‌ ఆప్షన్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉందన్న విమర్శలూ వచ్చాయి. దీనిపై వచ్చిన ఆరోపణలపై కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ)కు ఫిర్యాదు కూడా అందింది. తాజాగా ఈ విషయంపై సీసీఐ సమీక్ష చేస్తున్నట్లు సమాచారం. సమీక్ష అనంతరం సీసీఐ ఈ వ్యవహారంపై పూర్తి దర్యాప్తుకు ఆదేశించడం లేదా విచారణకు అనర్హమైనదిగా తేల్చే అవకాశం ఉంది.

* ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌.. బ్రిటన్‌లో పసిద్ధి చెందిన స్పోర్టింగ్‌ మోటార్‌సైకిళ్ల కంపెనీ నార్టన్‌ను కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు ఒప్పందం విలువ రూ.153 కోట్లు అని టీవీఎస్‌ వెల్లడించింది. ఈ ఒప్పందంలో భాగంగా బ్రిటన్‌లోని నార్టన్‌కు చెందిన ఆస్తుల్ని, బ్రాండ్లను అక్కడి టీవీఎస్‌ అనుబంధ సంస్థ స్వాధీనం చేసుకోనుంది. నార్టన్‌ మోటార్‌సైకిల్స్‌ను 1898లో ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జేమ్స్‌ లాన్స్‌డౌన్‌ నార్టన్‌ అనే వ్యక్తి ప్రారంభించారు. ఈ కంపెనీ క్లాసిక్‌ మోటార్‌సైకిళ్ల ఉత్పత్తికి బాగా ప్రసిద్ధి పొందింది. నార్టన్‌కు చెందిన వీ4, డామినేటర్‌, కమాండో 961 కేఫ్‌ రేసర్‌ ఎంకే-2, కమాండో 961 స్పోర్ట్‌ ఎంకే-2లు మోడళ్లు బాగా ప్రసిద్ధిపొందాయి.

* చైనా కంపెనీ హువావెపై అమెరికా ప్రభుత్వం కొత్త ఆంక్షలను విధించింది. విదేశాల్లో సెమీ కండక్టర్ల డిజైన్‌, ఉత్పత్తి విషయంలో అమెరికా సాంకేతికతను వినియోగించకుండా గతంలో విధించిన ఆంక్షలను హువావె ఉల్లంఘించకుండా చూడాలని అమెరికా భావిస్తున్నట్లు ఆ దేశ వాణిజ్య మంత్రి విల్బర్‌ రాస్‌ శుక్రవారం పేర్కొన్నారు. ‘సాంకేతికతంగా ఉన్న లొసుగులను ఉపయోగించి హువావె అమెరికా సాంకేతికతను ఉపయోగించుకుంటోంద’ని ఆయన పేర్కొన్నారు. అమెరికా-చైనాల మధ్య వివాదాల్లో ఈ కంపెనీ కూడా ఒక భాగం అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. దేశ రక్షణ విషయంలో హువావె వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని అమెరికా అధికారులు ఆరోపిస్తూనే ఉన్నాయి. అయితే కంపెనీ ఆ విషయాలను ఖండిస్తోంది. అమెరికా సాంకేతిక దిగ్గజాలకు పోటీదారుగా ఎదుగుతున్న కంపెనీని ఇబ్బందుల పాలు చేసేందుకే భద్రతపరమైన హెచ్చరికలను దుర్వినియోగం చేస్తోందని చైనా ప్రభుత్వం సైతం ఆరోపిస్తూనే ఉంది.