Movies

కథ తర్వాత కాసులు

Nabha Natesh On Her Priorities

‘‘దర్శకులు, నిర్మాతలు ఎవరైనా నన్ను సంప్రదిస్తే… ముందు కథ గురించి తెలుసుకుంటాను. కథ వినడానికి ఆసక్తి చూపిస్తా. కథ, అందులో పాత్ర నచ్చితే… అంతా బావుందని అనిపిస్తే… అప్పుడు పారితోషికం గురించి చర్చిస్తా. అంతే కానీ, ముందే ‘ఎంతిస్తారు?’ అంటూ డబ్బుల ప్రస్తావన తీసుకురాను’’ అని నభా నటేశ్‌ అన్నారు. తెలుగు తెరకు ‘నన్ను దోచుకుందువటే’తో కథానాయికగా పరిచయమైన ఈ కన్నడ కస్తూరి, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో భారీ విజయం అందుకున్నారు.తర్వాత రవితేజతో ‘డిస్కో రాజా’ చేశారు. ప్రస్తుతం తెలుగులో సాయి తేజ్‌ సరసన ‘సోలో బతుకే సో బెటర్‌’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ సరసన ‘అల్లుడు అదుర్స్‌’ చేస్తున్నారు. తెలుగులో పేరొచ్చిన తర్వాత కన్నడ నిర్మాతలు వస్తే పట్టించుకోవడం లేదనీ, ఎక్కువ పారితోషికం డిమాండ్‌ చేస్తున్నారని ఆమెపై విమర్శలు వచ్చాయి. వాటిని నభా నటేశ్‌ దృష్టికి తీసుకువెళ్లగా ‘‘అవునా? సినిమాపై నాకు ఆసక్తి లేకపోతే డబ్బుల గురించి డిస్కస్‌ చేయను. ఏ భాషలో అయినా సరే! నిర్మాతలెవరూ ‘పారితోషికం ఎంత?’ అని నా దగ్గరకు రారు. నాకు తెలిసీ, ఈ మధ్య ఎవరినీ నేను ఎక్కువ డబ్బులు అడగలేదు. తెలుగు సినిమాకు నేనెంత తీసుకుంటున్నాననేది నా సక్సెస్‌, మార్కెట్‌ మీద ఆధారపడి ఉంటుంది. ప్రతిదీ డబ్బుతో ముడిపెట్టి చూడడం నాకు అలవాటు లేదు. ఓ సినిమాలో నేను నటించాలనుకుంటే, ఆసక్తి ఉంటే… నేనే ముందడుగు వేస్తా. నా తరపున పారితోషికం విషయంలో ఎవరైనా బేరసారాలు సాగించారేమో నాకు తెలియదు. కన్నడ పరిశ్రమలో చాలామందితో నేను టచ్‌లో ఉన్నాను. కన్నడ సినిమాలపై నేను ఆసక్తి చూపించడం లేదని కొందరు అనుకుంటున్నట్టు నాదృష్టికి వచ్చింది. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలే. నాటకరంగ నేపథ్యం నుండి వచ్చిన నేను… మంచి పాత్ర వస్తే ఏ భాషలోనైనా నటించడానికి సిద్ధమే’’ అన్నారు.